శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: బుధవారం, 24 జూన్ 2020 (12:21 IST)

భారత్ - చైనా సరిహద్దు వివాదం: గల్వాన్ లోయలో ఘర్షణపై అన్ని ప్రశ్నలకూ సమాధానాలు ఇవీ...

భారత్-చైనా మధ్య బంధం ఇప్పుడు చాలా సున్నిత స్థితిలో ఉంది. రెండు దేశాల మధ్య 1962లో ఒకసారి యుద్ధం జరిగింది. అందులో చైనా గెలిచింది. ఆ తర్వాత 1965, 1975లో కూడా రెండు దేశాల మధ్య హింసాత్మక ఘర్షణలు జరిగాయి. ఇప్పుడు భారత్-చైనా సరిహద్దుల్లో మళ్లీ ఉద్రిక్తతలు ఏర్పడడం ఇది నాలుగోసారి. జూన్ 15, 16 రాత్రి గల్వాన్ లోయలో భారత్-చైనా సైనికుల మధ్య సరిహద్దుల్లో జరిగిన ఘర్షణ గురించి చాలామందికి చాలా ప్రశ్నలున్నాయి. వాటన్నిటికీ మీకు ఇక్కడ ఒకేచోట సమాధానం లభిస్తుంది.

 
1వ ప్రశ్న: గల్వాన్‌లో 15-16 జూన్ రాత్రి ఏం జరిగింది?
లద్దాఖ్ గల్వాన్ లోయలో జూన్ 15-16న ఎల్ఏసీ దగ్గర జరిగిన ఈ ఘర్షణలో భారత సైన్యానికి చెందిన ఒక కల్నల్ సహా 20మంది సైనికులు మృతిచెందారు. చైనా సైన్యానికి కూడా నష్టం జరిగిందని భారత్ చెబుతోంది. కానీ దానిపై చైనా వైపు నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు. చైనా తమ సైన్యానికి నష్టం జరిగిందనే దానిని అంగీకరించలేదు. ఆ తర్వాత రెండు దేశాల మధ్య ముందు నుంచీ ఉన్న ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. తమ ప్రాంతంలోకి చొరబడ్డారంటూ రెండు దేశాలు పరస్పరం ఆరోపించుకుంటున్నాయి.

 
గల్వాన్ లోయలో భారత-చైనా లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్(ఎల్ఏసీ) దగ్గర ఇరు దేశాల జవాన్ల మధ్య జరిగిన ఘర్షణలో మేకులు ఉన్న ఐరన్ రాడ్లను ఆయుధాల్లా ఉపయోగించారని చెబుతున్నారు. భారత్-చైనా సరిహద్దులో భారత సైన్యంలోని ఒక సీనియర్ అధికారి బీబీసీకి ఈ ఫొటోలు పంపించారు. ఈ ఆయుధాలతోనే చైనా సైనికులు భారత జవాన్లపై దాడి చేశారని చెప్పారు.

 
2వ ప్రశ్న: ఈ హింసాత్మక ఘర్షణలు ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి. ఇవి ఎలా మొదలయ్యాయి?
భారత్-చైనా సరిహద్దుల్లో ప్రస్తుత వివాదం ఏప్రిల్ మూడో వారంలో ప్రారంభమైంది. అప్పుడు లద్దాఖ్ బోర్డర్ అంటే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర చైనా సైనిక దళాలు, ట్రక్కుల సంఖ్య భారీగా పెరుగుతున్నట్లు కనిపించిందని రక్షణ నిపుణులు చెబుతున్నారు.

 
ఆ తర్వాత మేలో సరిహద్దుల్లో చైనా సైనికుల కార్యకలాపాలు జోరందుకున్నట్లు చెప్పారు. చైనా జవాన్లు లద్దాఖ్ సరిహద్దులను నిర్ధరించే సరస్సులో కూడా పెట్రోలింగ్ చేయడం కనిపించిందని వార్తలు వచ్చాయి. భారత్-చైనా సరిహద్దుల్లో రోడ్డు నిర్మించడానికి ప్రభుత్వం 3,812 కిలోమీటర్ల ప్రాంతాన్ని గుర్తించిందని భారత్ రక్షణ మంత్రిత్వ శాఖ 2018-19 వార్షిక నివేదికలో చెప్పింది. ఇందులో 3,418 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణ పనులను బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ అంటే బీఆర్‌వోకు ఇచ్చారు. వీటిలో ఎక్కువ ప్రాజెక్టులు పూర్తయ్యాయి.

