గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By
Last Modified: బుధవారం, 4 సెప్టెంబరు 2019 (22:04 IST)

మోదీతో కలసి చంద్రయాన్ 2 ల్యాండింగ్‌ వీక్షించేందుకు ఎంపికైన శ్రీకాకుళం విద్యార్థిని

తెలుసుకోవాలనే జిజ్ఞాస, గురువుల ప్రోత్సాహం ఓ తెలుగు విద్యార్థినికి అరుదైన అవకాశాన్ని కలిగించాయి. ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 తుది అంకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి వీక్షించే అవకాశాన్ని కల్పించాయి.

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా తలసముద్రం అనే మారుమూల గ్రామానికి చెందిన ప్రగడ కాంచన బాలశ్రీ వాసవికి ఈ అవకాశం అంత తేలిగ్గా మాత్రం లభించలేదు. వేలాది మంది విద్యార్థులతో పోటీ పడి ఆమె ఈ ఘనత సాధించారు. ఈ అవకాశం ఎలా దక్కింది.. ఎంత కష్టమైన ప్రశ్నలు వచ్చాయి వంటి వివరాలన్నీ ఆమె ‘బీబీసీ తెలుగు’తో పంచుకున్నారు.
 
ఎంపిక ఎలా ..
చంద్రయాన్-2 ప్రయోగంపై విద్యార్థుల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఇస్రో ఒక వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది. చంద్రయాన్-2 సాఫ్ట్ లాంచింగ్‌ను దేశ ప్రధానితో కలిసి వీక్షించే అవకాశాన్ని విద్యార్థులకు కల్పిస్తూ ఇటీవల ఒక క్విజ్ ప్రోగ్రాం పెట్టింది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల విద్యార్థులకు ఈ అవకాశం కల్పించింది. ఆగస్టు 10 నుంచి 25వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో నిర్వహించిన ఈ క్విజ్ ప్రోగ్రాంకు 8 నుంచి 10 తరగతి విద్యార్థులు మాత్రమే అర్హులుగా పేర్కొంది. దీనికి దేశవ్యాప్తంగా భారీగా స్పందన వచ్చింది.
 
వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి క్విజ్‌లో అత్యధిక మార్కులు సాధించిన ఇద్దరు విద్యార్థులను ఈ కార్యక్రమంలో భాగంగా ఎంపిక చేశారు. ఇలా ఎంపికైన విద్యార్థుల్లో ఏపీలోని ఈదులవలస గ్రామంలోని ఏపీ మోడల్ స్కూల్‌లో 10వ తరగతి చదువుతున్న కాంచన ఒకరు.
ఫోటో కర్టెసీ-ఇస్రో
 
'ఫిజిక్స్ టీచర్ ప్రోత్సాహంతో..'
చిన్నప్పటి నుంచి అంతరిక్షం, విశ్వ రహస్యాలను తెలుసుకోవాలనే కోరికే తాను ఈ కార్యక్రమానికి ఎంపికయ్యేలా చేసిందని కాంచన అన్నారు. ఆమె బీబీసీతో మాట్లాడుతూ ''ఆగస్టు 15న మా స్కూల్‌లో మైల్ స్టోన్ ఆఫ్ ఇండియా ఇన్ స్పేస్ ప్రోగ్రాం అనే అంశంపై డిబేట్ పెట్టారు. దానిలో పాల్గొనేందుకు చాలా శ్రమించా. జులై 22న చంద్రయాన్ ప్రయోగం మొదలుపెట్టినప్పుడు మా స్కూల్‌లో ప్రొజెక్టర్ ద్వారా విద్యార్థులందరికీ చూపించారు. అప్పుడే చంద్రయాన్ మీద నాకు బాగా ఆసక్తి ఏర్పడింది'' అని ఆమె పేర్కొన్నారు.
 
ఫిజిక్స్ టీచర్ కృష్ణారావు ప్రోత్సహం మరవలేనిదని, ఆయన వల్లే తాను ఈ కార్యక్రమానికి ఎంపికయ్యానని కాంచన తెలిపారు. ''చంద్రయాన్ 2కు సంబంధించిన స్పేస్ క్విజ్ గురించి ఫిజిక్స్ టీచర్ కృష్ణారావు మాకు చెప్పారు. స్కూల్‌లో దాదాపు 50 మంది ఆ క్విజ్‌లో పాల్గొన్నాం. 10 నిమిషాల వ్యవధిలోనే దాదాపు 20 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. లేదంటే వెబ్‌సైట్ లాగౌట్ అవుతుంది. చాలా కష్టమైన ప్రశ్నలు వచ్చాయి. గతంలో స్పేస్ ప్రోగ్రాంకు సంబంధించిన డిబేట్‌లో పాల్గొనడంతో అన్ని ప్రశ్నలకు నిర్ణీత వ్యవధిలోనే సమాధానాలిచ్చా'' అని ఆమె తెలిపారు.
 
ఎంపికైన విషయం ముందుగా అమ్మ నుంచే విన్నానని కాంచన చెప్పారు. ''ఈ క్విజ్‌లో చాలా మంది పోటీపడ్డారు. నాకు వస్తుందని ఊహించలేదు. నేను ఎంపికైనట్లు అమ్మకు ఇస్రో నుంచి ఫోన్ చేశారు. ఆ విషయం తెలియగానే అందరూ నన్ను అభినందించారు. ఈ నెల 7న బెంగళూరులో ప్రధాని మోదీతో కలిసి చంద్రయాన్ 2 ప్రయోగాన్ని వీక్షించనున్నా. నాతో పాటు మా అమ్మను కూడా అక్కడికి తీసుకెళ్లొచ్చని చెప్పారు'' అని ఆనందంతో తెలిపారు.
 
'ఇంజినీర్ అవుతా'
భవిష్యత్తులో ఇంజినీర్‌గా స్థిరపడాలనుకుంటున్న కాంచన తండ్రి ఆరేళ్ల కిందటే చనిపోయారు. ''మేం ఇద్దరం. చెల్లెలు మా స్కూల్‌లోనే చదువుతోంది. నాన్న చిన్నప్పుడే చనిపోయారు. అమ్మే మమ్మల్ని పెంచుతుంది. చంద్రయాన్ 2ను చూడటానికి అమ్మను కూడా తీసుకెళ్తునందుకు ఆనందంగా ఉంది'' అని కాంచన చెప్పారు.