ఏపీ శాసన మండలిలో మారిన సమీకరణాలు : ఆధిక్యంలో వైకాపా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలిలో అధికార, విపక్ష పార్టీల బలాబలాలు తారుమారయ్యాయి. శుక్రవారం నుంచి వైసీపీ బలం పెరగనుంది. నేటితో ఏడుగురు టీడీపీ ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనుంది. దీంతో టీడీపీ ఎమ్మెల్సీల బలం తగ్గనుంది.
ఫలితంగా మండలిలో టీడీపీ బలం 22 నుంచి 15కి తగ్గుతుంది. అదేసమయంలో వైసీపీ బలం 20కి చేరనుంది. ఇటీవలే నలుగురు వైసీపీ సభ్యులను గవర్నర్ నేరుగా మండలికి నామినేట్ చేయడం తెలిసిందే. ఇక, వైసీపీ సీనియర్ సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పదవీకాలం కూడా రేపటితో ముగియనుంది.
తాజా పరిణామాలతో అసెంబ్లీ, శాసనమండలి రెండింట్లోనూ వైసీపీ ఆధిపత్యం కొనసాగనుంది. ఇప్పటివరకు మండలిలో తనకున్న బలంతో టీడీపీ పలు బిల్లులను అడ్డుకున్న విషయం తెలిసిందే. వైసీపీ సభ్యుల సంఖ్య పెరిగి, టీడీపీ సభ్యుల సంఖ్య తగ్గిన నేపథ్యంలో ఇకపై ఆ పరిస్థితి కనిపించకపోవచ్చు.
పదవీ విరమణ చేయనున్న ఎనిమిది మంది సభ్యుల్లో ఏడుగురు టీడీపీ సభ్యులు ఉన్నారు. టీడీపీ నుంచి రెడ్డి సుబ్రహ్మణ్యం, వైవీబీ రాజేంద్రప్రసాద్, బుద్దా వెంకన్న, పప్పల చలపతిరావు, గాలి సరస్వతి, జగదీశ్వర్ రావు, వైసీపీ నుంచి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పదవీ విరమణ చేయనున్నారు. దీంతో మండలిలో వైసీపీ సభ్యుల బలం 21కి పెరగనుండగా... టీడీపీ సభ్యుల సంఖ్య 15కు తగ్గనుంది.