 
రెండు దేశాల మధ్య వివాదానికి అసలు కారణం ఈ రోడ్డు నిర్మాణ పనులే అని భారత్-చైనా వివాదం గురించి మాట్లాడుతున్న నిపుణులు చెబుతున్నారు. కానీ దానికి ఇదొక్కటే కారణం కాదని, ఎన్నో పరిస్థితులు కలవడం కూడా దీనికి కారణం అని మరికొందరు అంటున్నారు. గత ఏడాది ఆగస్టులో భారత ప్రభుత్వం ఆర్టికల్ 370 తొలగించడం, భారత విదేశాంగ విధానంలో ఇటీవల మార్పులు, చైనా అంతర్గత రాజకీయాలు, కరోనా సమయంలో ప్రపంచ రాజకీయాల్లో తనను తాను నిలబెట్టుకోడానికి చైనా ప్రయత్నాలు అన్నీ కలిసి దీనికి కారణం అయ్యుంటాయని చూస్తున్నారు.

 
3వ ప్రశ్న: ఈ హింసాత్మక ఘర్షణలు అంత ముఖ్యం ఎందుకు?
45 ఏళ్ల తర్వాత రెండు దేశాల మధ్య ఘర్షణ ఇంత హింసాత్మకంగా మారింది. ఇందులో 20 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు. చైనా సైనికులు గాయపడినట్లు అధికారిక గణాంకాలు రాలేదు.

 
ఇంతకు ముందు 1975లో అరుణాచల్ ప్రదేశ్‌లో ఎల్ఏసీ దగ్గర భారత సైన్యం పెట్రోలింగ్ పార్టీపై చైనా ఆర్మీ దాడి చేసింది. అప్పుడు కూడా భారత జవాన్లు మృతిచెందారు. ఈలోపు ఇరు దేశాధినేతల మధ్య చాలాసార్లు చర్చలు జరిగాయి. దాంతో వ్యాపారంతోపాటూ సరిహద్దుల్లో కూడా పరిస్థితి చక్కబడినట్టే అనిపించింది. నరేంద్ర మోదీ భారత ప్రధానమంత్రి అయినప్పటి నుంచి, గత ఆరేళ్లలో ఆయన 18 సార్లు చైనా అధ్యక్షుడిని కలిశారు. కానీ ఈ హింసాత్మక ఘర్షణ తర్వాత రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నట్లు కనిపిస్తున్నాయి.

 
4వ ప్రశ్న: గల్వాన్ లోయలో ఎంతమంది భారత్ సైనికులు చనిపోయారు
చైనా-భారత్ సైన్యం మధ్య హింసాత్మక ఘర్షణలో భారత సైన్యంలోని 20 మంది జవాన్లు చనిపోయారు. వీరంతా 16 బిహార్ రెజిమెంట్ జవాన్లు. మొదట ముగ్గురు జవాన్లు చనిపోయినట్లు వార్తలు వచ్చాయి. తర్వాత తీవ్రంగా గాయపడ్డ మరో 17 మంది జవాన్లు కూడా చనిపోయారని భారత సైన్యం స్వయంగా ప్రకటించింది. భారత సైన్యం వివరాలను బట్టి మరో 18 మంది సైనికులు లేహ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో 58 మందికి సాధారణ గాయాలయ్యాయి.

 
5వ ప్రశ్న: ఈ ఘర్షణలో ఎంతమంది చైనా జవాన్లు చనిపోయారు?
చైనా ఏ యుద్ధంలోనూ చనిపోయిన తమ సైనికుల సంఖ్య గురించి చెప్పదు. జూన్ 17న ఒక ప్రెస్ కాన్ఫరెన్సులో చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖను పీటీఐ ఇదే ప్రశ్న అడిగింది. “భారత మీడియాలో చైనా సైనికులు కూడా మృతి చెందారనే వార్తలు వస్తున్నాయని, మీరు వాటిని ధ్రువీకరిస్తున్నారా” అని అడిగింది.

