బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : శుక్రవారం, 6 జులై 2018 (09:30 IST)

ఉరేసుకున్నా ఏమీకాదన్న పిచ్చి భక్తి.. మర్రి చెట్టు ఊడల్లా వేలాడలనీ...

దేశరాజధాని ఢిల్లీని ఉలిక్కిపడేలా చేసిన 11 మంది సామూహిక ఆత్మహత్యల కేసులోని మిస్టరీని పోలీసులు క్రమంగా ఛేదిస్తున్నారు. ఉరేసుకున్నా ఏమీకాదన్న పిచ్చి భక్తిలో మునిగిపోయిన ఆ కుటుంబ సభ్యులంతా... మర్రి చెట్టు ఊడల్లా వేలాడాలని నిర్ణయించుకుని ఈ దారుణానికి పాల్

దేశరాజధాని ఢిల్లీని ఉలిక్కిపడేలా చేసిన 11 మంది సామూహిక ఆత్మహత్యల కేసులోని మిస్టరీని పోలీసులు క్రమంగా ఛేదిస్తున్నారు. ఉరేసుకున్నా ఏమీకాదన్న పిచ్చి భక్తిలో మునిగిపోయిన ఆ కుటుంబ సభ్యులంతా... మర్రి చెట్టు ఊడల్లా వేలాడాలని నిర్ణయించుకుని ఈ దారుణానికి పాల్పడ్డారు.
 
ఇటీవల ఢిల్లీలోని బురారీ ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన 12 మందిలో 11 మంది సామూహికంగా ఆత్మహత్య చేసుకున్న విషయం తెల్సిందే. ఈ ఆత్మహత్యల వెనుక రహస్యాన్ని పోలీసులు దాదాపుగా ఛేదించారు. ఆ ఇంట్లో లభించిన పుస్తకాల్లోని రాతలను లోతుగా విశ్లేషించగా, అసలు నిజం తెలుస్తోంది. 
 
ఈ నోటు పుస్తకాల్లోని రాతల ప్రకారం... నారాయణ్‌ దేవి భర్త, ఆ ఇంటి పెద్ద భూపాల్‌ సింగ్‌ 2007లో మరణించారు. దీనిని కుటుంబ సభ్యులెవరూ జీర్ణించుకోలేకపోయారు. మరీ ముఖ్యంగా చిన్న కుమారుడు లలిత్‌ భాటియా మానసిక పరిస్థితి బాగా దిగజారింది. తండ్రి తనను ఆవహించాడంటూ ఆయనలా మాట్లాడటం మొదలుపెట్టాడు. పైనుంచి తండ్రి ఆదేశిస్తున్నాడంటూ నోట్‌బుక్‌లలో ఏవేవో రాసేవాడు. అప్పటిదాకా ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న కుటుంబం... మెల్లగా కుదుటపడింది. ఇదంతా తండ్రి ఆశీర్వాదమే అని వారంతా భావించారు. 
 
అదేసమయంలో నారాయణ్‌ దేవి మినహా మిగిలిన వారంతా లలిత్‌ భాటియాను 'డాడీ' అనే పిలిచేవారు. కష్టాలన్నీ పూర్తిగా తొలగిపోయేందుకు వారంపాటు వట వృక్ష పూజ చేశారు. ఈ క్రియలో అంతిమ ఘట్టంగా 'ధన్యవాదాలు చెప్పడం' పేరిట మర్రిచెట్టు ఊడల్లాగా వేలాడాలని నిర్ణయించుకున్నారు. 'ఇలా చేస్తే చనిపోతాం' అని వారు ఏ కోశానా భావించలేదు. మొత్తం కుటుంబ సభ్యులు లలిత్‌ భాటియా ప్రభావంలో మునిగిపోయారు. 
 
శనివారం రాత్రి భావ్నేశ్‌ భాటియా భార్య సవిత, కూతురు నీతు కలిసి బయటికి వెళ్లి స్టూళ్లను తీసుకొస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. అర్థరాత్రి దాటిన తర్వాత... 'క్రియ'లో భాగంగా అందరూ ఉరి వేసుకుని చనిపోయారు. లలిత్‌ భాటియా భార్య సోదరి మమత కుటుంబం కూడా కష్టాల్లో ఉందని... అవి తొలగిపోయేందుకు ఆమెతో కలిసి ఇదే క్రియ మరోమారు నిర్వహించాలని పుస్తకంలో రాసిపెట్టుకున్నారు. దీన్ని బట్టి చూస్తే... వారు తమ మరణాన్ని అసలు ఊహించలేదని స్పష్టమవుతోంది.