వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజే లండన్‌లోని ఈక్వెడార్ రాయబార కార్యాలయంలో నివసిస్తున్నపుడు.. రహస్యంగా ఇద్దరు పిల్లలకు తండ్రయ్యారని ఆయన భాగస్వామి స్టెల్లా మోరిస్ వెల్లడించారు. అసాంజేతో తాను 2015 నుంచి సంబంధం కొనసాగిస్తున్నానని.. తమకు ఇద్దరు కొడుకులు పుట్టారని, వారిని తానే పెంచుతున్నానని ఆమె తెలిపారు.
బెల్మార్ష్ జైలులో కోవిడ్-19 విస్తరణ భయాల మధ్య ఆమె ఈ విషయం బహిర్గతం చేశారు. అసాంజేను ఏడాది కిందట ఈక్వెడార్ ఎంబసీ నుంచి బయటకు లాక్కొచ్చి బెల్మార్ష్ జైలులో నిర్బంధించారు. ఆస్ట్రేలియాకు చెందిన అసాంజే (వయసు 48 సంవత్సరాలు) ప్రస్తుతం అనారోగ్యంగా ఉన్నారని ఆందోళన వ్యక్తమవుతోంది. ఆయన బెయిల్ కోరుతున్నారు.
దక్షిణాఫ్రికాలో జన్మించిన స్టెల్లా మోరిస్ న్యాయవాదిగా పనిచేస్తున్నారు. అసాంజే ప్రాణాలు ప్రమాదంలో ఉన్నందున తాను మొదటిసారిగా తమ పిల్లల విషయాన్ని వెల్లడిస్తున్నట్లు ఆమె ఆదివారం నాడు ‘ద మెయిల్’ పత్రికకు చెప్పారు. అసాంజేకు కరోనావైరస్ సోకినట్లయితే ఆయన ప్రాణాలతో బయటపడతారని తాను నమ్మటం లేదన్నారు.
వికీలీక్స్ యూట్యూబ్ అకౌంట్‌లో పోస్ట్ చేసిన ఒక వీడియోలో.. అసాంజే న్యాయవాదుల బృందంలో తాను 2011లో చేరానని, అప్పుడే ఆయనను కలిశానని స్టెల్లా చెప్పారు. ఒక లైంగిక దాడి కేసులో నిందితుడిగా తనను స్వీడన్‌కు అప్పగించే పరిస్థితిని తప్పించుకోవటానికి అసాంజే 2012లో ఈక్వెడార్ రాయబార కార్యాలయంలో ఆశ్రయం పొందారు. అనంతర కాలంలో ఆయన మీద ఈ అభియోగాన్ని ఉపసంహరించారు.
గూఢచర్యం అభియోగాల మీద అమెరికా కూడా అసాంజేను తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తోంది. ఈ కేసులో ఆయన పోరాడుతున్నారు. ఈక్వెడార్ రాయబార కార్యాలయంలో అసాంజేను తాను దాదాపు ప్రతి రోజూ కలిసేదానని.. అలా ఆయనను చాలా బాగా తెలుసుకోగలిగానని స్టెల్లా ‘ద మెయిల్’తో చెప్పారు. ఈ జంట 2015లో ప్రేమలో పడ్డారు. రెండేళ్ల తర్వాత నిశ్చితార్థం చేసుకున్నారు.
తమ ఇద్దరు పిల్లలు పుట్టేటపుడు అసాంజే వీడియో లింక్ ద్వారా వీక్షించారని.. పిల్లలు ఎంబసీలో తమ తండ్రిని కలిశారని ఆమె వివరించారు. మూడేళ్ల గాబ్రియెల్, ఏడాది వయసున్న మాక్స్.. ఇద్దరూ తమ తండ్రితో వీడియో కాల్స్‌లో మాట్లాడుతుంటారని తెలిపారు.
‘‘అసాంజే తన చుట్టూ ఉన్న గోడలను బద్దలు చేయటానికి, జైలు వెలుపల జీవితం కోసం కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు’’ అని ఆమె వికీలీక్స్ యూట్యూబ్ వీడియోలో పేర్కొన్నారు. ‘‘ఇటువంటి పరిస్థితుల్లో కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవటం వెర్రితనంగా చాలా మందికి అనిపిస్తుంది. మాకు మాత్రం ఇది చాలా మంచి పని. పిల్లలను చూసినపుడు అసాంజేకు చాలా ఊరట లభిస్తుంది. చాలా మద్దతు లభిస్తుంది. మా పిల్లలు చాలా సంతోషంగా ఉన్నారు’’ అని వివరించారు.
అసాంజేను 2019 ఏప్రిల్ 11న ఈక్వెడార్ రాయబార కార్యాలయంలో అరెస్ట్ చేశారు. కోర్టులో లొంగిపోవటంలో విఫలమైనందున నిర్బంధించారు. బెయిల్ నిబంధనలను ఉల్లంఘించినందుకు 50 వారాల జైలు శిక్ష విధించారు. ఆ శిక్షా కాలాన్ని పూర్తి చేసుకుని గత సెప్టెంబర్‌లోనే అసాంజే విడుదల కావాల్సి ఉండింది.
కానీ.. ఆయన అప్పగింత వ్యవహారం మీద వాదనలు పూర్తయ్యే వరకూ అసాంజేను జైలులోనే ఉంచాలని న్యాయమూర్తి ఆదేశించారు. గతంలో ‘పరారీలో ఉన్న చరిత్ర’ను అందుకు కారణంగా పేర్కొన్నారు. అసాంజేను అప్పగించాలని కోరుతున్న అమెరికా కేసులో భాగంగా గల కోర్టు పత్రాల్లో.. స్టెల్లా మోరిస్‌తో అసాంజే పిల్లల వివరాలను ‘ద మెయిల్’ చూసింది.
అసాంజేకు వేరే పిల్లలు కూడా ఉన్నట్లు భావిస్తుంటారు. కానీ వారి గురించి వివరాలు పెద్దగా తెలియదు. ఆయనకు డానియల్ అసాంజే అనే పెద్ద కొడుకు ఉన్నాడు. డానియల్ ఆస్ట్రేలియాలో సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా పనిచేస్తున్నట్లు చెప్తారు. బ్రిటన్ జైళ్లలో ఉన్న ఖైదీల్లో 1,000 మందికి పైగా ఖైదీలకు కరోనావైరస్ లక్షణాలు ఉన్నట్లు అధికారిక గణాంకాలు చెప్తున్నాయి.
చనిపోయిన ఖైదీల్లో బెల్మార్ష్ జైలులోని ఒక ఖైదీ కూడా ఉన్నారని న్యాయ మంత్రిత్వశాఖ నిర్ధారించిన అంతర్గత సమాచారం చెప్తోంది. కరోనావైరస్ వ్యాప్తిని నియంత్రించటానికి ఇంగ్లండ్, వేల్స్ జైళ్లలో తక్కువ ప్రమాదం ఉన్న దాదాపు 4,000 మంది ఖైదీలను విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.