 
ఈ ప్రశ్నకు చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి చావో లిజియాన్ “నేను చెప్పినట్లు రెండు దేశాల సైన్యం క్షేత్ర స్థాయిలో సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తోంది. ఇక్కడ మీకు చెప్పడానికి నా దగ్గర ఎలాంటి సమాచారం లేదు. ఇది జరిగినప్పటి నుంచి సరిహద్దుల్లో శాంతిని పునరుద్ధరించడానికి వీలుగా చర్చల ద్వారా వివాదాన్ని పరిష్కరించుకోవాలని రెండు దేశాలూ ప్రయత్నిస్తున్నాయి” అన్నారు.

 
6వ ప్రశ్న: భారత సైనికులు ఆయుధాలు ఎందుకు ఉపయోగించలేదు?
భారత విదేశాంగ మంత్రి ఎస్.జయశంకర్ తన ట్వీట్‌లో “సరిహద్దులో మోహరించిన జవాన్లు అందరూ ఆయుధాలతోనే ఉంటారు. ముఖ్యంగా పోస్ట్ వదిలి వెళ్లే సమయంలో కూడా వారి దగ్గర ఆయుధాలు ఉంటాయి. జూన్ 15న గల్వాన్‌లో ఉన్న జవాన్ల దగ్గర కూడా ఆయుధాలు ఉన్నాయి. కానీ 1996, 2005 భారత్-చైనా ఒడంబడిక కారణంగా చాలా కాలం నుంచీ జవాన్లు ఫైర్ ఆర్మ్స్(ఆయుధాలు) ఉపయోగించడం లేదు” అన్నారు.

 
7వ ప్రశ్న: గల్వాన్ లోయ రెండు దేశాలకు ఎందుకు కీలకం?
గల్వాన్ లోయ వివాదాస్పద అక్సాయ్‌ చీన్ ప్రాంతంలో ఉంది. ఇది లద్దాఖ్, అక్సాయి చీన్ మధ్య భారత-చైనా సరిహద్దులకు దగ్గరగా ఉంటుంది. ఇక్కడ వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) అక్సాయ్ చీన్‌ను భారత్ నుంచి వేరు చేస్తుంది.

 
అక్సాయ్ చీన్ మాదాంటే మాదని భారత్-చైనా రెండూ చెబుతున్నాయి. ఈ లోయ చైనా దక్షిణ షింజియాంగ్, భారత్ లద్దాఖ్ వరకూ వ్యాపించి ఉంది. ఈ ప్రాంతం భారత్‌కు వ్యూహాత్మకంగా చాలా కీలకం. ఎందుకంటే ఇది పాకిస్తాన్, చైనాలోని షింజియాంగ్, లద్దాఖ్ సరిహద్దులను తాకుతుంటుంది. 1962 యుద్ధ సమయంలో గల్వాన్ నది దగ్గరున్న ఈ ప్రాంతం యుద్ధానికి ప్రధాన కేంద్రంగా మారింది. ఈ లోయలో రెండు దేశాల పర్వతాలు వ్యూహాత్మకంగా సైన్యానికి అడ్వాంటేజ్ ఇస్తాయి. ఇక్కడ జూన్ ఎండల్లో కూడా ఉష్ణోగ్రత సున్నాకంటే తక్కువ ఉంటుంది.

 
చరిత్రకారులు ఈ ప్రాంతానికి ఆ పేరు ఒక సాధారణ లద్దాఖీ వ్యక్తి గులామ్ రసూల్ గల్వాన్ పేరున వచ్చిందని చెబుతారు. ఈ ప్రాంతాన్ని గుర్తించింది ఆయనే. గల్వాన్ లోయలో తమ ప్రాంతంలో నిర్మిస్తున్న రహదారిని అడ్డుకోడానికే చైనా ఈ దాడి చేసిందని భారత్ చెబుతోంది. దార్బుక్-ష్యోక్-దౌలత్ బేగ్ ఓల్డీ రోడ్ భారత్‌కు ఈ మొత్తం ప్రాంతంలో పెద్ద అడ్వాంటేజ్ ఇస్తుంది. ఈ రోడ్ కారోకోరమ్ పాస్ దగ్గర మోహరించి ఉన్న జవాన్లకు సరుకులు, ఆయుధాలు చేర్చడానికి చాలా కీలకం.

