శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 21 మే 2020 (20:46 IST)

ఆకలిని తట్టుకోలేక శునక మాంసం భుజించిన వలస కూలీ.. ఎక్కడ?

కరోనా వైరస్ వ్యాప్తి అడ్డుకట్ట చర్యల్లో భాగంగా దేశ వ్యాప్తంగా లాక్డౌన్ అమలవుతోంది. మార్చి 25వ తేదీ నుంచి అమలవుతున్న ఈ లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన వలస కూలీలు ఆకలితో అలమటిస్తున్నారు. సొంతూళ్ళకు పోయేందుకు దారిలేక... పూట గడవక తీవ్ర అవస్థలు పడుతున్నారు. మరికొందరు అయితే, వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న తమ సొంతూళ్ళకు రోడ్డులు వెంబడి నడచి వెళుతున్నారు. అలాంటి వలస కూలీల్లో ఒకరు ఆకలి బాధను తట్టుకోలేక శునక మాంసం భుజించాడు. 
 
ఈ హృదయ విదారక దృశ్యం రాజస్థాన్ రాష్ట్రంలోని ఢిల్లీ - జైపూర్ జాతీయ రహదారిలో షహ్‌పురా వద్ద కనిపించింది. ఈ రహదారిపై చనిపోయిన శునకం ఒకటి ఆ వలస కూలీకి కనిపించింది. అంతే.. ఆ మాంసం భుజించాడు. ఈ దృశ్యాన్ని ఆ రహదారిలో కారులో వెళుతున్న ఓ వ్యక్తి చూసి.. వీడియో తీసి, ఆ వలస కూలీకి ఆహారం, నీళ్లు ఇచ్చి క్షుద్బాధను తీర్చాడు. 
 
ఈ వీడియోను కారు యజమాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. ఇంతకంటే సిగ్గుచేటైన చర్య మరొకటి లేదని వాపోతున్నారు. అంతేకాకుండా, జాతీయ రహదారిపై అన్ని వాహనాలు వెళుతుంటే ఏ ఒక్కరు కూడా శునక మాంసం భుజిస్తున్న వలస కూలీ పట్ల సానుభూతి చూపక పోవడం చాలా విచారకరమన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో నెటిజన్ల మధ్య వైరల్ కాగా, వలస కూలీల అవస్థలు కళ్ళకు కట్టినట్టు చూపించింది.