భారత కీర్తి పతాకను విశ్వాంతరాలకు చేర్చిన ప్రయోగం చంద్రయాన్ 2. 2019 జులై 22న షార్ అంతరిక్ష కేంద్రం నుంచి నిప్పులు చిమ్ముకుంటూ చంద్రయాన్ 2 నింగికెగిసింది. మరికొన్ని గంటల్లో చంద్రుడిపై సెప్టెంబరు 7న... అంటే ఈ రోజు అర్థరాత్రి వాలబోతోంది. అయితే ఇక్కడే ఓ చిన్న ప్రశ్న కొందరి మదిలో మెదులుతోంది. అదేంటంటే.. సరిగ్గా 50 ఏళ్ల కిందట అమెరికా అంతరిక్ష సంస్థ నాసా పంపిన అపోలో 11 అనే మానవ సహిత వ్యోమనౌక... నాలుగు రోజుల్లో గమ్యాన్ని చేరుకుని... చంద్రుడి మీద ల్యాండ్ అయ్యింది. కానీ ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 2 మాత్రం చంద్రుడిని చేరుకోడానికి 48 రోజులు పట్టింది.
50 ఏళ్ల కిందటే... అంత వేగంగా చేరుకోగలిగినప్పుడు.. ఇస్రో పంపిన చంద్రయాన్ ఇంకా వేగంగా వెళ్లగలగాలి కదా. కానీ ఎందుకు ఆలస్యంగా వెళ్తోంది అన్నదే సర్వత్రా ఆసక్తి కలిగిస్తున్న ప్రశ్న.
నాసా ప్రయాణం వెనుక..
1969 జులై 16న... అమెరికా అంతరిక్ష సంస్థ నాసా.. కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి శాటరన్ ఫైవ్ ఎస్ఏ506 రాకెట్ సాయంతో నీల్ ఏ ఆర్మ్ స్ట్రాంగ్, ఎడ్విన్ ఈ ఆల్డ్రిన్, మైఖెల్ కొల్లిన్స్ అనే ముగ్గురు వ్యోమగాముల్ని చంద్రుడిపైకి పంపింది. జులై 16 ఉదయం 8 గంటల 32 నిముషాలకు నింగిలోకి దూసుకెళ్లిన అపోలో 11... 102 గంటల 45 నిముషాలకు గమ్యాన్ని చేరుకుని, చంద్రుడి ఉపరితలంపై ల్యాండ్ అయ్యింది. అంటే కేవలం నాలుగు రోజుల ఆరు గంటల్లోనే వారు గమ్యం చేరుకున్నారు. ఆపై వ్యోమగాములు నీల్ ఆర్మ్ స్ట్రాంగ్, ఎడ్విన్ ఆల్డ్రిన్‌లు చంద్రుడిపై దిగి, అక్కడి మట్టి, రాళ్లను సేకరించారు.
జులై 21న భూమ్మీదకు తిరుగు ప్రయాణం ప్రారంభించిన అపోలో 11 వ్యోమగాములున్న మాడ్యూల్ జులై 24న నార్త్ ఫసిఫిక్ సముద్రంలో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. అంటే భూమ్మీద నుంచి చంద్రుడి మీదకు వెళ్లి, అక్కడ పరిశోధనలు చేసి, తిరిగి భూమ్మీదకు రావడానికి వాళ్లకు కేవలం ఎనిమిది రోజుల 3 గంటలు మాత్రమే పట్టింది.
కానీ ఇస్రో చంద్రుడి మీద పరిశోధనల కోసం కేవలం ఆర్బిటర్, ల్యాండర్‌లను మాత్రమే పంపించింది. అయినా... అవి చంద్రుడిని చేరుకోడానికి 48 రోజులు ప్రయాణించేలా ఏర్పాట్లు చేశారు. ఇంత ఆలస్యం వెనుక చాలా పెద్ద కథే ఉంది.
ఎందుకింత ఆలస్యం..
