శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By జె
Last Updated : సోమవారం, 30 నవంబరు 2020 (19:39 IST)

తలైవా, భాజపాతో మనకు వద్దనే వద్దు: రజినీకాంత్‌తో అభిమానులు

రజినీకాంత్ ఇక పార్టీ పెట్టడం ఖాయం. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తాడు. రాబోయే ఎన్నికల్లో సత్తా చాటుతాడు. సిఎం అవుతాడు. ఇది అభిమానులు ఊహించుకున్నది. కానీ ఊహలన్నీ పేకమేడల్లా కూలిపోయాయి. ఎప్పటిలాగే తూతూమంత్రంగా రజినీకాంత్ సమావేశాన్ని పూర్తిచేసుకుని వెనుతిరిగి వెళ్ళిపోయారు. అయితే ఈసారి మాత్రం అభిమానుల నుంచి చాలా ఇబ్బందిపడాల్సి వచ్చింది రజినీకాంత్‌కు.
 
తమిళనాడులో నెలకొన్న రాజకీయ అనిశ్చితి, రాజకీయ సమీకరణాల బట్టి రజినీ పార్టీ పెట్టాలి. రాజకీయాల్లోకి రావాలన్నది అభిమానుల ఆలోచన. అభిమానుల ఒత్తిడితో రజినీ రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. అది కూడా 2017 సంవత్సరం డిసెంబర్ 31వ తేదీ రాజకీయాల్లోకి వస్తున్నట్లు చెప్పారు. 
 
కానీ ఆ తరువాత నుంచి అంటే సరిగ్గా మూడేళ్ళు పూర్తవుతున్నా పార్టీ పేరు మాత్రం ప్రకటించలేదు రజినీకాంత్. ఇది కాస్త అభిమానుల్లో తీవ్ర నిరాశను మిగిల్చింది. కానీ ఈరోజు జరిగిన రజినీ మక్కల్ మండ్రం సమావేశంలో మాత్రం కీలకంగా మారుతుంది, పార్టీ పేరును రజినీ ప్రకటించి తీరుతారని అందరూ భావించారు.
 
అయితే అదంతా కేవలం రజినీకాంత్ వినడానికి మాత్రమే పనికొచ్చింది కానీ.. ఎప్పటిలాగే సైలెంట్‌గా వెళ్ళిపోయారు. తమిళనాడు రాష్ట్రంలోని 30 మందికి పైగా మక్కల్ మండ్రం కార్యదర్సులతో మాట్లాడారు రజినీకాంత్. వారి అభిప్రాయాలను స్వీకరించారు. అందరూ బిజెపితో ఎలాంటి మద్ధతు వద్దు.. వారితో మనకు అస్సలు పనేలేదు. సొంతంగా మనమే పార్టీ పెట్టుకుని జనంలోకి వెళదామన్నారు. 
 
ఒకరిద్దరు కాదు.. అందరూ ఇదే విషయంపై ఏకాభిప్రాయంతో నిలిచారు. దీంతో రజినీకాంత్ కూడా ఆలోచనలో పడ్డారు. కానీ ఎలాంటి ప్రకటన అక్కడ చేయకుండా మీడియాతో మాట్లాడారు రజినీ. నేను అందరితో మాట్లాడాను. ఎవరికి వారు వారి అభిప్రాయాలను చెప్పారు. నేను త్వరలోనే నా నిర్ణయాన్ని వెల్లడిస్తానంటూ వెళ్ళిపోయారు. అయితే రజినీ తన పుట్టినరోజు నాడు  పార్టీ ప్రకటించే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు.