గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 15 డిశెంబరు 2020 (11:33 IST)

రజనీకాంత్ కొత్త పార్టీ పేరు అదేనా? ఎన్నికల గుర్తుగా ఆటోరిక్షా!?

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ అరంగేట్రం ఖరారైంది. ఈ నెలాఖరులో ఆయన తన కొత్త పార్టీపై ఓ స్పష్టత ఇచ్చి, జనవరి నెలలో కొత్త పార్టీ పేరును ప్రకటించనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు కూడా చకచకా జరిగిపోతున్నాయి. 
 
ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. రజనీకాంత్ తన కొత్త పార్టీ పేరును మక్కల్ సేవై కట్చి (ప్రజా సేవ పార్టీ)గా నిర్ణయించినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు ఆయన భారత ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ చేయించినట్టు సమాచారం.
 
అలాగే, ఎన్నికల గుర్తుగా తనకు అత్యంత ఇష్టమైన, ప్రీతిపాత్రమైన ఆటోరిక్షాను ఎంచుకున్నట్టు తెలుస్తోంది. రజనీకాంత్ గతంలో నటించిన బాషా చిత్రంలో ఆటోడ్రైవర్‌ పాత్రలో జీవించిన విషయం తెల్సిందే.
 
పైగా, తాను రాజకీయ పార్టీని స్థాపించేది ప్రజలకు సేవ చేయడం కోసమని, అందువల్ల పార్టీ పేరు కూడా మక్కల్ సేవై కట్చిగా నామకరణం చేసి, దానికి ఎన్నికల గుర్తుగా ప్రతి ఒక్కరికీ తెలిసే ఆటోరిక్షాను ఎంచుకున్నట్టు వినికిడి. 
 
అయితే, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తలను ఇటు రజనీకాంత్ వర్గాలు గానీ, అటు కేంద్ర ఎన్నికల సంఘం వర్గాలు గానీ ధృవీకరించలేదు. కేవలం సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.