ఆదర్శదంపతులకు పన్ను రాయితీలు
విదేశాలలో విడాకులు తీసుకునే భార్యభర్తల సంఖ్య పెరిగిపోతున్నది. వివాహానంతరం విడాకులకు కాలవ్యవధి ఏడు సంవత్సరాలుగా ఉండేది. ప్రస్తుతం తమ జీవితభాగస్వామితో ముఖం మొత్తిన వివాహితులు పెళ్ళయిన ఐదు సంవత్సరాలకే విడాకులు పుచ్చుకుంటున్నారు. పదేళ్ళకాలం పాటు వివాహానికి కట్టుబడి ఉండే జంటలు ఆదర్శ జంటలుగా వినుతికెక్కుతున్నాయి. ఇటీవల అమెరికా, బ్రిటన్, రష్యా మరియు స్కాండెనేవియా దేశాలలో చేపట్టిన అధ్యయనం పై అంశాలను వెలుగులోకి తెచ్చింది. మహిళలు తమ కెరీర్‌పై దృష్టిని పెడుతున్న మహిళలకు వివాహానికి తోడుగా వచ్చిన అనుబంధం అదనపు ఒత్తిడిగా మారుతున్నది.
దీంతో విడాకులు అనివార్యమై విస్తృత సంఖ్యలో పెళ్ళిళ్లు విడాకులకు దారి తీస్తున్నాయి. నవదంపతుల హానిమూన్ ఐదుసంవత్సరాలకే ముగుస్తున్నదని పరిశోధకులు తేల్చి చెపుతున్నారు. హానిమూన్ ముగిసే సమయానికి ఒకరిపై ఒకరికి ఉండే అభిమానం, ప్రేమ మరియు ఆప్యాయతలు మాయమైపోతున్నాయని వారు అంటున్నారు. వివాహమైన మొదటి పదేళ్ళలో చోటు చేసుకునే సంక్షోభాలు విడాకులకు దారితీస్తున్నాయని వివాహ వ్యవస్థ అధ్యయనవేత్త ఐవా జాసిలియోనైనే తెలిపారు. తొలి దశాబ్దకాలంలో చదువు ముగింపు, కెరీర్ నిర్మాణం, పిల్లలను కనడం, వారి ఆలనాపాలనా చూసుకోవడం తదితర జంఝూటాలతో బేజారెత్తిపోతున్న యువదంపతులు తమ వైవాహిక బంధానికి మంగళం పాడేస్తున్నారని ఆమె అన్నారు. ఈ అధ్యయనం బ్రిటన్ రాజకీయ వర్గాలలో కలకలం సృష్టిస్తున్నది. జీవితాంతం కలిసి ఉంటూ పిల్లల ఆలనాపాలనా చూసుకోనే దంపతులకు పన్నురాయితీలు కల్పించాలని ప్రతిపక్షాలు, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి.