బైక్ దొంగలించారు ప్రభో అంటే.. ఫైన్ కట్టమంటున్న పోలీసులు

Police
శ్రీ| Last Modified శుక్రవారం, 14 జూన్ 2019 (12:50 IST)
పోలీసుల నిర్లక్ష్యం ఓ వాహనదారుడి పాలిట శాపంగా మారింది. బైక్ చోరీకి గురైందని రికవరీ చేయాలని ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. చోరీకి గురైన ఆ బైక్ నగరంలో యధేచ్చగా రోడ్లపై తిరుగుతుంటే.. వాటి ఫొటోలు తీసి బాధితుడికి ఇ-చలాన్లు పంపారు. పోలీసుల తీరుపై ఆక్రోశం వ్యక్తం చేస్తున్నాడు బాధితుడు.

హైదరాబాద్ కుషాయిగూడ నేతాజీనగర్‌కు చెందిన శేషాద్రి తమ ఇంటి ముందు పార్క్ చేసిన మోటారు సైకిల్ చోరీకి గురైనట్టు గతేడాది జనవరిలో కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బైక్ చోరీకి గురైన ఘటనపై కేసు బుక్ చేసిన పోలీసులు మాత్రం రికవరీ చేయడాన్ని మరిచారు. అపహరణకు గురైన ఆ బైక్ పైన దొంగలు యధేచ్చగా నగర రోడ్లపై తిరుగుతున్నా.. పోలీసులు ఎక్కడా ఆపలేదని.. హెల్మెట్ ధరించకుండా బైక్ డ్రైవ్ చేస్తున్నారంటూ పోలీసులు శేషాద్రికి ఇ-చలాన్లు పంపారు.

బైక్‌ను రికవరీ చేయకుండా.. రోడ్లపై తనిఖీల్లో కూడా బైక్‌ను పట్టుకోవడంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని వాపోతున్నాడు బాధితుడు. ఇ-చలాన్లు అన్నీ హెల్మెట్ ధరించలేదంటూ పంపారంటూ సోషల్ మీడియాలో శేషాద్రి పోస్ట్ చేశాడు. చలాన్లు పంపే శ్రద్ద బైక్ రికవరీ చేయడంలో పోలీసులు కనబరిస్తే బాగుంటుందంటున్నాడు బాధితుడు.దీనిపై మరింత చదవండి :