చంద్రయాన్ 2 సుదీర్ఘ ప్రయాణం వెనుక సాంకేతికంగా చాలా కారణాలున్నాయి. 1969లో నాసా ప్రయోగించిన అపోలో 11 రాకెట్ బరువు ఇంధనంతో కలిపి దాదాపు 2800 టన్నులు. కానీ ఇస్రో ప్రయోగించిన జీఎస్ఎల్వీ మార్క్ త్రీ రాకెట్ బరువు ఇంధనంతో కలసి 640 టన్నులే.
సాధారణంగా శాటిలైట్లను అంతరిక్షంలోకి తీసుకెళ్లే పీఎస్ఎల్వీ రాకెట్లు ఇంతింత బరువు ఉండవు. ఎందుకంటే అవి కేవలం శాటిలైట్లను తీసుకెళ్లి జియో సింక్రనైజ్డ్ లేదా జియో స్టేషనరీ ఆర్బిట్లలో ప్రవేశ పెడతాయి. కానీ చంద్రయాన్ ఇందుకు విభిన్నం. ఎందుకంటే చంద్రుడి దగ్గరకు వెళ్లాల్సిన వాహక నౌకలో ఇంధనంతో పాటు చాలా పరికరాలు ఉంటాయి. అందుకే ఇలాంటి ప్రయోగాలకు అత్యంత శక్తిమంతమైన రాకెట్లను వినియోగిస్తారు.
ఈ విషయంలో కూడా నాసా ప్రయోగించిన రాకెట్ల బరువు ఎక్కువే. భూకక్ష్యను దాటిన తర్వాత... చంద్రుడి వైపు ప్రయాణించిన అపోలో వ్యోమనౌక బరువు... 45.7 టన్నులు. ఇందులో 80 శాతానికి పైగా ఇంధనమే. అంటే అపోలో 11లో ఈగిల్ అనే ల్యాండర్ చంద్రుడి మీద దిగి, వ్యోమగాములు చంద్రుడి మీద దిగి, పరిశోధనలు చేశాక, తిరిగి ఆ ల్యాండర్ ఆర్బిటర్‌ను చేరుకుని, అది భూమ్మీదకు రావడానికి ఇంత ఇంధనం అవసరం.
అపోలో 11 ప్రయోగానికి ఉపయోగించిన రాకెట్ శాటరన్ ఫైవ్ ఎస్ఎఏ506 అత్యంత శక్తిమంతమైనది. అంత భారీ ఇంధనం, అంత భారీ రాకెట్ కాబట్టే... అపోలో 11 కేవలం నాలుగు రోజుల్లో నేరుగా ప్రయాణించి చంద్రుడిని చేరిందని బీఎం బిర్లా సైన్స్ సెంటర్ డైరెక్టర్ బీజీ సిద్ధార్ధ్ తెలియ చేశారు.
తక్కువ ఇంధనం... ఎక్కువ ప్రయాణం..
ప్రస్తుతం ఇస్రో దగ్గరున్న అత్యంత శక్తిమంతమైన రాకెట్ జీఎస్ఎల్వీ మార్క్ త్రీ. జులై 22న చంద్రయాన్ 2ను తీసుకుని నింగిలోకి దూసుకెళ్లినప్పుడు ఆ రాకెట్ మొత్తం బరువు 640 టన్నులు. ఈ రాకెట్ గరిష్టంగా నాలుగు టన్నుల బరువున్న శాటిలైట్లను మోసుకెళ్లగలదు. అంటే నాలుగు టన్నుల బరువైన చంద్రయాన్ 2ను జీఎస్ఎల్వీ మార్క్ త్రీ అంతరిక్షంలోకి తీసుకెళ్లి దానిని భూకక్ష్యలోకి ప్రవేశ పెట్టింది. అక్కడి నుంచి చంద్రయాన్ 2 తనంతట తాను ప్రయాణించి చంద్రుడిని చేరుకోవాలి.
