గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 4 జులై 2018 (13:25 IST)

కేజ్రీకి ఊరట: ఢిల్లీ సర్కారుపై పెత్తనం చెలాయిస్తే కుదరదు.. సుప్రీం సీరియస్

కేంద్ర ప్రభుత్వానికి ఢిల్లీ ప్రభుత్వ పాలనాపరమైన విషయాల్లో ఆధిపత్యం చలాయించే అధికారం లేదని సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేసి రాజ్యాంగం నిర్దేశించిన సమాఖ్

కేంద్ర ప్రభుత్వానికి ఢిల్లీ ప్రభుత్వ పాలనాపరమైన విషయాల్లో ఆధిపత్యం చలాయించే అధికారం లేదని సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేసి రాజ్యాంగం నిర్దేశించిన సమాఖ్య ప్రభుత్వ స్పూర్తిని కాపాడాలని సూచించింది.


ప్రజల్లో ఆదరణ పొందడం కోసం ప్రభుత్వం ఎన్నుకోబడిన అసలు కారణాన్ని విస్మరిస్తే సహించేది లేదని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా పేర్కొన్నారు. దీంతో అధికార నిర్వహణకు సంబంధించి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టులో ఊరట లభించింది.
 
ప్రభుత్వ వ్యవహారాల్లో లెఫ్టినెంట్ గవర్నర్ మితిమీరిన జోక్యం చేసుకుంటున్నారని కేజ్రీవాల్ నిరసనకు దిగిన నేపథ్యంలో.. ఢిల్లీ ప్రభుత్వంతో కలిసి లెఫ్టినెంట్ గవర్నర్ సమన్వయంతో నిర్ణయాలు తీసుకోవాలే తప్ప పెత్తనం చలాయించే అధికారం లేదని మిశ్రా వెల్లడించారు. ప్రభుత్వానికి, లెఫ్టినెంట్ గవర్నర్‌కు మధ్య విభేదాలు తలెత్తితే పరిష్కరించాల్సిన బాధ్యత రాష్ట్రపతిపై ఉందని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది.
  
మొత్తం మీద సుప్రీం కోర్టు తీర్పును పరిశీలిస్తే.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు పాలనాపరంగా మరింత స్వేచ్ఛనిచ్చినట్లు.. లెఫ్టినెంట్ గవర్నర్‌ పాత్రపై పరిమితులు విధిస్తున్నట్లు అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో సుప్రీం ఇచ్చిన ఈ కీలక తీర్పుపై అరవింద్ కేజ్రీవాల్ హర్షం వ్యక్తం చేశారు.

ఈ మేరకు సీఎం అరవింద్ కేజ్రీవాల్ తన ట్విట్టర్ ఖాతాలో స్పందించారు. ఇది ఢిల్లీ ప్రజలు సాధించిన ఘన విజయమని వ్యాఖ్యానించారు. ఇన్నాళ్లకు ప్రజాస్వామ్యం గెలిచిందన్నారు.