శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 17 జులై 2020 (11:56 IST)

కరోనా దెబ్బకు తలకిందులు .. కూరగాయలు అమ్ముతున్న కోచ్‌లు

కరోనా వైరస్ ప్రతి ఒక్కరి జీవితాలను తలకిందులు చేసింది. అనేక సెలబ్రిటీలకు ఇపుడు పూటగడవడం కష్టంగా మారింది. ఇలాంటిలో సినీ హీరోలు, బుల్లితెర నటీనటులు, క్రీడాకారులు, క్రికెటర్లు, ఇలా అన్ని రంగాల వారు ఉన్నారు. తాజాగా ముంబై మహానగరంలో పలువురు కోచ్‌లు పూటగడవడం కోసం కూరగాయలు అమ్ముతున్నారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ముంబైకి చెందిన ఫుట్‌బాల్‌ కోచ్‌లు ప్రసాద్‌ భోంస్లే, సిద్ధేశ్‌ శ్రీవాస్తవ, సమ్రాట్‌ రాణాలు కరోనా మహమ్మారి దెబ్బకు ఉపాధిని కోల్పోయారు. దీంతో పూట గడవడం కోసం భోస్లే కూరగాయలు అమ్ముతుండగా.. శ్రీవాస్తవ ఇంట్లో కబాబ్‌లు తయారు చేస్తున్నాడు. రాణా డెలివరీ బాయ్‌గా మారాడు. 
 
'వ్యాయామ విద్యలో మాస్టర్స్‌ డిగ్రీ చేసిన నాకు కూరగాయలు విక్రయించాల్సిన దుస్థితి దాపురించింది. మొదట్లో నామోషీగా అనిపించినా.. మనపై ఆధారపడిన వారి ఆకలిని తీర్చడానికి ఏ పనైనా చేయక తప్పదనిపించింది' అని భోంస్లే చెప్పుకొచ్చాడు. 
 
శ్రీవాస్తవ కూడా రెండు పాఠశాలలతోపాటు ఓ ఫుట్‌బాల్‌ అకాడమీలో కోచ్‌గా పని చేసేవాడు. కానీ, గతనెల జీతాలు ఇవ్వలేమని తన కాంట్రాక్ట్‌ను రద్దు చేసినట్టు అతడు చెప్పాడు. వయోధికులైన తల్లిదండ్రుల పోషణ కోసం కబాబ్‌లు అమ్ముతున్నట్టు శ్రీవాస్తవ వెల్లడించాడు. 
 
కాగా.. సీఎస్‌పీఐ ఫుట్‌బాల్‌ అకాడమీకి సమ్రాట్‌ రాణా ప్రధాన కోచ్‌. ఈ అకాడమీకి ముంబైలో తొమ్మిది బ్రాంచ్‌లు ఉన్నాయి. జూనియర్‌ ఐలీగ్‌ జట్టుకు రాణా కోచింగ్‌ ఇస్తాడు. రాణా సోదరుడు కూడా ఫుట్‌బాల్‌ కోచ్‌గానే పని చేస్తున్నాడు. కానీ, కరోనా మహమ్మారితో వీరిద్దరూ నిరుద్యోగులుగా మారారు. తాను రెస్టారెంట్‌లో డెలివరీ బాయ్‌గా జీవితాన్ని నెట్టుకొస్తున్నట్టు రాణా తెలిపాడు. ఇలా కరోనా కారణంగా ఎన్నో జీవితాలు తలకిందులయ్యాయి.