సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By
Last Modified: శనివారం, 13 జులై 2019 (20:55 IST)

ఫేస్‌బుక్‌కు రూ. 36,000 కోట్ల జరిమానా...

డేటా ప్రైవసీ ఉల్లంఘనల వ్యవహారంలో ఫేస్‌బుక్‌కు అమెరికా నియంత్రణ సంస్థలు సుమారు రూ. 34,000 కోట్ల (500 కోట్ల డాలర్లు) జరిమానా విధించాలని నిర్ణయించాయి. రాజకీయ కన్సల్టెన్సీ సంస్థ కేంబ్రిడ్జ్ అనలిటికా 8.7 కోట్ల ఫేస్‌బుక్ యూజర్ల డేటాను అక్రమంగా సంపాదించిందనే ఆరోపణలపై విచారణ చేస్తున్న ఫెడరల్ ట్రేడ్ కమిషన్ (ఎఫ్‌టీసీ) 3-2 ఓట్లతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా మీడియా వెల్లడించింది. .
 
ఫేస్‌బుక్, ఎఫ్‌టీసీలను బీబీసీ సంప్రదించగా వారు దీనిపై స్పందించలేదు. కోట్లాది మంది ఫేస్‌బుక్ యూజర్ల డాటాను కేంబ్రిడ్జి అనలిటికా సంస్థ యాక్సెస్ చేసుకుందన్న అభియోగాల నేపథ్యంలో వినియోగదారుల రక్షణ సంస్థ ఎఫ్‌టీసీ గత ఏడాది మార్చి నుంచి దర్యాప్తు చేస్తోంది. యూజర్ల డాటాను ఎవరితోనైనా షేర్ చేసుకోవచ్చా లేదా అన్నా విషయంలో యూజర్ల అనుమతికి సంబంధించిన 2011నాటి ఒప్పందాలను ఫేస్‌బుక్ ఎలా ఉల్లంఘించిందన్న విషయంలో ఎఫ్‌టీసీ దర్యాప్తు చేసింది.
 
వ్యతిరేకించిన డెమొక్రాట్లు
3-2 ఓట్లతో ఈ జరిమానా విధిస్తూ ఎఫ్‌టీసీ తీసుకున్న నిర్ణయలో రాజకీయంగానూ స్పష్టమైన విభజన కనిపించింది. ఎఫ్‌టీసీలో జరిమానాకు అనుకూలంగా ఓటేసిన కమిషనర్లు ముగ్గురూ రిపబ్లికన్లు కాగా.. దాన్ని వ్యతిరేకించిన ఇద్దరు కమిషనర్లు డెమొక్రట్లు. 'యూజర్ డాటా కానీ, ప్రైవసీ కానీ కాపడే ఉద్దేశం, సామర్థ్యం ఎఫ్‌టీసీకి లేవు. కాంగ్రెస్ చర్యలకు దిగాల్సిన సమయం ఆసన్నమైంద'ని అమెరికా సెనేటర్ మార్క్ వార్నర్ అన్నారు.
 
ఎఫ్‌టీసీ విధించిన జరిమానాపై అమెరికా న్యాయశాఖ పౌర విభాగం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని.. అందుకు ఎంత సమయం పడుతుందో తెలియదని చెబుతున్నారు. జరిమానాను న్యాయశాఖ ఖరారు చేస్తే ఒక టెక్ సంస్థపై ఎఫ్‌టీసీ విధించిన అత్యధిక జరిమానా ఇదే కానుంది. కాగా 500 కోట్ల డాలర్ల జరిమానా పడొచ్చని ఫేస్‌బుక్ ఇప్పటికే ఊహించింది. దీనిపై ఇన్వెస్టర్లూ సానుకూలంగానే ఉండడంతో ఫేస్‌బుక్ షేర్లు 1.8 శాతం పెరిగాయి.
 
అసలేమిటీ కేంబ్రిడ్జ్ అనలిటికా స్కాండల్?
కేంబ్రిడ్జ్ అనలిటికా అనేది బ్రిటన్‌కు చెందిన రాజకీయ సలహా సంస్థ. ఈ సంస్థ ఫేస్‌బుక్ యూజర్లకు చెందిన డాటాను యాక్సెస్ చేసుకుని దాన్ని 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనల్డ్ ట్రంప్‌కు అనుకూలమైన ఫలితాలు రాబట్టేందుకు వాడినట్లు ఆరోపణలున్నాయి. ఈ కేంబ్రిడ్జ్ అనలిటికా స్కాండల్‌పై వివిధ దేశాల్లో దర్యాప్తులు చేశారు.
 
గత అక్టోబరులో డాటా దోపిడీ వ్యవహారంలోనే బ్రిటన్‌కు చెందిన సంస్థ ఫేస్‌బుక్‌కు 5,00,000 పౌండ్ల జరిమానా విధించింది. కెనడాకు చెందిన డాటా రక్షక సంస్థ ఒకటి కూడా ఫేస్‌బుక్ డాటా దుర్వినియోగానికి పాల్పడిందని నిర్ధరించింది.
 
ఫేస్ బుక్ డాటా ఎలా దుర్వినియోగం చేశారంటే..
ఒక క్విజ్ రూపంలో యూజర్ల నుంచి వారి వ్యక్తిత్వాన్ని తెలుసుకోగలిగారు. ఇది కేవలం వారికి సంబంధించే కాకుండా యూజర్ల స్నేహితులకు సంబంధించిన సమాచారమూ రాబట్టారు.