శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: శుక్రవారం, 18 జూన్ 2021 (16:06 IST)

ఆంధ్రప్రదేశ్: నూతన విద్యా విధానంతో వచ్చే మార్పులేంటి? ఉపాధ్యాయ సంఘాలకు షోకాజ్ నోటీసులు ఎందుకు?

విద్యా రంగంలో పలు మార్పులకు శ్రీకారం చుడుతున్నామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెబుతోంది. ఇప్పటికే ప్రాథమిక విద్యలో తెలుగు స్థానంలో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టడం వివాదం అయ్యింది. తాజాగా డిగ్రీ కాలేజీలలో పూర్తిగా ఇంగ్లీష్ మీడియంలోనే బోధన ఉండేలా నిర్ణయం తీసుకుంది. దీనికి తోడుగా నూతన విద్యావిధానం అంటూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులను అమలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. అంగన్ వాడీలను, ఇంటర్‌ కాలేజీలను కూడా పాఠశాల విద్య పరిధిలోకి తీసుకొచ్చేందుకు పూనుకుంది. అయితే దీనిపై ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి.

 
కేంద్ర మార్గదర్శకాలను అనుసరించి విద్యా సంవత్సరాలను 5+3+3+4 గా విభజిస్తూ మే 31న రాష్ట్ర ప్రభుత్వం సర్క్యులర్‌ నెం: 172ను విడుదల చేయడంతో వివాదం మొదలైంది. ఉపాధ్యాయ సంఘాలు, అంగన్ వాడీ కార్యకర్తలు కూడా దీనిని వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సర్క్యులర్ కారణంగా విద్యార్థులకు సమస్యలు వస్తాయని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి.

 
దీనివల్ల బడి మానేసే పిల్లల సంఖ్య పెరిగి పోతుందని, ఉపాధ్యాయ పోస్టుల సంఖ్య తగ్గుతుందని ఫ్యాఫ్టో (ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఆర్గనైజేషన్స్) నేతలు ప్రకటనలు చేశారంటూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ చెబుతున్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఆందోళన పరిచేలా ఉన్న ఆ ప్రకటనలపై వారం రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ ఉపాధ్యాయ సంఘాల నేతలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. లేదంటే క్రమశిక్షణా చర్యలకు సిఫార్సు చేయాల్సి వస్తుందని నోటీసులో పేర్కొన్నారు. ఈ నోటీసుల పట్ల విపక్ష నేతలు, ఉపాధ్యాయ సంఘాలు కూడా నిరసన తెలుపుతున్నాయి. వాటిని ఉపసంహరించాలని కోరుతున్నాయి.

 
విద్యావిధానంలో ప్రభుత్వం ఏం మార్పులు తెస్తోంది?
ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన సర్క్యులర్ ప్రకారం ఇకపై అంగన్ వాడీ సెంటర్లను కూడా విద్యా శాఖ పరిధిలోకి తీసుకొస్తారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ సహకారంతో స్త్రీ శిశు సంక్షేమ శాఖ వాటిని నిర్వహిస్తోంది. పీపీ1, పీపీ2, ప్రిపరేటరీ క్లాస్, ఒకటి, రెండు తరగతులు ఒక విభాగం కిందకు వస్తాయి. అంగన్ వాడీ సెంటర్లను వైఎస్సార్ ప్రాథమిక పాఠశాలలుగా మారుస్తారు. ప్రతి కిలోమీటరు పరిధిలో ఒక ఫౌండేషన్ స్కూల్ ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది. 3, 4, 5 తరగతులను 3-5 కి.మీ దూరంలో ఉన్న ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో విలీనం చేస్తారు.

 
3, 4, 5 తరగతుల విద్యార్థులను ప్రాథమికోన్నత పాఠశాలలకు తరలించడం వలన అక్కడ 150 మంది విద్యార్థులకు మించి పిల్లల సంఖ్య పెరిగితే దాన్ని ఉన్నత పాఠశాలగా అప్‌గ్రేడ్‌ చేస్తారు. విద్యార్థుల సంఖ్య, మౌలిక వసతులు బాగున్నచోట మండలానికి ఒకటి, రెండు పాఠశాలలకు ఇంటర్ తరగతులు ఎటాచ్‌ చేస్తారు. వైఎస్‌ఆర్‌ ప్రాథమిక పాఠశాల, ఫౌండేషన్‌ స్కూలు, ఉన్నత పాఠశాలలను మ్యాపింగ్‌ చేసి స్కూల్‌ కాంప్లెక్సులు ఏర్పాటు చేస్తారు. ఈ విధానం అమలులో ఏ ప్రాథమిక పాఠశాల మూత పడేది లేదని ప్రభుత్వం చెబుతోంది.