 
8వ ప్రశ్న: వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) అంటే ఏంటి. నియంత్రణ రేఖ(ఎల్ఓసీ)కి దీనికి తేడా ఏంటి?
భారత భూ సరిహద్దు(లాండ్ బార్డర్) మొత్తం 15,106.7 కిలోమీటర్లు. అది మొత్తం ఏడు దేశాలతో ఉంది. అది కాకుండా 7516.6 కిలోమీటర్ల సముద్ర సరిహద్దులు కూడా ఉన్నాయి. భారత ప్రభుత్వ వివరాల ప్రకారం ఏడు దేశాల్లో బంగ్లాదేశ్(4,096.7 కి.మీ.), చైనా(3,488 కి.మీ), పాకిస్తాన్(3,323 కి.మీ), నేపాల్(1.751 కి.మీ), మ్యాన్మార్(1,643 కి.మీ), భూటాన్(699 కి.మీ), అఫ్గానిస్తాన్(106 కి.మీ) ఉన్నాయి.

 
భారత్ చైనాతో 3488 కిలోమీటర్ల సుదీర్ఘ సరిహద్దును పంచుకుంటుంది. ఈ సరిహద్దు జమ్ము-కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్‌ల మీదుగా ఉంటుంది. దానిని మూడు సెక్టార్లుగా విభజించారు. పశ్చిమ సెక్టార్ అంటే జమ్ము-కశ్మీర్, మిడిల్ సెక్టార్ అంటే హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, తూర్పు సెక్టార్ అంటే సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్. అయితే రెండు దేశాల మధ్య ఇప్పటివరకూ పూర్తిగా సరిహద్దు విభజన జరగలేదు. ఎందుకంటే చాలా ప్రాంతాల గురించి రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదాలు ఉన్నాయి.

 
ఈ వివాదాల వల్లే రెండు దేశాల మధ్య ఎప్పుడూ సరిహద్దును నిర్ణయించలేకపోయారు. అయితే యధాతథ స్థితిని కొనసాగించడానికి ‘లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్’(ఎల్ఏసీ) అనే టర్మ్ ఉపయోగించడం మొదలైంది. ఏడు దశాబ్దాలకు పైగా కాలం గడిచిపోయింది. కానీ, జమ్ము-కశ్మీర్, భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలకు ప్రధాన అంశంగా మారింది. ఆ ప్రాంతం ఇప్పుడు నియంత్రణ రేఖతో విభజించి ఉంది. అందులో ఒక భాగం భారత్ దగ్గర, మరో భాగం పాకిస్తాన్ దగ్గర ఉన్నాయి. వీటి మధ్య ఉన్న దానిని భారత్, పాక్ నియంత్రణ రేఖగా చెబుతున్నారు.

 
9వ ప్రశ్న: ఈ తాజా వివాదం తర్వాత ఇప్పుడు రెండు దేశాలూ ఏం చేస్తాయి?
జూన్ 17న గల్వాన్ లోయ ప్రాంతంపై తమకు సర్వాధికారం ఉందని చైనా చెప్పింది. భారత్ దానిని ప్రగల్భాలుగా చెప్పింది. చైనా వాదనల్లో పస లేదని తెలిపింది. చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి ఝావో లీజాన్ “గల్వాన్ లోయ సర్వాధికారం ఎప్పటినుంచో చైనా దగ్గరే ఉంది. భారత సైనికులు బోర్డర్ ప్రొటోకాల్, మా కమాండర్ స్థాయి చర్చల్లో జరిగిన ఒప్పందాన్ని తీవ్రంగా ఉల్లంఘించారు. చైనా మరింత ఘర్షణను కోరుకోవడం లేదు” అన్నారు.

 
మరోవైపు భారత విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ్ “బుధవారం రెండు దేశాల విదేశాంగ మంత్రులు ఫోన్లో మాట్లాడుకున్నారు. మొత్తం పరిస్థితిని బాధ్యతాయుతంగా చక్కదిద్దడానికి అంగీకరించారు” అని తెలిపారు. “చైనా సైన్యం ఎల్ఏసీకి ఇవతల భారత భాగంలో నిర్మాణ పనులను చేపట్టడానికి ప్రయత్నించింది. ప్రస్తుతం రెండు దేశాల మధ్య దౌత్య, సైనిక స్థాయి చర్చలు నడుస్తున్నాయి” అని కూడా ఆయన చెప్పారు.

