ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By
Last Updated : శనివారం, 7 సెప్టెంబరు 2019 (11:24 IST)

చంద్రుడిని ఆలింగనం చేసుకోవటానికి చంద్రయాన్ 2 పరుగు తీసింది... అందుకే: మోదీ

చంద్రయాన్-2 సాఫ్ట్ లాంచ్‌లో అవాంతరం ఏర్పడిన అనంతరం ఇస్రో నుంచి ప్రధాన మోదీ మాట్లాడారు. చంద్రయాన్ మిషన్ కోసం శాస్త్రవేత్తలు రేయింబవళ్లు శ్రమించారని కొనియాడారు. అయితే ఆఖరి అడుగులో అవరోధం తలెత్తిందన్నారు. అయినా దీనిని ‘చంద్రయాన్ చివరి నిమిషంలో చంద్రుడిని ఆలింగనం చేసుకోవటానికి పరుగు తీసింద’ని భావిద్దామన్నారు. శనివారం ఉదయం బెంగళూరులోని ఇస్రో కేంద్రంలో మోదీ చేసిన ప్రసంగాన్ని మీడియాలో ప్రత్యక్ష ప్రసారం చేశారు. ‘భారత్ మాతాకీ జై’ అని మూడుసార్లు నినాదం చేసి మోదీ ప్రసంగం ప్రారంభించారు. 
 
మళ్లీ పైకి లేస్తాం
‘‘అతి త్వరలో నూతన ఉదయం ఉంటుంది. రేపు ప్రకాశవంతంగా ఉంటుంది. సైన్స్‌లో వైఫల్యం అనేది లేదు. ప్రయోగాలు, ప్రయత్నాలు మాత్రమే ఉంటాయి. మనం మళ్లీ పైకిలేస్తాం. సరికొత్త శిఖరాలను, విజయాలను అందుకుంటాం.
 
ఈ పాఠాలు మనల్ని మరింత బలోపేతం చేస్తాయి...
‘‘మన ఘనమైన చరిత్రలో మన వేగాన్ని మందగింపజేసిన క్షణాలను మనం ఎదుర్కొన్నాం. కానీ అవి ఎన్నడూ మన స్ఫూర్తిని అణచివేయలేదు. మనం మళ్లీ పైకి లేచాం. అద్భుత విజయాలు సాధిస్తూ ముందుకుసాగాం. మన నాగరికత ఇంత గొప్పగా నిలవటానికి ఇదే కారణం. ఈ ప్రయత్నం, ఈ ప్రయాణం విలువైనవని ఈ రోజు నేను సగర్వంగా చెప్తా. మన టీం కష్టపడి పనిచేసింది. సుదూరం ప్రయాణించింది. ఈ పాఠాలు మనతోనే ఉంటాయి. నేడు నేర్చుకున్నవి మనల్ని మరింత బలోపేతం చేస్తాయి. మరింత ఉత్తమంగా మలచుతాయి.’’
 
కొత్త శిఖరాలను, కొత్త విజయాలను అందుకుంటాం...
‘‘మన అంతరిక్ష కార్యక్రమం పట్ల మనం గర్విస్తున్నాం. ఇప్పుడు చంద్రుడిని తాకాలన్న మన పట్టుదల మరింత బలపడింది. మీరు ఉదాసీనం కావద్దు. ఇది చిన్న విజయం కాదు. మీ విజయాల పట్ల దేశం గర్విస్తోంది. అయితే గత కొద్ది గంటలుగా దేశమొత్తం ఆందోళనగా ఉంది. మీకు ప్రతి ఒక్కరూ అండగా ఉన్నారు. మనం అధిగమిస్తాం. కొత్త శిఖరాలను, విజయాలను అందుకుంటాం. మన శాస్త్రవేత్తలకు నేను చెప్పదలచుకున్నా.. భారతదేశం మీతో ఉంది.’’
 
మీ మనోస్థితిని అర్థం చేసుకున్నాను...
‘‘మీరు తల్లి భారత జయం కోసం అహర్నిశలూ పనిచేస్తారు. తల్లి భారతి తల ఎత్తుకోవటం కోసం జీవితం మొత్తం ధారపోస్తున్నారు. దేశం కోసం మీ జీవితాలు, కలలు త్యాగం చేశారు. నిన్న రాత్రి మీ మనోస్థితిని నేను అర్థం చేసుకున్నాను. మీ కళ్లు చాలా చెప్పాయి. మీ ముఖాల్లో ఉదాసీనత నేను చదివాను. అందుకే మీ మధ్య ఎక్కువ సేపు లేను. మీరు చాలా రాత్రులు నిద్రపోలేదు. అయినా మరొకసారి మిమ్మల్ని పిలిచి మాట్లాడాలనుకున్నాను.’’