శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఎం
Last Modified: సోమవారం, 25 జనవరి 2021 (18:30 IST)

టీఆర్ఎస్ ఓ కంపెనీగా మారిపోయింది: ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సంచలన వ్యాఖ్యలు

పార్టీ ఓ కంపెనీగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు తెరాస ఎమ్మెల్యే రసమయి బాలకిషన్. స్వేచ్ఛ పోయిందన్నారు రసమయి. కవులు కళాకారుల మౌనం క్యాన్సర్ కంటే ప్రమాదకరమన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రముఖ కళాకారుడు రసమయి సంచలన వ్యాఖ్యలు చేశారు.
 
మాట... పాట అదుపులో పెట్టుకొని మాట్లాడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. స్వేచ్ఛ పోయిందని ఇలాంటి జీవితం నేను కోరుకోలేదని ఆయన వ్యాఖ్యానించారు. ఆకలిని అయినా చంపుకొని ఆత్మాభిమానంతో బతికేవాడిని తానన్నారు. అందరూ ఆశీస్సులు వల్లే ఈరోజు ఇక్కడ ఉన్నానన్నారు. పవర్ ఉంటేనే మాకు చప్పట్లు కొడుతుంటారు. పార్టీ ఓ కంపెనీగా మారిందని ఆవేదన వ్యక్తం చేసారు.
 
మహాబూబాబాద్‌లో ఒక సంస్మరణ సభలో మాట్లాడిన రసమయి రాజకీయాలపై కూడా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సోమవారం మహబూబాబాద్‎లో ప్రముఖ కవి జయరాజు తల్లి సంతాప సభలో మాట్లాడారు.
 
తాను అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉండటంతో తన సహజత్వాన్ని కోల్పోయానన్నారు. ప్రస్తుతం తానో లిమిటెడ్ కంపెనీలో పని చేస్తున్నానంటూ సంచలనం సృష్టించారు. తాను ఏమీ మాట్లాడలేని పరిస్థితిలో ఉండటంతో చాలా మందికి దూరమయ్యానన్నారు. ఎమ్మెల్యే రసమయి వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.
 
ప్రభుత్వ పథకాలను, సీఎం కేసీఆర్‌ను ప్రశంసిస్తూ అసెంబ్లీలో సైతం తన పాటలతో దుమ్ములేపిన రసమయి.. ఇప్పుడిలా మాట్లాడటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. చాలామందికి తాను దూరమయ్యానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ వచ్చాక పాటలు కూడా మారిపోయాయన్నారు. రసమయి వ్యాఖ్యలపై ఇప్పుడు పార్టీలో తీవ్ర చర్చ జరుగుతోంది.