 
10వ ప్రశ్న: భారత్-చైనా ఇంతకు ముందు ఎప్పుడెప్పుడు తలపడ్డాయి?
1962లో భారత-చైనా సుమారు నెలపాటు యుద్ధం జరిగింది. అది లద్దాఖ్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకూ వ్యాపించింది. ఇందులో చైనా గెలిచింది. జవహర్ లాల్ నెహ్రూ కూడా స్వయంగా పార్లమెంటులో “మనం ఆధునిక ప్రపంచంలో సత్యానికి దూరంగా ఉన్నాం. మనం మనమే తయారు చేసుకున్న ఒక కృత్రిమ వాతావరణంలో జీవిస్తున్నాం” అని విషాదంగా అన్నారు.

 
సరిహద్దుల్లో గొడవలు, పెట్రోలింగ్ పార్టీలతో ఎన్‌కౌంటర్లు, తోపులాటలకు మించి చైనా ఏమీ చేయదని భావించిన ఆయన అలా తన తప్పును అంగీకరించారు. 1962 యుద్ధం తర్వాత రెండు దేశాలు భారత్, చైనాలో ఉన్న తమ రాయబారులను వెనక్కు పిలిపించాయి. 1967లో నాథూలాలో చైనా-భారత్ మధ్య ఘర్షణ జరిగింది. రెండు దేశాల సైనికులు ఎంతోమంది చనిపోయారు. సంఖ్య గురించి రెండు దేశాలూ రకరకాల వాదనలు వినిపించాయి. ఈ ఘర్షణ మూడు రోజులు జరిగింది.

 
అప్పుడు నాథూలాలో ఉన్న మేజర్ జనరల్ షెరూ థపలియాల్ ‘ఇండియన్ డిఫెన్స్ రివ్యూ’ 2014 సెప్టెంబర్ 22 సంచికలో ఈ ఘర్షణల గురించి వివరంగా రాశారు. “నాథూలాలో సరిహద్దుల దగ్గర పెట్రోలింగ్‌ సమయంలో ఇరు దేశాల సైనికుల మధ్య అది మొదలైంది. ఆ సమయంలో రెండు దేశాల జవాన్ల మధ్య ఏదో ఒక విధంగా గొడవ మొదలయ్యేది” అన్నారు.

 
1967 సెప్టెంబరు 6న భారత సైనికులు చైనా రాజకీయ కమిషనర్‌ను తోయడంతో ఆయన కళ్లజోడు విరిగిపోయింది. దాంతో ఆ ప్రాంతంలో ఏర్పడిన ఉద్రిక్తతలను తగ్గించడానికి నాథూలా నుంచి సెబూలా వరకూ భారత-చైనా సరిహద్దును గుర్తించేలా కంచె వేయాలని భారత సైనికాధికారులు నిర్ణయించారు. కొన్ని రోజులకు ఫెన్సింగ్ పనులు ప్రారంభం కాగానే, చైనా రాజకీయ కమిషనర్ కొంతమంది సైనికులతో వచ్చి దానిని ఆపేయమని చెప్పారు. భారత సైనికులు ఆయన అభ్యర్థనకు ఒప్పుకోలేదు. దాంతో చైనా సైనికులు హఠాత్తుగా మెషిన్ గన్లతో కాల్పులు ప్రారంభించారు.

 
11వ ప్రశ్న: ఈ ఉద్రిక్తతల వల్ల రెండు దేశాల సంబంధాలపై ఎలాంటి ప్రభావం పడుతుంది?
దీనికి సూటిగా జవాబు చెప్పడం కష్టం. రెండు దేశాల మధ్య ఇప్పటికీ చర్చలు జరుగుతున్నాయి. వచ్చే మరికొన్ని నెలలు రెండు దేశాలకు నిర్ణయాత్మకం అవుతాయి. తాజా పరిస్థితుల నుంచి బయటపడ్డానికి సైనిక స్థాయి చర్చలకు బదులు రాజకీయ స్థాయి చర్చలు జరగాలని నిపుణులు భావిస్తున్నారు.

 
ఇంతకు ముందు పరిస్థితి తిరిగి ఏర్పడేలా, ఉద్రిక్తతల నుంచి రెండు దేశాలను విముక్తి కలిగించడాన్ని డిస్ఎంగేజ్‌మెంట్ ప్రక్రియ అని కూడా అంటారు. అయినా ఈ అంశాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని భావిస్తున్నట్లు రెండు దేశాలు స్పష్టం చేశాయి.