సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 11 డిశెంబరు 2020 (16:09 IST)

మరో 'ఎన్టీఆర్' కావాలని... సైకిల్ గుర్తుపై కన్నేసిన 'బాషా'

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లో రావడం ఖాయమైపోయింది. తన కొత్త పార్టీ ఏర్పాటుపై ఈ నెలాఖరులో ఆయన ప్రకటన చేయనున్నారు. ఆ తర్వాత జనవరి నెలలో ఈ పార్టీని ప్రారంభిస్తారు. పార్టీ ప్రారంభించిన తర్వాత రాష్ట్ర శాసనసభ ఎన్నికలను ఎదుర్కొనేందుకు ఆయన కేవలం ఐదు నెలల సమయం మాత్రమే ఉంటుంది. 
 
అయినప్పటికీ ఆయన ఎన్నికల కోసం ఆయన సైకిల్ గుర్తును ఎంచుకోవాలని భావిస్తున్నారు. ఎందుకంటే, గతంలో తెలుగు ప్రజల ఆరాధ్యదైవం, సినీ నటుడు ఎన్.టి.రామారావు కూడా అసెంబ్లీ ఎన్నికలకు ముందు అంటే కేవలం 8 నెలల సమయం ఉండగా తెలుగుదేశం పార్టీని స్థాపించి, అతితక్కువ కాలంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఆయన ఎంచుకున్న గుర్తు సైకిల్.  
 
ఇపుడు రజనీకాంత్ కూడా సైకిల్ గుర్తునే ఎంచుకోనున్నట్టు సమాచారం. ఇప్పటికే రజనీకాంత్ రాజకీయ సలహాదారులు కూడా భారత ఎన్నికల సంఘంలో సైకిల్ గుర్తును రిజిస్టర్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. కాగా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రాంతీయ పార్టీ అయిన సమాజ్‌వాదీ పార్టీ కూడా ఇదే ఎన్నికల గుర్తును ఎంచుకున్న విషయం తెల్సిందే.