మంగళవారం, 5 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: శనివారం, 12 డిశెంబరు 2020 (14:41 IST)

రజనీకాంత్: రాజకీయాల్లో సూపర్‌స్టార్ ముందున్న సవాళ్లు ఏమిటి?

విలనిజం ఉట్టిపడే ప్రతినాయకుడిగా రజనీకాంత్ సినిమాల్లోకి అడుగుపెట్టారు. క్రమంగా తమిళ సినిమాను శాసించే స్థాయికి ఆయన ఎదిగారు. ఇప్పుడు ముఖ్యమంత్రి పదవే లక్ష్యంగా రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారు. ఆయన సినీ ప్రస్థానమేమీ పూల పాన్పుకాదు. ఎన్నో అవరోధాలను దాటుకుంటూ ఆయన ముందుకు వచ్చారు. అయితే, రాజకీయ జీవితంలో ఇంతకంటే కఠినమైన సవాళ్లనే ఆయన ఎదుర్కోవాల్సి ఉంటుంది.

 
1975లో ప్రముఖ డైరెక్టర్ బాలచందర్.. రజనీని వెండితెరకు పరిచయం చేశారు. బాగా పెరిగిన గడ్డం, చిందరవందరగా కనిపించే జుట్టుతో వచ్చిన ఆయన తమిళ సినీ రంగంలో సూపర్‌స్టార్ అవుతారని అప్పుడు ఎవరూ ఊహించి ఉండరు. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టే నడక తీరు, స్టైల్‌తో రజనీ ఉన్నత శిఖరాలను చేరారు. ఒకానొక సమయంలో ఆసియాలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటుడిగా తొలి పేరు ఆయనదే వినిపించేది. దేశానికి వెలుపల కూడా ఆయనకు వీరాభిమానులు ఉన్నారు. 1980, 90ల్లో రజనీకాంత్ అంటే ఒక మ్యాజిక్. విలన్ నుంచి సూపర్‌స్టార్ వరకు ఆయన ప్రస్థానాన్ని చూస్తే ఏదో కనికట్టు చేసినట్లు అనిపిస్తుంది.

బెంగళూరులో..
రజనీ అసలు పేరు శివాజీ రావు గైక్వాడ్. రానోజీ రావు, రమా బాయి దంపతులకు 1949, డిసెంబరు 12న బెంగళూరులో నాలుగో సంతానంగా ఆయన జన్మించారు. ఇంటిలో అందరికంటే ఆయనే చిన్నవాడు. బెంగళూరులోని కావిపురం స్కూల్, బసవనగుడి ప్రీమియర్ మోడల్ స్కూళ్లలో రజనీ చదువుకున్నారు. చిన్నప్పటి నుంచే ఆయనకు సినిమాలపై విశేషమైన ఆసక్తి ఉండేది. ఒకసారి అయితే, పరీక్షల ఫీజు కోసం దాచి పెట్టిన డబ్బులతో చెన్నైకి కూడా వెళ్లిపోయారు. ఎన్నో కష్టాలుపడినా ఆయనకు అవకాశాలు మాత్రం తలుపుతట్టలేదు. దీంతో మళ్లీ బెంగళూరు వెళ్లిపోయి.. స్టేట్ ట్రాన్స్‌పోర్ట్ బోర్డులో కండక్టర్‌గా ఉద్యోగంలో చేరారు.

 
కండక్టర్‌గా పనిచేసేటప్పుడూ రజనీకి ప్రత్యేక స్టైల్ ఉండేది. అప్పుడు కూడా ఆయనకు అభిమానులు ఉండేవారు. అప్పట్లో కొన్ని నాటకాల్లో కూడా రజనీ నటించారు. 1973-74ల్లో మళ్లీ తన అదృష్టం పరీక్షించుకోవడానికి ఆయన చెన్నైకి వచ్చి ద ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరారు. ఇక్కడకు ప్రసంగించేందుకు కే బాలచందర్ వచ్చారు. అప్పుడే ఆయనతో పరిచయం ఏర్పడింది.

 
బాలచందర్‌తో ఏర్పడిన తొలి పరిచయాలు రజనీకి ఎలాంటి అవకాశాలు తెచ్చిపెట్టలేదు. అప్పట్లో రజనీ తమిళం అంతంత మాత్రంగా ఉండేది. పదాలను విరిచి విరిచి కృతకంగా ఆయన మాట్లాడేవారు. దీంతో తమిళం బాగా నేర్చుకోమని బాలచందర్ సూచించారు. అవకాశాల కోసం ఎంతో ఎదురుచూసినప్పటికీ రజనీకి కాలం కలిసి రాలేదు. దీంతో మళ్లీ తన కండక్టర్ ఉద్యోగం కోసం ఆయన బెంగళూరు వచ్చేశారు.

 
అయితే, కొన్ని నెలల తర్వాత ఆయనకు బాలచందర్ నుంచి ఫోన్ వచ్చింది. ఒక సినిమాలో చిన్న రోల్ కోసం ఆయన్ను పిలిపించారు. చివరగా ఆయన్ను ఆ పాత్రకు ఎంచుకున్నారు కూడా. అప్పుడే తన పేరును శివాజీ రావు నుంచి రజనీకాంత్‌గా ఆయన మార్చుకున్నారు. ‘‘అపూర్వ రాగాంగల్’’ సినిమాతో ఆయన తెరంగేట్రం చేశారు. ఈ సినిమాతో తమిళ ప్రేక్షకుల మనసులో రజనీ స్థానం సంపాదించారనే చెప్పాలి. ఆ తర్వాత ‘‘మూండ్రు ముడిచు’’ చిత్రంలోనూ రజనీకి బాలచందర్ అవకాశం ఇచ్చారు.

విలనైనా... చక్కగా ఆదరించారు
ఎంజీఆర్‌ సినిమాల్లో విలన్‌గా నటించే నంబియార్‌ను తమిళ ప్రజలు తిట్టిపోసేవారు. కొందరైతే శాపాలు కూడా పెట్టేవారు. అయితే, అదే అభిమానులు రజనీని మాత్రం ఆస్వాదించేవారు. సిగరెట్ గాల్లోకి ఎగరేస్తూ రజనీ చేసే జిమ్మిక్కులకు వారు దాసోహమయ్యేవారు. 1975లో అరంగేట్రం అనంతరం, మూడేళ్లలోనే రజనీ 40 సినిమాల్లో నటించారు. పగలు రాత్రి తేడా చూడకుండా రజనీ పనిచేసేవారు. దీంతో ఆయన మానసిక ఆరోగ్యం ప్రభావితమైంది. తీవ్రమైన ఒత్తిడి నడుమ ఆయన ఆసుపత్రిలో చేరి చికిత్స కూడా తీసుకున్నారు. అనంతరం ధర్మయుద్ధం సినిమాలో రజనీ మ్యాజిక్ మరోసారి కనికట్టు చేసింది. ఈ సినిమాను ప్రేక్షకులు విశేషంగా ఆదరించారు.

 
ప్రతికూల పాత్రలను క్రమంగా తగ్గించుకుంటూ తనలోని హీరోకు ఆయన స్వాగతం పలికారు. తనదైన స్టైల్‌తోపాటు మాస్ హీరోకు ఉండే లక్షణాలన్నింటినీ రజనీ ఆవహింపచేసుకున్నారు. తన సినిమాలో కామెడీ సీన్లకు పెద్దపీట వేసేవారు. వరుస విజయాలతో రజనీ పేరు తమిళనాట మార్మోగింది. రజనీతో సినిమా చేస్తే.. విజయం పక్కా అనే భరోసా నిర్మాతల్లో పెరిగింది. తన అభిమానులకు ఏం కావాలో రజనీకి బాగా తెలుసు.

