#Budget2021 : వ్యాక్సిన్ల తయారీకి రూ.35 వేల కోట్లు.. పెట్రో బాదుడు
కేంద్ర వార్షిక బడ్జెట్‌లో కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి, తయారీకి రూ.35 వేల కోట్లు ప్రకటించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. అవసరమైతే మరిన్ని నిధులు కేటాయించడానికి సిద్ధంగా ఉన్నట్లు కూడా ఆమె స్పష్టం చేశారు.
ఇప్పటికే రెండు వ్యాక్సిన్లు వినియోగంలోకి వచ్చాయని, మరిన్ని వ్యాక్సిన్లు రానున్నట్లు ఆమె వెల్లడించారు. వినియోగంలో ఉన్న రెండు వ్యాక్సిన్లను మరో 100 దేశాలకు సరఫరా చేస్తున్నట్లు కూడా చెప్పారు. ఆరోగ్యం, సంరక్షణకు 2021-22లో రూ.2.23 లక్షల కోట్లు కేటాయించినట్లు నిర్మల తెలిపారు. ఇది గతేడాది కంటే 137 శాతం ఎక్కువని చెప్పారు.
అదేవిధంగా పరిశోధనకు పెద్దపీట వేయనున్నట్టు ప్రటించారు. జాతీయ పరిశోధనా సంస్థను త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు. ఎన్ఆర్ఎఫ్ కోసం 50 వేల కోట్లు కేటాయించారు. నేషనల్ రీసర్చ్ ఫౌండేషన్ కోసం కేటాయించిన నిధులను రానున్న ఐదేళ్లలో ఖర్చు చేయనున్నారు.
ఎన్ఆర్ఎఫ్‌తో పరిశోధనా వాతావరణాన్ని బలోపేతం చేస్తామన్నారు. పరిశోధనా సంస్థను ఏర్పాటు చేయడం సంతోషకరమని నిపుణులు రియాక్ట్ అవుతున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని శాస్త్రలోకం స్వాగతిస్తున్నది. ఏకలవ్య స్కూళ్ల ఏర్పాటు కోసం 40 కోట్లు కేటాయించారు.
మరోవైపు, బడ్జెట్‌లో ఊరట కోసం చూస్తున్న సామాన్యుల నడ్డి కేంద్ర ప్రభుత్వం విరిచింది. ఇప్పటికే భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలపై సెస్ పేరుతో మరింత భారం వేసింది. అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్‌మెంట్ సెస్ పేరుతో పెట్రోల్‌పై రూ.2.5, డీజిల్‌పై రూ.4 సెస్ విధించారు. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరగనున్నాయి.