 
వాటికి అనుగుణంగా ఉపాధ్యాయుల నియామకం హేతుబద్ధంగా జరుగుతుందని కూడా ప్రభుత్వం అంటోంది. ఒకే టీచర్ అన్ని సబ్జెక్టులు బోధించే విధానం కూడా సరిదిద్దుతామని చెబుతోంది. విద్యార్థులకు ఫౌండేషన్ కోర్సులు చాలా అవసరమని, 8 సంవత్సరాలలోపు పిల్లల్లో మానసిక వికాసం ఎక్కువగా జరుగుతుంది కాబట్టి దానికి అనుగుణంగా బోధన ఉంటుందని చెబుతోంది. ఎక్కువ తరగతులు ఒకే చోట ఉండకుండా నూతన విద్యావిధానం రూపొందించామంటోంది.

 
అభ్యంతరాలు ఏంటి
ప్రస్తుతం ఈ విధానం అమలు కోసం కొన్ని మండలాలను ఎంపిక చేశారు. ఈ విద్యాసంవత్సరం నుంచే అక్కడ దీన్ని అమలు చేస్తారు. అయితే దానిని ఉపాధ్యాయ సంఘాలు, టీచర్ ఎమ్మెల్సీలు , అంగన్ వాడీ సిబ్బంది కూడా వ్యతిరేకిస్తున్నారు. నిరసన కార్యక్రమాలకు కూడా పూనుకున్నారు. ఈ విధానం వల్ల అనేక సమస్యలు వస్తాయని వారు చెబుతున్నారు.

 
అంగన్‌వాడీలలో 5 సంవత్సరాల లోపు పిల్లలకు పౌష్టికాహారం మాత్రమే అందిస్తారు. వీరి కోసం అకడమిక్‌ సిలబస్‌, బోధనకు ప్రత్యేకంగా ఉపాధ్యాయులు లేరు. కాబట్టి దీన్ని విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాలు స్వాగతిస్తున్నాయి. అయితే ఫౌండేషన్‌ స్కూల్‌లో ప్రిపరేటరీ 1 చేర్చారు. దీన్ని కూడా ప్రీ ప్రైమరీ తరగతులకు చేర్చితే బాగుండేదని ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ప్రతినిధులు అంటున్నారు.

 
''ప్రభుత్వ నిర్ణయంతో 47 వేల అంగన్‌వాడీ కేంద్రాలు ఏమవుతాయో స్పష్టత లేదు. వీటిని శిశుసంక్షేమ శాఖ నిర్వహిస్తుందా? లేకుంటే విద్యాశాఖ నిర్వహిస్తుందా? అనేది స్పష్టత ఇవ్వలేదు. ప్రిపరేటరీ క్లాసు, ఒకటి, రెండు తరగతులను ఒక సెకండరీ ఉపాధ్యాయునితో నిర్వహించడం వలన విద్యార్థులకు ఏ నాణ్యమైన విద్య అందించగలదో ప్రభుత్వం చెప్పాలి'' అని గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వర రావు బీబీసీతో అన్నారు.

 
ఈ ఫౌండేషన్‌ పాఠశాల వ్యవస్థతో విద్యార్థులకు, విద్యాభివృద్ధికి, ప్రాథమిక పాఠశాల వ్యవస్థకు నష్టం జరుగుతుందని, విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల నుండి తరలి పోయే ప్రమాదం ఉందని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక విద్య సరిగాలేదని, ఒక్కరు, ఇద్దరు, ముగ్గురు ఉపాధ్యాయులతో నడుస్తున్నాయని, ఇప్పటికే సుమారు 40 శాతం పిల్లలు ప్రైవేటు పాఠశాలలకు మళ్లారని ఉపాధ్యాయ సంఘల ప్రతినిధులు అంటున్నారు.

 
''విద్యా హక్కు చట్టానికి భిన్నంగా 3, 4, 5 తరగతులు తరలించడం వల్ల నష్టమే జరుగుతుంది. డే స్కాలర్‌గా ఇంత దూరం వెళ్లి రావడమే ప్రధాన సమస్య. ఇది విద్యార్థుల రెగ్యులారిటీని దెబ్బతీస్తుంది. డ్రాపవుట్లను పెంచుతుంది. తరగతులు, స్కూళ్ల విలీనం వలన పోస్టుల సంఖ్య కచ్చితంగా తగ్గుతుంది. ఇది అందరికీ చేటు'' అని ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరరావు అన్నారు.

 
'ఒక్క స్కూల్ మూతపడదు, ఒక్క టీచర్‌ని తొలగించం'
ప్రభుత్వం మాత్రం ఈ అనుమానాలను తోసిపుచ్చింది. విద్యా శాఖకు సంబంధించిన నూతన విధానం అమలుపై సమీక్షా సమావేశం సందర్భంగా సీఎం వైఎస్ జగన్ కీలక ప్రకటన చేశారు. ''పిల్లలకు మంచి విద్య అందించాలన్నదే మా తపన. చిత్తశుద్ధితో ఎక్కువ నిధులు కేటాయిస్తూ భావితరాలకు మేలు కలగాలని ఆశిస్తున్నాం. సానుకూల దృక్పథంతో పనిచేయండి. నూతన విద్యావిధానంపై అందరిలో అవగాహన, చైతన్యం కలిగించాలి. స్కూళ్ల మూసివేత, ఉపాధ్యాయుల తొలగింపు లాంటివి ఏమీ ఉండవు. ఓపికతో వారికి కొత్త విద్యావిధానం లక్ష్యాలను, దానివల్ల కలిగే ప్రయోజనాలను వివరించండి. భాగస్వాములైన టీచర్లను, ప్రజాప్రతినిధులను అందరినీ పరిగణనలోకి తీసుకుని వారికి వివరాలు తెలియజేసి వారిలో అవగాహన కలిగించండి'' అని సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు.