విప్లవాత్మక మార్పు..
1970 చివర్లో తమిళ సినీ రంగంలో విప్లవాత్మక మార్పులే వచ్చాయి. ఎంజీఆర్-శివాజీ గణేషన్‌ల శకం ముగిసింది. అప్పుడే రజనీ-కమల్ ద్వయం హవా మొదలైంది. వీరిద్దరూ 1970 చివరి నుంచి 1990ల చివరి వరకు తమిళ సినిమా పరిశ్రమను దున్నేశారనే చెప్పాలి. తమిళంలో హిట్ సినిమా అంటే.. అయితే రజనీ లేదా కమల్‌ పేరు దానిలో కచ్చితంగా ఉండేది.

 
తమిళంతోపాటు తెలుగు, కన్నడ, హిందీ పరిశ్రమల్లోనూ రజనీకి గుర్తింపు ఉంది. 1977లో విడులైన ‘‘పథినారు వయథినిలే’’ సినిమాకు 2,000 రూపాయల్ని పారితోషికంగా రజనీ పుచ్చుకున్నారు. అయితే, 1990ల చివరికి అత్యధిక పారితోషికం అందుకున్న నటుల జాబితాలో రజనీ పేరు నిలిచింది. మొదట్లో రజనీకి వ్యతిరేకంగా కొన్ని పత్రికల్లో వార్తలు వచ్చేవి. కానీ వాటిని ఆయన అంతగా పట్టించుకునేవారుకాదు. 1980 చివర్లో దేవుడిపై తనకున్న నమ్మకాన్ని రజనీ బయటపెట్టారు.

 
16-17వ శతాబ్దంనాటి స్వామీజీపై తెరకెక్కిన శ్రీరాఘవేంద్ర సినిమాలో రజనీ నటించారు. ఈ సినిమాకు నిర్మాత కూడా ఆయనే. ‘‘వళ్లి’’ లాంటి సినిమాలు ఆయనలో భక్తిని చాటిచెప్పాయి. అప్పటినుంచే ఆయన వెనుక రాజకీయ నీడలు కనిపించేవి. ‘‘అన్నామలై’’, ‘‘ముత్తు’’ సినిమాల్లో ఆయన చెప్పిన డైలాగులపై కొందరు రాజకీయ విశ్లేషణలు కూడా ఇచ్చారు. ‘‘బచ్చా’’ సినిమా విజయోత్సవ వేడుకలు, 1996 ఎన్నికల సమయంలో ఆయన చేసిన ప్రసంగాలతో జాతీయ స్థాయిలో ఆయనపై ఫోకస్ పడింది.

 
అప్పటినుంచి 2017 వరకు, రజనీ రాజకీయాల్లోకి వస్తారనే ఊహాగానాలు అలానే కొనసాగాయి. తన మనసులో మాటను 2017లోనే రజనీ బయటపెట్టారు. అయితే, ఎప్పుడు, ఎక్కడ, ఎలా? అనే ప్రశ్నలు మాత్రం అభిమానుల్ని వేధిస్తూనే ఉండేవి. ఆయన ఇలా తటపటాయించడం అభిమానులకు కొత్తేమీకాదు.

1996లో జయలలిత నేతృత్వంలోని అన్నాడీఎంకేపై రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమైంది. ఆ సమయంలో రజనీని రంగంలోకి దించేందుకు కాంగ్రెస్ శతవిధాలా ప్రయత్నించింది. అయితే, చివరి నిమిషంలో రజనీ వెనక్కి తగ్గినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పటికీ చాలా మంది రజనీ అభిమానులు అప్పటి విషయాల గురించి మాట్లాడుతుంటారు. ఆయన ఎప్పుడో రాజకీయాల్లోకి రావాల్సినవాడని చెబుతుంటారు.

 
1975లో ఓ చిన్న పాత్రతో సినీ రంగ ప్రవేశం నుంచి.. భిన్న భాషల్లో హీరో స్థాయికి రజనీ ఎదిగారు. సినిమాల్లో ఎలాంటి పాత్రనైనా చేయడానికి రజనీ వెనకడుగు వేసేవారు కాదు. కానీ, రాజకీయాల్లోనే ఆయన తటపటాయింపు కనిపిస్తుంటుంది. ఒక అడుగు ముందుకు వేస్తే.. రెండు అడుగులు వెనక్కి పడుతుంటాయి. ఇప్పుడు అందరినీ తొలిచేస్తున్న ప్రశ్న ఏమిటంటే.. రెండు ద్రవిడ పార్టీల నడుమ రజనీ ఎలాంటి రాజకీయా పాత్రను తలకెత్తుకుంటారు?

 
దైవానుగ్రహంతో అవినీతిరహిత రాజకీయాలు చేస్తానని ఆయన సంకేతాలు ఇచ్చారు. కరప్షన్ ఫ్రీ రిలిజియస్ పాలిటిక్స్‌కు పెద్దపీట వేస్తానని ఆయన చెప్పారు. తమిళనాడులో ప్రస్తుతమున్న రెండు ద్రవిడ పార్టీలకు అవినీతి మరకలు అంటుకున్నాయి. మరోవైపు వీరి సిద్ధాంతాల్లో ఇటు దేవుడు, అటు మతం రెండింటికీ చోటులేదు. అందుకే బహుశా అవినీతిపై పోరాటం, దైవాలను నమ్ముకుంటూ రజనీ ముందుకు వెళ్తుండొచ్చు.

అయితే, ఇంచుమించు బీజేపీదీ ఇదే వైఖరి. కమలనాథులు కూడా ఇలాంటి సిద్ధాంతాలనే నమ్ముతుంటారు. కాబట్టి వారికంటే తన పార్టీ ఎంత భిన్నమైనదో, ప్రత్యేకమైనదో రజనీ తెలియజెప్పాల్సి ఉంటుంది. ఒకప్పుడు ప్రతికూల పాత్రలకే పరిమితమైన రజనీ.. విలన్లు చీల్చి చెండాడే హీరోగా తమిళనాట ఎదిగారు. కెరియర్‌లో పతాక స్థాయిలో ఉన్నప్పుడే తన సిద్ధాంతాలను సినిమాల రూపంలో రజనీ నూరిపోసేవారు. అమ్మాయిలు ఎలా నడుచుకోవాలి? లాంటి విషయాలపై ఆయన సినిమాలతో చాలా సందేశాలు ఇచ్చారు. జయలలితకు వ్యతిరేకంగా వీటిని చెబుతున్నారని చాలామంది భాష్యాలు చేప్పేవారు.

 
పెరియార్‌పై వ్యాఖ్యల వివాదంలో నిరసనకారులకు క్షమాపణలు చెప్పేందుకు రజనీ నిరాకరించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టడం రజనీకి అసలు ఇష్టముండదనే కోణంలో అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే, రిజర్వేషన్లు, హిందీ, జల్లికట్టు.. ఇలా అన్ని అంశాలకు ఇక్కడ నిరసనలతో విడదీయరాని అనుబంధముంది. ఇక్కడ మతం అనేది ఎప్పుడూ చర్చలకు కేంద్ర బిందువుకాదు.

 
దీని ప్రకారం చూస్తే, పూర్తి భిన్నమైన సిద్ధాంతాలతో రజనీ ముందుకు వస్తున్నట్లు అనిపిస్తోంది. ఎన్నికల్లో గెలవాలంటే.. తన సిద్ధాంతాలను పూర్తిగా అర్థమయ్యేలా ఆయన ప్రజలకు వివరించాల్సి ఉంటుంది. 2021 ఎన్నికల రూపంలో ఆయన ముందుకు ఒక అవకాశం వస్తోంది. దీన్ని ఆయన ఎలా ఉపయోగించుకుంటారో చూడాలి మరి.

 
ఎంజీఆర్-శివాజీల స్థానాన్ని రజనీ-కమల్ భర్తీ చేసినప్పుడు ప్రజలు ఎర్రతివాచీ పరిచారు. రజనీని ఎంజీఆర్‌తో, కమల్‌ను శివాజీతో అభిమానులు పోల్చారు. కానీ ఈ పోలికలన్నీ సినిమాల వరకే. ఇప్పుడు రాజకీయాల విషయానికి వస్తే.. రజనీ ఎంజీఆర్‌లా మారతారో లేదా శివాజీ అవుతారో చూడాలి.