మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Updated : శుక్రవారం, 3 జనవరి 2020 (16:09 IST)

జనరల్ కాసిం సులేమానీ: బగ్దాద్ విమానాశ్రయంలో ఇరాన్ కుర్దు దళాల కమాండర్‌ హతం

కర్టెసీ- సోషల్ మీడియా
 


శుక్రవారం అమెరికా జరిపిన వైమానిక దాడుల్లో కుర్దు దళాల కమాండర్ జనరల్ కాసిం సులేమానీ మృతిచెందారు. తమ అధ్యక్షుడి నిర్దేశాలతో అతడిని చంపినట్లు పెంటగాన్ ధ్రువీకరించింది. 62 ఏళ్ల జనరల్ సులేమానీ స్థానిక ఇరాన్ మద్దతున్న మిలిటెంట్ సంస్థలతో కలిసి బగ్దాద్ విమానాశ్రయంలో కార్లో వెళ్తున్నప్పుడు అమెరికా దాడులు జరిపింది.
 
"ఈ దాడి వెనుక ఉన్న నేరస్థుల కోసం తీవ్రమైన ప్రతీకారం వేచిచూస్తోంది" అని ఇరాన్ సుప్రీమ్ నేత అయతొల్లా అలీ ఖమేనీ అన్నారు. సులేమానీ మృతికి ఇరాన్‌లో మూడు రోజుల పాటు సంతాపం ప్రకటించారు. ఈ వార్తలు రాగానే అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ తన ట్విటర్‌లో అమెరికా జెండాను పోస్ట్ చేశారు.

 
ఏం జరిగింది?
జనరల్ సులేమానీ, ఇరాన్ మద్దతున్న మిలిటెంట్లతో బగ్దాద్ ఎయిర్ పోర్ట్ నుంచి రెండు కార్లలో వెళ్తున్నప్పుడు కార్గో ప్రాంతంలో అమెరికా డ్రోన్లు వాటిపై దాడులు జరిపినట్లు యుఎస్ మీడియా చెప్పింది. కమాండర్ అక్కడి నుంచి లెబనాన్ లేదా సిరియాకు వెళ్లనున్నట్లు చెబుతున్నారు. వారు వెళ్తున్న కాన్వాయ్‌ను చాలా మిసైళ్లు ఢీకొన్నాయి. ఈ దాడుల్లో ఐదుగురు చనిపోయినట్లు భావిస్తున్నారు.

 
మృతుల్లో ఇరాక్ కతాయిబ్ హిజ్బుల్లా కమాండర్ అబూ మహదీ అల్-ముహదిస్ కూడా ఉన్నారు. "అధ్యక్షుడి నిర్దేశాలతో ఖాసిం సులేమానీని చంపడం ద్వారా విదేశాల్లో ఉన్న అమెరికా సిబ్బందిని రక్షించడానికి అమెరికా సైన్యం నిర్ణయాత్మక రక్షణ చర్యలు చేపట్టింది" అని పెంటగాన్ తెలిపింది.

 
"ఇరాన్ భవిష్యత్ వ్యూహాలను అడ్డుకోవడమే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. ప్రపంచవ్యాప్తంగా మా వాళ్లు ఎక్కడ ఉన్నా, వారిని, మా ప్రయోజనాలను కాపాడుకోడానికి మేం అవసరమైన అన్నిరకాల చర్యలనూ కొనసాగిస్తాం" అని ఈ ప్రకటనలో చెప్పారు.

 
ఎంబసీపై దాడి తర్వాత ఘటన
బగ్దాద్‌లోని అమెరికా ఏంబసీపై ఆందోళనకారులు దాడి చేసిన ఒక రోజు తర్వాత ఈ డ్రోన్ దాడులు జరిగాయి. జనరల్ సులేమానీ ఎంబసీపై దాడులు చేయించినట్లు పెంటగాన్ చెప్పింది. బగ్దాద్‌లో అమెరికా దళాలు చాలామంది ఇరాక్ మిలిటెంట్లను అదుపులోకి తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. కానీ వీటిని ఇంకా ధ్రువీకరించలేదు.

 
ఇరాన్ స్పందన
ఇరాన్ విదేశాంగ మంత్రి జావేద్ జరీఫ్ ఈ దాడిని అంతర్జాతీయ తీవ్రవాద చర్యగా వర్ణించారు. అమెరికా, తన 'రోగ్ అడ్వెంచరిజం' అన్ని పరిణామాలకూ బాధ్యత వహిస్తుందని అని ఆయన ట్వీట్ చేశారు. గత ఆదివారం తూర్పు సిరియా, పశ్చిమ ఇరాక్‌లో ఉన్న కతాయిబ్ హిజ్బుల్లా సంస్థ స్థావరాలపై అమెరికా దాడులు చేసింది. ఈ దాడుల్లో 25 మంది మిలిటెంట్లు మృతిచెందారు.

 
ఇరాక్‌లో తమ దళాలపై దాడులు జరిగితే తాము అంగీకరించమని, ఏంబసీ దగ్గర జరిగిన హింసకు ఇరానే కారణమని అమెరికా రక్షణ మంత్రి మార్క్ ఎస్పెర్ గురువారం ఆరోపించారు. ఆయన ఒక ప్రకటనలో "మాపై దాడులు జరిపితే వాటికి మేం తగిన చోట, తగిన విధంగా బదులు ఇస్తాం. దుర్గార్గపు చర్యలకు ముగింపు పలకాలని మేం ఇరాన్ పాలకులను కోరుతున్నాం" అన్నారు.

 
కాసిం సులేమానీ ఎవరు
మేజర్ జనరల్ కాసిం సులేమానీ 1998 నుంచి ఇరాన్ కుర్దుల దళానికి నేతృత్వం వహిస్తున్నారు. ఇరాన్ రివ్యూషనరీ గార్డ్స్‌లో అత్యున్నత విభాగం అయిన ఇది విదేశాల్లో రహస్య కార్యకలాపాలు నిర్వహిస్తుంది. జనరల్ సులేమానీ ఇరాన్ పాలనలో చాలా ముఖ్యమైన వ్యక్తి. ఆయన కుర్ద్ ఫోర్స్ తరఫున నేరుగా సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖొమైనీకి రిపోర్ట్ చేస్తుంటారు.

 
1980లో జరిగిన ఇరాన్-ఇరాక్ యుద్ధంలో పనిచేసినపుడు ఆయన మొదటిసారి వెలుగులోకి వచ్చారు. సులేమాన్‌ను పశ్చిమాసియాలో ఇరాన్ కార్యకలాపాలు నిర్వహించడంలో వ్యూహకర్తగా భావిస్తారు. 2003లో అమెరికా సైనిక దాడుల్లో ఇరాక్‌లో సద్దాం హుస్సేన్ పాలన అంతమైన తర్వాత పశ్చిమాసియాలో కుర్దుల సేన తమ కార్యకలాపాలు వేగవంతం చేసింది. గత ఏడాది ఏప్రిల్‌లో అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ సహా కుర్దు దళాలను విదేశీ తీవ్రవాద సంస్థలుగా ఖరారు చేశారు.