 
'ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుని, నోటీసులా?'
నూతన విద్యావిధానం విషయంలో భాగస్వాములతో చర్చించకుండానే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఉపాధ్యాయులకు ఢోకా లేదని, విద్యార్థుల భవిష్యత్తు కోసమేనని చెబుతున్న మాటలు నిజమే అయితే అందరితో చర్చించకుండా ఏకపక్షంగా ఎందుకు నిర్ణయాలు తీసుకున్నారని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కె.ఎస్.ఎస్. ప్రసాద్ అంటున్నారు.

 
''పూర్వ ప్రాథమిక విద్యను, అలాగే ఉన్నత పాఠశాలల్లో ఇంటర్ తరగతుల విలీనాన్ని అందరం స్వాగతిస్తున్నాం. 3, 4, 5 తరగతులు ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయడం ద్వారా విద్యార్థికి, బడికి మధ్య దూరం పెరగడం తప్ప ఒరిగేదేమీ ఉండదు. ఉపాధ్యాయులు, అధ్యాపకులతో అన్ని అంశాలు చర్చించకుండా, మా సమస్యలను ప్రస్తావించడమే నేరమన్నట్టుగా నోటీసులు ఇవ్వడం అప్రజాస్వామికం. విద్యారంగంలో ఎన్నడూ ఇలా జరగలేదు'' అని ప్రసాద్ అన్నారు.

 
‘ఫ్యాఫ్టో’ నేతలు ఏమంటున్నారు
ప్రస్తుతం ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలలు యథావిధిగా కొనసాగించడం మంచిదని, కానీ ప్రభుత్వం ఫౌండేషన్ స్కూళ్ల పేరుతో వాటిని విలీనం చేసే ప్రయత్నం చేస్తోందని ‘ఫ్యాప్టో’ (ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఆర్గనైజేషన్స్) నేతలు అంటున్నారు. నూతన విద్యావిధానం అమలు విషయం ఉపాధ్యాయులతోనూ, ఇతరులతోనూ చర్చించకుండా సర్క్యులర్ విడుదల చేసినప్పుడు మా అభిప్రాయం బహిరంగంగా వెల్లడించడం నేరమా అని ప్రశ్నిస్తున్నారు ‘ఫ్యాఫ్టో’ నేతలు.

 
''ఇంత పెద్ద మార్పు తీసుకొస్తున్నప్పుడు ముందు అందరితో చర్చించాలి. కానీ అటు మంత్రి గానీ, ఇటు డైరెక్టరేట్ నుంచి అటువంటి ప్రయత్నాలు జరగలేదు. దాంతో ప్రభుత్వ సర్క్యులర్ మీద మా అభిప్రాయం వెల్లడించాం. దానినే నేరంగా చెప్పడం తగదు. ఇది ఉపాధ్యాయ సంఘాలను నియంత్రించే చర్యగా భావిస్తున్నాం'' అని ఫ్యాప్టో కార్యదర్శి కె.నరహరి అన్నారు.

 
నిపుణులు మాట్లాడకూడదా- టీడీపీ
సంస్కరణల పేరుతో విద్యా వ్యవస్థను జగన్ ప్రభుత్వం భ్రష్టుపట్టిస్తోందని మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు కె.ఎస్. జవహర్ విమర్శించారు. జాతీయ విద్యా విధానం పేరుతో విద్యార్థులను విద్యకు దూరం చేసే విధానాలను ప్రభుత్వం అమలు చేయబోతోందన్నారు. ''ఉపాధ్యాయ నేతలు మాట్లాడకూడదని, తమ అభిప్రాయం చెప్పకూడదని ప్రభుత్వం భావించడం అప్రజాస్వామికం. ఇలాంటి ప్రయత్నాలు మానుకోవాలి'' అని జవహర్ అన్నారు.

 
ఎవరితోనూ చర్చించకుండా నూతన విద్యావిధానం అమలులోకి తెస్తున్నారనే విమర్శలు, ఉపాధ్యాయ నేతలకు నోటీసులు ఇవ్వడం వంటి పరిణామాల నేపథ్యంలో తాజాగా విద్యాశాఖ మంత్రి వివిధ ఉపాధ్యాయ సంఘాల నేతలతో చర్చలు జరిపారు. సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకుందామని ఆయన వారికి సూచించారు.