మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : గురువారం, 5 సెప్టెంబరు 2019 (15:12 IST)

కాశ్మీర్ మా మెడ నరమంటున్న పాకిస్థాన్... సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం

భారత్ - పాకిస్థాన్ దేశాల సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొనివుంది. దీనికి పాకిస్థాన్ చర్యలు నిప్పుకు ఆజ్యం పోసేలా ఉన్నాయి. సరిహద్దులకు భారీ సంఖ్యలో సైన్యం బలగాలను తరలిస్తోంది. దీంతో సరిహద్దుల్లో యుద్ధవాతావరణం నెలకొంది. 
 
పీవోకేలోని నియత్రణ రేఖకు 30 కిలోమీటర్ల దూరంలో బాగ్, కోట్లీ సెక్టార్లలో 2 వేల మందికి పైగా సైనికులను మోహరింపజేసిందని ఇండియన్ ఆర్మీ తెలిపింది. అయితే, ప్రస్తుతం వీరు దాడి చేసే యత్నాల్లో లేరని, ప్రశాంతంగా ఉన్నారని వెల్లడించింది. 
 
వీరి కదలికలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని తెలిపింది. కాశ్మీర్‌లో ఉగ్రకార్యకలాపాలకు మళ్లీ ఆజ్యం పోస్తున్న పాకిస్థాన్... ఇదే సమయంలో సరిహద్దుల్లో  బలగాలను పెంచుతుండటం గమనార్హం. 
 
మరోవైపు, కాశ్మీర్‌పై పాకిస్థాన్ ఆర్మీ అధికార ప్రతినిధి అసిఫ్ గఫూర్ స్పందించారు. కాశ్మీర్ తమ మెడ నరం అని, దానికోసం ఎంతకైనా తెగిస్తామంటూ హెచ్చరికలు చేశారు. పాక్ ఆర్మీ హెడ్‌ క్వార్టర్స్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో గఫూర్ మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్ విషయంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయం సరైంది కాదన్నారు. 
 
'కాశ్మీర్ మా మెడ నరం. దానిని రక్షించుకునేందుకు ఎందాకైనా వెళ్తాం' అని హెచ్చరించారు. భారత నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్ పేరును గఫూర్ ప్రస్తావిస్తూ భారత్ పరోక్షంగా పాక్‌పై దాడిని కొనసాగిస్తోందని ఆరోపించారు.
 
'భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని మోడీ రద్దు చేసి అనైతిక చర్యకు పాల్పడ్డారు. ఇది ఇకపై భావజాల వివాదం కాదు' అని ఆయన వ్యాఖ్యానించారు. యుద్ధాలు కేవలం ఆయుధాలతోనే కాకుండా దేశభక్తితోనూ జరుగుతాయన్నారు. భారత దాడులకు పాక్ ప్రతిస్పందన ఆర్థిక వ్యవస్థ, దౌత్యం, ఆర్థిక, మేధస్సు చుట్టూ తిరుగుతోందన్నారు. 
 
పాక్‌ను బలహీన పరిచే చర్యలు తీసుకోవాలని భారత్ బహుశా భావిస్తుండవచ్చని, అయితే, యుద్ధాలు ఆయుధాలు, ఆర్థిక వ్యవస్థతోనే కాకుండా దేశభక్తితోనూ జరుగుతాయని భారత్‌కు చెప్పాలనుకుంటున్నామని గఫూర్ పునరుద్ఘాటించారు.