గురువారం, 28 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 26 డిశెంబరు 2019 (12:09 IST)

సూర్యగ్రహణం : ఆలయాలు క్లోజ్... గ్రహణ సమయంలో ఏం చేయకూడదు... (Video)

2019 సంవత్సరానికి టాటా చెప్పేస్తూ కొత్త సంవత్సరం 2020కి మరికొన్ని రోజుల్లో స్వాగతం పలికేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. ఇలాంటి సమయంలో సూర్యగ్రహణం సంభవించడం అందరిలోనూ ఆసక్తిని రేపుతోంది. సూర్యుడికి, భూమికి మధ్య చంద్రుడు రావడం వల్ల సూర్యగ్రహణం వస్తుంది. 
 
గురువారం నాడు సంభవించే వార్షిక సూర్యగ్రహణం ఈ సారి భారత్‌లో చాలా ప్రాంతాల్లో కనిపించనుంది. దక్షిణ భారతదేశంలో ఈ సారి సూర్యగ్రహణం అధికంగా కనిపించనుంది. ముఖ్యంగా తమిళనాడు, కర్ణాటక, కేరళలో సూర్యగ్రహణం ప్రభావం ఎక్కువ. 
 
అయితే ఇది సంపూర్ణ సూర్య గ్రహణం కాదు. ఆకాశంలో సూర్యుడు ఒక ఉంగరంలా మారే అద్భుత దృశ్యం రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌ ఆవిష్కృతం కానుంది. భూమికి చంద్రుడు చాలా దూరంగా ఉండడం వల్ల ఈ సారి పాక్షిక సూర్యగ్రహణం మాత్రమే ఏర్పడుతోంది.
 
ఈ పాక్షిక సూర్యగ్రహణం గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కొనసాగనుంది. దీంతో రాష్ట్రంలోని అన్ని దేవాలయాలను బుధవారం సాయంత్రం నుంచే మూసివేశారు. దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని దేవాలయాలు గ్రహణ సమయంలో మూసివేయనున్నారు. 
 
గ్రహణానంతరం ఆలయాలను శుద్ధి చేసి సుప్రభాతం, సంప్రోక్షణ, శాంతి హో మం, ఆరాధన తదితర పూజలను నిర్వహించి భక్తులకు దర్శనానికి అనుమతిస్తారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని శయనోత్సవ పూజల అనంతరం ద్వారబంధనం చేశారు. ప్రధానాలయం, బాలాలయం, శివాలయం, పాతగుట్ట దేవాలయాలకు ద్వార బంధనం చేశారు. 
 
ఈ సూర్యగ్రహణం ఎప్పటి నుంచి ఎప్పటివరకు
* ఈ సారి సూర్యగ్రహణం భారత్‌లో 3 గంటల 12 నిమిషాల సేపు కొనసాగుతుంది. 
* భారత కాలమాన ప్రకారం ఉదయం 8:04గంటలకు ప్రారంభమవుతుంది
* ఉచ్ఛస్థితికి ఉదయం 9:27కి చేరుకుంటుంది.
* ఉదయం 11:05గంటలకు ముగుస్తుంది. 
 
భారత్‌లో రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌ కనిపించే ప్రాంతాలు
* ఊటీ, మంగళూరు, కోయంబత్తూర్, శివగంగ, తిరుచిరాపల్లి, కసరాగాడ్‌
 
భారత్‌లో పాక్షిక సూర్యగ్రహణం ఎక్కడెక్కడ?
ఢిల్లీ, పుణె, జైపూర్, లక్నో, కాన్పూర్, నాగపూర్, ఇండోర్, కోల్‌కతా, చెన్నై, అహ్మదాబాద్, సూరత్, భోపాల్, విశాఖపట్నం, లూథియానా, ఆగ్రా. 
 
నేరుగా చూడొద్దు
* కంటితో నేరుగా సూర్యగ్రహణం చూడడం అత్యంత ప్రమాదం. సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాల వల్ల కంటికి ఎంత మాత్రమూ మంచిది కాదు.
* సూర్యగ్రహణాన్ని నేరుగా చూడడం వల్ల కంటి రెటినాపై  ప్రభావం చూపుతుంది.  
* నల్ల కళ్లద్దాలు, మార్కెట్‌లో లభించే ఇతర సోలార్‌ ఫిల్టర్స్‌తో సూర్యగ్రహణం చూడకూడదు.  
* కెమెరా, టెలిస్కోప్, బైనాక్యులర్స్‌ ఇతర పరికరాలతో చూడొద్దు.  
* మార్కెట్‌లో ప్రత్యేకంగా సూర్యగ్రహణం చూడడానికి తయారు చేసే సోలార్‌ ఫిల్టర్స్‌ ద్వారా మాత్రమే చూడాలి.
* వెల్డర్స్‌ గ్లాస్‌ నెంబర్‌ 14 సూర్యగ్రహణం చూడడానికి అత్యుత్తమమైనది. ఇది కంటికి అత్యంత రక్షణ కల్పిస్తుందని మధ్యప్రదేశ్‌లో బిర్లా ప్లానిటోరియం శాస్త్రవేత్త దేబిప్రసాద్‌ దౌరి చెప్పారు.
 
ఏయే దేశాల్లో
భారత్, శ్రీలంక, యూఏఈ, ఒమన్, సౌదీ అరేబియా, ఖతర్, మలేసియా, ఇండోనేసియా, సింగపూర్‌ , తూర్పు రష్యా, ఆస్ట్రేలియా.