ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : శుక్రవారం, 3 ఆగస్టు 2018 (13:28 IST)

దిగివచ్చిన మోడీ సర్కారు.. సుప్రీంకోర్టుకు కేఎం జోసెఫ్

కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకుదిగివచ్చింది. ఉత్తరాఖండ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ కేఎం జోసెఫ్‌ను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమిస్తూ సుప్రీంకోర్టు కొలీజియం తీసుకున్న నిర్ణయానికి ఆమోదముద్ర వేసింది. దీంతో గత క

కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకుదిగివచ్చింది. ఉత్తరాఖండ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ కేఎం జోసెఫ్‌ను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమిస్తూ సుప్రీంకోర్టు కొలీజియం తీసుకున్న నిర్ణయానికి ఆమోదముద్ర వేసింది. దీంతో గత కొన్ని నెలలుగా సాగుతున్న వివాదానికి తెరపడినట్టయింది.
 
నిజానికి జోసెఫ్ పేరును ఈ ఏడాది జనవరి 10వ తేదీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా సారథ్యంలోని కొలీజియం సిఫారసు చేసింది. అయితే ఆయనకు తగినంత సీనియారిటీ లేదంటూ కొలీజియం సిఫారసును కేంద్రం ఏప్రిల్ నెలలో వెనక్కి పంపింది. దీనిపై అనేక విమర్శలతోపాటు.. దేశ వ్యాప్తంగా చర్చకూడా జరిగింది. 
 
ముఖ్యంగా, 2016లో ఉత్తరాఖండ్‌లో హరీష్ రావత్ సర్కార్‌ను రద్దు చేసి కేంద్రం విధించిన రాష్ట్రపతి పాలనను కేఎం. జోసెఫ్ కొట్టేశారు. ఇది మనసులో పెట్టుకొనే కేంద్రం ఆయన పేరును పరిశీలించడం లేదన్న విమర్శలు వచ్చాయి. 
 
ఈనేపథ్యంలో గత నెల 16వ తేదీన మరోసారి జోసెఫ్ పేరును సిఫారసు చేస్తూ కొలీజియం కేంద్రానికి ప్రతిపాదన పంపించింది. అదే రోజు మిగతా ఇద్దరు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు ఇందిరా బెనర్జీ, వినీత్ శరణ్ పేర్లను కూడా ప్రతిపాదించింది. ఈ ముగ్గురి పేర్లను కేంద్రం ఆమోదించింది. 
 
అంతేకాదు కొలీజియం పలు హైకోర్టు చీఫ్ జస్టిస్‌ల కోసం పంపిన పేర్లకు కూడా కేంద్ర ప్రభుత్వం ఓకే చెప్పింది. దీంతో కొన్ని నెలలుగా సాగుతున్న వివాదానికి కేంద్రం తెరదించినట్టయింది.