శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: శుక్రవారం, 10 జనవరి 2020 (15:34 IST)

ఇరాన్: సులేమానీ హత్య, బిన్ లాడెన్ మృతి కన్నా ఎందుకు ముఖ్యమైనది?

అల్- ఖైదా మాజీ నాయకుడు ఒసామా బిన్ లాడెన్ మరణం తర్వాత అంతటి వివాదాస్పదమైన ఘటన ఇరాన్ మిలిటరీ కమాండర్ కాసిం సులేమానీ హత్యే అని చెప్పొచ్చు. సులేమానీని హతమార్చడం గత కొన్ని దశాబ్దాల కాలంలో పశ్చిమాసియా భూభాగంలో అమెరికా చేపట్టిన అతిపెద్ద చర్యగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

 
సులేమానీ ప్రయాణిస్తున్న వాహనంపై డ్రోన్‌తో బాంబు వేసేందుకు అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఆదేశాలివ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ దాడికి బదులుగా అమెరికాపై 'ప్రతీకారం' తీర్చుకుంటామంటూ ప్రకటించిన ఇరాన్... ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణులతో దాడులు చేసింది. మరి, ఒసామా బిన్ లాడెన్ మరణం కంటే కాసిం సులేమానీ హత్య ఎందుకు అంత కీలకంగా మారింది?

 
అత్యంత శక్తిమంతమైన నేత
"కాసిం సులేమానీ మరణం పశ్చిమాసియా ప్రాంతంలో ఒక అనూహ్య ఘటన. అల్ ఖైదా మాజీ నేత ఒసామా బిన్ లాడెన్‌తో సులేమానీని పోల్చలేం" అని బీబీసీ పర్షియన్ ప్రత్యేక ప్రతినిధి కాస్రా నాజి అభిప్రాయపడ్డారు. "ఆ ఇద్దరి మరణాలను పోల్చలేం. సులేమానీ ఒక దేశాన్ని నడిపించే సైనిక, రాజకీయ నేత. అదే బిన్ లాడెన్ ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించే ఒక అజ్ఞాత సంస్థకు నాయకుడు. సులేమాని చేతిలో ఒక దేశం ఉండేది. దేశ సైన్యం ఆయన వెనకుండేది. కానీ, బిన్ లాడెన్‌కు అలాంటివేమీ లేవు. ఆ ఇద్దరిని పోల్చి చూడలేం" అని నాజి అన్నారు.

 
అమెరికా మాత్రం బిన్ లాడెన్ లాగే, సులేమానీని కూడా అమెరికన్ల రక్తాన్ని చూసిన వ్యక్తిగానే చూస్తుంది. ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై జరిగిన రాకెట్ దాడుల వెనక సులేమానీ హస్తం ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. ఆ దాడుల్లో అమెరికాకు చెందిన ఒక కాంట్రాక్టర్ చనిపోయారు. ఇరాక్‌తో పాటు పశ్చిమాసియా వ్యాప్తంగా అమెరికా దౌత్యవేత్తలపై దాడులు చేసేందుకు సులేమానీ కుట్ర పన్నుతున్నారని కూడా అమెరికా ఆరోపించింది.

 
ఆయన మృతితో గత కొన్ని దశాబ్దాల కాలంలో ఎప్పుడూ లేనంత తీవ్ర స్థాయిలో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉందని నాజీ అన్నారు. అమెరికా, ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు ఇంకా ఎలాంటి రూపం తీసుకుంటాయోనని అందరూ నిశితంగా గమనిస్తున్నారు.

 
సులేమానీని అమెరికా హతమార్చిన తర్వాత 'మూడో ప్రపంచ యుద్ధం' వస్తుందా? అన్న చర్చ విస్తృతంగా నడిచింది. ప్రపంచవ్యాప్తంగా ఆన్‌లైన్‌లో అత్యధిక మంది వెతికిన అంశాల్లో అది కూడా ఉండటం గమనార్హం. అమెరికా మీద తీవ్ర ప్రతీకారం తీర్చుకుంటామంటూ ఇరాన్ ప్రకటించింది. ఆ తర్వాత ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాల మీద ఇరాన్ క్షిపణులతో దాడులు చేసింది.

