శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 23 అక్టోబరు 2019 (18:19 IST)

ఆ మాతృప్రేమికుడి ఆచూకీ తెలిపితే కారు బహమతిగా ఇస్తా : ఆనంద్ మహీంద్రా

ప్రతి ఒక్కరికీ అమ్మ అంటే అమితమైన ప్రాణం. కానీ, ఆ వ్యక్తి ప్రేమ మాత్రం ఎవరికీ అందనంత ఎత్తులో ఉందని చెప్పొచ్చు. అమ్మ కోసం ఏకంగా బ్యాంకు ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదులుకున్నాడు. పిమ్మట అమ్మ కోసం దేశ పర్యటనకు శ్రీకారం చుట్టారు. అలా ఇప్పటికీ 48 వేల కిలోమీటర్లు తిరిగారు. అమ్మ కోరిక మేరకు.. దేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలు, దేశ సరిహద్దు రాష్ట్రాలను సందర్శించారు. త్వరలోనే ఇండో-చైనా సరిహద్దు ప్రాంతానికి వెళ్లనున్నట్టు తెలిపారు. అయితే, అతని ఆచూకీ కోసం దేశ పారిశ్రామిక దిగ్గజాల్లో ఒకరైన ఆనంద్ మహీంద్రా వెతుకున్నారు. ఆయన ఆచూకీ తెలిపితే ఆయనకు ఏకంగా కారును బహుమతిగా ఇస్తానని ట్వీట్ చేశారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కర్నాటక రాష్ట్రంలోని మైసూర్ ప్రాంతానికి చెందిన వ్యక్తి దక్షిణామూర్తి కృష్ణకుమార్. ఓ బ్యాంకు ఉద్యోగి. ఈయన తల్లి ఓ సాధారణ గృహిణి. తండ్రి 20 యేళ్ల క్రితమే చనిపోయారు. అతని తల్లికి ఇపుడు 70 యేళ్లు. అయితే, తన ఏడు పదుల వయసులో ఏనాడు బయట ఊరికి వెళ్లింది లేదు. 
 
ఈ విషయాన్ని ఓ రోజున తల్లీబిడ్డల మధ్య జరిగిన సంభాషణల్లో వచ్చింది. కనీసం ఇంటికి దగ్గరలో ఉన్న సుప్రసిద్ధ దేవాలయం బేలూరు హలిబేడును కూడా చూడలేదని అనడంతో.. ఆయన ఓ నిర్ణయానికి వచ్చారు. వెంటనే తను చేస్తున్న బ్యాంకు ఉద్యోగం వదిలేసి.. దేశ పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఇందుకోసం 'మాతృసేవా సంకల్ప్' పేరుతో ఓ యాత్రను చేపట్టారు. 
 
దీనికోసం ఆయన 20 ఏళ్ల క్రితం నాటి స్కూటర్‌‌ను ఎంచుకున్నారు. ఈ స్కూటర్ కూడా తన తండ్రి కొనుగోలు చేసి వాడిన స్కూటర్. నాలుగేళ్ల క్రితం ఆయన మరణించారు. ఈ ప్రయాణంలో తమతో పాటు తన తండ్రి ఉంటారనే భావనతో స్కూటర్‌ను ఎంచుకున్నారు. 
 
ఈ యాత్రతో పాటు... స్కూటర్‌ ఎంపికపై దక్షిణామూర్తి స్పందిస్తూ, 'మేం ముగ్గురు కలిసి ప్రయాణించినట్టే ఉంటుంది. ఆయన లేరనే ఆలోచన నాకు అస్సలు లేదు' అంటూ ఉద్వేగానికి గురయ్యారు. 
 
కేరళ నుంచి మొదలు పెట్టుకుని అరుణాచల్ ప్రదేశ్ వరకు దాదాపు అన్ని ప్రాంతాలు చుట్టేశారు. అలా 2018 జనవరి 18న ప్రారంభమైన వీరి ప్రయాణం.. 48,100 కిమీ.లు పూర్తి చేసింది. దేశంలోని ప్రాంతాలనే గాక, సరిహద్దు దేశాలైన మయన్మార్, భూటాన్, నేపాల్‌కు కూడా వెళ్లొచ్చారు. దేవాలయాలు, సుప్రసిద్ధ ప్రాంతాలను ఆమెకు కృష్ణ కుమార్ చూపించారు.
 
ఈ విషయాన్ని మనోజ్ కుమార్ అనే వ్యక్తి తెలుసుకుని తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు. దీన్ని సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే ఆనంద్ మహీంద్రా కంటపడింది. అంతే.. మనోజ్ కుమార్‌కు ఆయన రీ ట్వీట్ చేశారు. 
 
'ఇది అందమైన కథ. ఇందులో మాతృప్రేమ మాత్రమే కాదు.. దేశభక్తి కూడా దాగుంది. షేర్ చేసినందుకు కృతజ్ఞతలు మనోజ్. అతన్ని నాకు పరిచయం చేస్తే.. మహీంద్రా కేయూవీ 100 ఎన్ఎక్స్‌టీ బహూకరిస్తాను. తమ తర్వాతి యాత్రను దానిలో చేయొచ్చు' అని చెప్పుకొచ్చారు.