1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 8 మార్చి 2022 (12:51 IST)

బరువు తగ్గేందుకు పూర్తి ద్రవపదార్థాలు: షేన్ వార్న్‌కి అందుకే గుండెపోటు వచ్చిందా?

బరువు తగ్గేందుకు సహజ పద్ధతుల్లో వెళితే హాని పెద్దగా వుండదని అంటారు. అలాగే కొంతమంది ఫిట్నెస్ కోసం విపరీతంగా వ్యాయామం చేస్తుంటారు, అలాంటివారు కూడా గుండెపోటుకి గురై మరణించిన ఉదంతాలు వున్నాయి. కన్నడ నటుడు పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో మరణించే కొన్ని గంటల ముందు విపరీతంగా వ్యాయామం చేసినట్లు వెల్లడైన సంగతి తెలిసిందే.

 
ఇక అసలు విషయానికి వస్తే... ఆస్ట్రేలియా లెజెండ్ క్రికెటర్ షేన్ వార్న్ గత శుక్రవారం మార్చి 4న థాయిలాండులో గుండెపోటుతో మరణించారు. ఆయనకి గుండెపోటు రావడానికి కారణం... బరువు తగ్గేందుకు పూర్తిగా ద్రవపదార్థాలను ఆశ్రయించడమేనని పలువురు వైద్యు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

 
షేన్ వార్న్ ఫిబ్రవరి 28న ఓ ట్వీట్ చేసారు. తన రూపాన్ని మునుపటి విధంగా మార్చుకునేందుకు కఠోర ఆహార నియమాలను పాటిస్తున్నట్లు చెప్పారు. ఘన పదార్థాలకు పూర్తిగా స్వస్తి చెప్పేసి ద్రవ పదార్థాలను తీసుకుంటున్నట్లు తేలింది. దీనితో ఒక్కసారిగా శరీరం మార్పులకు లోనవుతుందనీ, ఫలితంగా గుండెపై తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్యులు చెప్తున్నారు. ఘన పదార్థాలను వదిలేసి ద్రవ పదార్థాలను తీసుకుంటూ వుండటంతో గుండెపై భారం పెరిగి గుండెపోటుకి లోనై వుండొచ్చని అంటున్నారు.

 
తన ఆహారంలో మార్పులు చేసుకున్న తర్వాత తన గుండెలో ఏదో కాస్త నొప్పిగా వున్నట్లు కొన్నిరోజుల ముందుగా వైద్యుడ్ని సంప్రదించారట వార్న్. కానీ అది మామూలైన విషయంగా రూఢికి వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తమ్మీద తన బరువును తగ్గించుకునేందుకు పూర్తిగా లిక్విడ్ ఫుడ్ తీసుకోవడం వల్ల షేన్ వార్న్ చనిపోయినట్లు వాదనలు వస్తున్నాయి.

 
ఐతే షేన్ వార్న్ మరణం సహజమైనదనీ పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. ఏదేమైనప్పటికీ శరీరం అనేది అసాధారణ నిర్ణయాలు తీసుకుంటే వ్యతిరేకించడం చాలామంది విషయాల్లో చూసాం. అదే నిజం కావచ్చు కూడా. అందుకే ఒకేసారి అలవాట్లను మార్చుకోవడం అనేది ఆరోగ్యానికి చాలా ప్రమాదం అని తెలుసుకోవాలి. అది కూడా వైద్యుల పర్యవేక్షణ లేకుండా ఏదీ ఆచరించకూడదు.