 
సులేమానీ మరణం బిన్ లాడెన్, ఇస్లామిక్ స్టేట్ నాయకుడు అబూ బకర్ బాగ్దాదీల కంటే అత్యంత ముఖ్యమైనదని సీఐఏ మాజీ డైరెక్టర్ డేవిడ్ పెట్రాస్ వ్యాఖ్యానించారు. ఇరాక్, అఫ్గానిస్థాన్‌ దేశాల్లో అమెరికా బలగాలకు డేవిడ్ పెట్రాస్ నేతృత్వం వహించారు. పశ్చిమాసియాలో ఇరాన్ బలాన్ని ప్రదర్శించడంలో సులేమానీ కీలకంగా వ్యవహరించారు. 1998 నుంచి ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్‌ - కడ్స్ దళానికి ఆయన నేతృత్వం వహించారు. ఇరాన్ భద్రతా దళాల్లో కడ్స్ దళం ఒక భాగం. ఇది ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది.

 
లెబనాన్‌‌లో హెజ్‌బొల్లా గ్రూపుతో, ఇరాక్ అఫ్గానిస్థాన్‌లలో ఒక మిలీషియా గ్రూపుతో కూడా సులేమానీ దళానికి సంబంధాలు ఉన్నాయి. కాబట్టి, ఆయన మరణం ప్రభావం ఇరాన్ సరిహద్దుల వెలుపల కూడా ఉంటుంది. "ఇరాక్‌ రాజధాని బాగ్దాద్ ఇస్లామిక్ స్టేట్ గ్రూపు చేతుల్లోకి వెళ్తుందన్న సమయంలో సులేమానీ కీలక పాత్ర పోషించారు. ఆ నగరాన్ని ఐసిస్ నుంచి రక్షించడంలో ఆయన సాయపడ్డారన్న భావన ఉంది. ఇస్లామిక్ తీవ్రవాదులు ఇరాన్ సరిహద్దుకు కొన్ని కిలోమీటర్ల సమీపానికి చేరుకున్నప్పుడు వారిని వెనక్కి తరిమేయడంలో సులేమానీ నేతృత్వంలోని దళం కీలక పాత్ర పోషించింది. ఇరాన్‌తో పాటు పశ్చిమాసియాలో ఆ దళానికి ఆదరణ పెరగడానికి అదొక కారణం" అని బీబీసీ ప్రత్యేక ప్రతినిధి నాజీ వివరించారు.

 
అమెరికా, ఇరాన్ రెండూ హద్దులు దాటి వ్యవహరిస్తున్నాయని గతంలో ఇరాక్‌లో అమెరికా రాయబారిగా పనిచేసి, ప్రస్తుతం వాషింగ్టన్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అరబ్ గల్ఫ్ స్టేట్స్‌కు అధ్యక్షుడిగా ఉన్న దౌగ్లాస్ సిల్లీమన్ అభిప్రాయపడ్డారు. ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు అంతర్జాతీయ సమాజం కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆయన బీబీసీతో చెప్పారు. రెండు దేశాల పరస్పర చర్యల వల్లే ఉద్రిక్తతలు పెరుగుతున్నాయని ఆయన అన్నారు.

 
"ప్రస్తుత పరిస్థితుల్లో యుద్ధం ఎందుకు రాకూడదన్న కారణాల కోసం మనం చూడొద్దు. యుద్ధం అసలు రాకూడదు అన్న దిశగా ఆలోచించాల్సిన అవసరం ఉందని అనుకుంటున్నాను" అని సిల్లీమన్ చెప్పారు. తదుపరి పరిణామాలు ఎలాంటి రూపం తీసుకున్నా, అమెరికా, ఇరాన్‌ల సంబంధాలు సులేమానీ మరణానికి ముందు... తర్వాత అని చెప్పుకోవాల్సి ఉంటుంది.