రాత్రికిరాత్రే మారిపోయిన సీన్... ట్రంప్ కంచుకోటల్లో బైడెన్ జోరు!!
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఓట్ల లెక్కింపు శుక్రవారం సాయంత్రానికి ఓ కొలిక్కి వచ్చింది. అంటే.. దాదాపు 90 శాతం మేరకు ఓట్ల లెక్కింపు పూర్తయింది. భారత కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం వరకు డోనాల్డ్ ట్రంప్ అనేక చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. కానీ, రాత్రికి రాత్రే సీన్ మారిపోయింది. ట్రంప్ కంచు కోటలుగా భావించే చోట్ల డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ జోరు కొనసాగించారు. ఫలితంగా ట్రంప్ ఓటమి ఖరారైపోయింది. అయితే, ఈ ఓటమిని అధికారికంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల సంఘం ప్రకటించాల్సివుంది.
నిజానికి అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో గతంలో ఎన్నడూ లేనంత ఉత్కంఠ నెలకొంది. కౌంటింగ్‌ను ఆపేయాలని ట్రంప్, చివరి ఓటు వరకూ లెక్కబెట్టాలని జో బిడెన్.. ఇలా ఎవరి వాదన వారిది. ఈ వాదనల సంగతి ఎలా ఉన్నా.. అధ్యక్ష పదవిని వదులుకునేందుకు డొనాల్డ్ ట్రంప్ ఏమాత్రం సిద్ధంగా ఉన్నట్లు కనిపించడం లేదు.
ప్రస్తుత ట్రెండ్ మేరకు ఎక్కడ చూసిన జో బైడెన్ ఆధిక్యంలో ఉండటంతో ట్రంప్‌లో అసహనం పెరిగిపోతోంది. ప్రస్తుతం జో బిడెన్ 264 ఎలక్టోరల్ ఓట్లు సాధించగా, డొనాల్డ్ ట్రంప్ 214 ఎలక్టోరల్ ఓట్లు సాధించారు. అమెరికాలో కౌంటింగ్ ప్రక్రియ 45 రాష్ట్రాల్లో ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం ఉన్న ఫలితాల ట్రెండ్‌ను ఒక్కసారి పరిశీలిస్తే.. ట్రంప్ ఆధిక్యంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా జో బిడెన్ దూసుకొస్తున్న పరిస్థితి నెలకొంది.
అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం 5.30 గంటల సమయానికి జార్జియాలో 99 శాతం కౌంటింగ్ పూర్తయింది. బిడెన్ 917 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. నెవాడాలో 89 శాతం కౌంటింగ్ పూర్తి కాగా.. అక్కడ కూడా బిడెనే 11,438 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఒక్క పెన్సెల్‌వేనియాలో మాత్రమే ట్రంప్ 18,229 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
ఈ రాష్ట్రంలో 94 శాతం కౌంటింగ్ పూర్తయింది. అరిజోనా రాష్ట్రంలో 90 శాతం కౌంటింగ్ పూర్తి కాగా.. ఇక్కడా బిడెన్ 47,052 ఓట్ల ఆధిక్యాన్ని కనబరుస్తుండటం గమనార్హం. మొత్తంగా చూసుకుంటే.. గురువారం రాత్రి వరకూ ట్రంప్ ఆధిక్యంలో ఉన్న రాష్ట్రాల్లో శుక్రవారం ఉదయానికి సీన్ మారింది.
ఆ రాష్ట్రాల్లోనూ బిడెన్ ఆధిపత్యం కనిపిస్తోంది. ప్రస్తుతం వెలువడుతున్న ఫలితాలను పరిశీలిస్తే.. అమెరికా అధ్యక్ష పదవి దాదాపుగా బిడెన్‌దేనని చెప్పక తప్పదు. అయితే.. కౌంటింగ్ ప్రక్రియలో అవకతవకలు జరిగాయని, సుప్రీం కోర్టుకు వెళతామని ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు.