నెలసరి సమయంలో మహిళలు వంట చేస్తే కుక్కలుగా.. ఎద్దులుగా?

swami krishna swaroop
సెల్వి| Last Updated: బుధవారం, 19 ఫిబ్రవరి 2020 (10:53 IST)
swami krishna swaroop
స్వామి కృష్ణ స్వరూప్ మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నెలసరి సమయంలో మహిళలు వంట చేయడంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పురుషులను వంట నేర్చుకోవాలని కూడా సూచన చేశారు. వివరాల్లోకి వెళితే, గుజరాత్‌లోని భుజ్‌లో కృష్ణస్వరూప్ మందిరం వుంది. ఈ మందిరం సభ్యులు సహజానంద గాళ్స్ ఇనిస్టిట్యూట్ నిర్వహిస్తున్నారు.

అమ్మాయిలు నెలసరి సమయంలో వంటగదిలోకి వచ్చి ఇతరులతో కలిసి భోజనం చేయకూడదన్న నిబంధన ఇక్కడ ఉంది. ఇటీవల ఈ నిబంధన ఉల్లంఘించారన్న కారణంతో 68 మంది విద్యార్థినుల లోదుస్తులు విప్పించి మరీ పరిశీలించిన విషయం వెలుగులోకి రావడం తీవ్ర సంచలనమైంది. ఈ కేసులో ప్రిన్సిపాల్‌తోపాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ కేసు నడుస్తుండగానే తాజాగా గుజరాత్‌తో కృష్ణస్వరూప్ దాస్‌జీ వీడియో క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో కృష్ణస్వరూప్ మాట్లాడుతూ.. నెలసరి సమయంలో భర్తలకు వంట చేసి పెట్టే భార్యలు మరుజన్మలో ఆడకుక్కలుగా, ఆ వంట తిన్న పురుషులు వచ్చే జన్మలో ఎద్దులుగా పుడతారని చెప్పారు. ఇది తాను చెబుతున్న విషయం కాదని, శాస్త్రాల్లో ఉన్నదే తాను చెప్పానని పేర్కొన్నారు.

ఈ విషయాలన్నీ చెప్పడం తనకు ఇష్టం లేదంటూనే, మిమ్మల్ని హెచ్చరించాలనే ఉద్దేశంతో చెప్పినట్టు కృష్ణ స్వరూప్ వివరించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. స్వామీజీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తన అభిప్రాయాలను మీరు అంగీకరించినా.. అంగీకరించకపోయినా.. తనకేం ఒరిగేదేమీ లేదన్నారు.దీనిపై మరింత చదవండి :