తొలి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంకు ప్రధాని మోదీ శంకుస్థాపన: క్రికెట్ దిగ్గజాలు హాజరు
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలోని గంజరిలో తొలి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంకు ప్రధాని నరేంద్ర మోదీ శనివారం శంకుస్థాపన చేశారు. ఈ స్టేడియాన్ని రూ.450 కోట్లతో 30 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. స్టేడియం కోసం భూమిని సేకరించేందుకు రూ.121 కోట్లు వెచ్చించగా, బీసీసీఐ దీని నిర్మాణానికి రూ.330 కోట్లు ఖర్చు చేయనుందని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. ఈ స్టేడియం డిసెంబర్ 2025 నాటికి పూర్తయ్యే అవకాశం ఉన్నది.
ఈ శంకుస్థాపన కార్యక్రమానికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, దిలీప్ వెంగ్‌సర్కార్, మదన్ లాల్, గుండప్ప విశ్వనాథ్, గోపాల్ శర్మ, రవిశాస్త్రిలతో పలువురు ప్రముఖులు హాజరయ్యారు. వీరితో పాటు బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, సెక్రటరీ జే షా తదితరులు పాల్గొన్నారు.