ఎన్టీఆర్ బయోపిక్... తలపట్టుకుని కూర్చున్న క్రిష్... ఎందుకు??
ఎన్‌టిఆర్… ఈ పేరు సినిమాకు మారుపేరు. రాజకీయాలకు పెట్టింది పేరు. ఆయన కథానాయకుడు మాత్రమే కాదు… మహానాయకుడు కూడా. తెలుగు వెండితెరపై ఎలా ఇలవేల్పుగా వెలుగొందారో…. రాజకీయ యవనికపై అంతే వైభవంతో నీరాజనాలు అందుకున్నారు. సినిమా రంగం నుంచి తారాజువ్వలా ఎగిసి, రాజకీయ రంగంలో ఆటంబాంబులా పేలిన ఆయన ప్రస్థానం ఓ సంచలనం.
ఇప్పుడు ఇదంతా ఎందుకంటే… ఎన్‌టిర్ జీవిత చరిత్ర ఆధారంగా రెండు సినిమాలు తీస్తున్నారు. సినీ జీవిత విశేషాలతో ‘కథానాయకుడు’, రాజకీయ విశేషాలతో ‘మహానాయకుడు’ ఇలా రెండు భాగాలుగా తీస్తున్నారు. ఈ చిత్రాలను ఎన్నికలకు ముందుగా జనవరిలో విడుదల చేయబోతున్నారు. ఎన్‌టిఆర్ తనయుడు నందమూరి బాలకృష్ణ తన తండ్రి పాత్రను పోషిస్తున్నారు. రానా చంద్రబాబు పాత్రలో కనిపించబోతున్నారు. ఇంకా చాలా పాత్రల్లో చాలామంది నటిస్తున్నారు. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.
కథానాయకుడు భాగం ఎన్‌టిఆర్ సినీరంగ ప్రవేశం, ఆయన నటుడిగా ఎదిగిన తీరు అన్నీ ఈ భాగంలో కనిపిస్తాయి. ఈ సినిమా ఎలాగైనా తీసేయొచ్చు. ఇబ్బంది లేదు. వచ్చిన సమస్యల్లా… రెండో భాగం ‘మహానాయకుడు’తోనే. ఎందుకంటే ఇందులో అనేక వివాదాస్పద అంశాలను చూపించాల్సి వుంటుంది. లక్ష్మీపార్వతిని సాకుగా చూపించి ఎన్‌టిఆర్‌ను ముఖ్యమంత్రి పీఠం నుంచి దించేశారు అప్పటి అసమ్మతివర్గం. అప్పుడు ఎన్‌టిఆర్ దశమ గ్రహం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ విషయాలను ఈ సినిమాలో చూపించరనేది ఇప్పటికే తేలిపోయింది.
ఇప్పుడు మరో సమస్య వచ్చిపడింది. తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్‌తో పొత్తు కుదుర్చుకుంది. తెలంగాణలో రెండు పార్టీలూ కలిసి పోటీ చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోనూ పోటీ చేయనున్నాయి. ఎన్‌టిఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించింది కాంగ్రెస్‌ను సవాలు చేస్తూనే. ఒకవిధంగా అప్పటిదాకా తిరుగులేని కాంగ్రెస్ పార్టీపై తిరుగుబాటు వంటిది ఎన్‌టిఆర్ రాజకీయరంగ ప్రవేశం. ఆయన ఎప్పుడూ ‘దుష్ట కాంగ్రెస్’ అనేవారు. మహానాయకుడి సినిమాలో… ఈనాడు కాంగ్రెస్ పార్టీ ఎంత నియంతృత్వంగా ఉండేదో చూపించకుంటే ఎన్‌టిఆర్ తెలుగుదేశం పార్టీని ఎందుకు స్థాపించారో అర్థంకాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్‌ను ఆ విధంగా చూపిస్తారా..? అనేదే ప్రశ్న. చంద్రబాబూ మంచివారే, కాంగ్రెస్సూ మంచిదే అయితే… ఎన్‌టిఆర్‌కు విలన్ ఎవరు..? అనేది ప్రశ్న.
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. కాంగ్రెస్‌తో పొత్తు కుదరక మునుపు రాసుకున్న కథ. ఎన్నికల్లో ప్రయోజనాన్ని ఆశించి తీస్తున్న సినిమాలు. మరి ఇప్పుడు కథను మార్చుతారా? కాంగ్రెస్ ప్రస్తావన తగ్గించేస్తారా? లేక ఎన్‌టిఆర్‌ను పదవీచ్యుతున్ని చేసిన నాదేండ్ల భాస్కర్‌రావు, ఆ తరువాత ఎన్‌టిఆర్ జీవిత భాగస్వామిగా వచ్చిన లక్ష్మీపార్వతిలను మాత్రమే విలన్‌లుగా చూపించి సినిమాను చుట్టేస్తారా… అనేది చూడాలి.
మొత్తంగా బలమైన విలన్ లేని హీరోగా ఎన్‌టిఆర్ మిగిలిపోతారా… సినిమాలో చూడాల్సిందే. ఐతే విలన్ పాయింట్ బలంగా లేకపోతే తేడా కొట్టేస్తుందని చాలామంది చెప్తుండటంతో దర్శకుడు క్రిష్ కూడా తల పట్టుకుని కూర్చుంటున్నట్లు టాలీవుడ్ సినీ జనం చెప్పుకుంటున్నారు. మొత్తానికి క్రిష్ ముందు వున్న సవాల్ సామాన్యమైంది కాదు సుమా...