50 ఏళ్ల కిందట నాసా చేపట్టిన అపోలో 11 ప్రయోగంలో... ఇలా అంతరిక్షం నుంచి దూసుకెళ్లిన రాకెట్ బరువు 45 టన్నులకు పైమాటే. కానీ చంద్రయాన్‌లో ఆర్బిటర్, ల్యాండర్, రోవర్, ఇంధనంతో కలిపి మొత్తం బరువు 4 టన్నుల లోపే ఉంది. అంటే అతి తక్కువ ఇంధనంతో... చంద్రుడి దగ్గరకు చేరుకోవాలి. ఇందుకోసమే... ఇస్రో ఓ వినూత్న ఆలోచన చేసింది.
ఈ విధానంలో రాకెట్ నేరుగా చంద్రుడి మీదకు దూసుకెళ్లడానికి బదులుగా... భూమి చుట్టూ దీర్ఘ వృత్తాకార కక్ష్యలో తిరుగుతూ, క్రమంగా తన అపోజీని పెంచుకుంటూ వెళ్లేలా ఏర్పాటు చేశారు. ఆపై భూ కక్ష్య నుంచి బయటపడి చంద్రుడి వైపు ప్రయాణం చేసి, అక్కడ నుంచి చంద్రుడి చుట్టూ ఇదేలా దీర్ఘవృత్తాకార కక్ష్యలో తిరుగుతూ క్రమంగా తన అపోజీని తగ్గించుకుంటూ, చివరికి చంద్రుడి వైపు ప్రయాణించి, ఆ ఉపరితలంపై దిగుతుంది.
చంద్రయాన్ 2 ప్రయాణం సాగిందిలా...
ఈ విధానంలో జులై 22న అంతరిక్షంలోకి దూసుకెళ్లిన చంద్రయాన్ 2... 23 రోజుల పాటు భూమి చుట్టూ దీర్ఘవృత్తాకార కక్ష్యలో తిరుగుతూ... దాని అపోజీ పరిధి పెంచుకుంటూ పోయింది. 23వ రోజు భూ కక్ష్య నుంచి విడిపోయి... చంద్రుడి వైపు ప్రయాణం ప్రారంభించింది. అలా ఏడు రోజులు నేరుగా చంద్రుడి వైపు ప్రయాణించిన తర్వాత... 30వ రోజున అంటే ఆగస్ట్ 20న చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించింది. ఇలా చంద్రుడి గురుత్వాకర్షణ పరిధిలోకి ప్రవేశించడాన్నే లూనార్ ఆర్బిట్ ఇన్‌సర్షన్ అంటారు. అక్కడి నుంచి చంద్రుడి చుట్టూ 13 రోజులు పరిభ్రమిస్తూ... అపోజీ తగ్గించుకుని, చంద్రుడి మీదకు దిగేలా ప్రోగ్రామ్ చేశారు.
ఇలా చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించిన 13వ రోజు... చంద్రయాన్ 2లోని ఆర్బిటర్ నుంచి ల్యాండర్ విడిపోయి చంద్రుడి ఉపరితలం వైపు ప్రయాణించి, 48వ రోజు... ల్యాండర్ చంద్రుడి మీద దిగి, పరిశోధనలు చేసేలా ఇస్రో అంతా ముందుగానే ప్రోగ్రామ్ చేసింది. ఒక్కసారి చంద్రయాన్‌లో ల్యాండర్ చంద్రుడి ఉపరితలం మీద దిగిన తర్వాత, అందులో వివిధ రకాల సెన్సర్లు చంద్రుడిపై పరిశోధనలు చేసి, ఆ సమాచారాన్ని భూమ్మీదకు పంపేలా ఏర్పాట్లు చేశారు.
ఇక ల్యాండర్ నుంచి బయటకు వచ్చే రోవర్ ప్రజ్ఞాన్... చంద్రుడి మీద తిరుగుతూ... అక్కడి నేలను విశ్లేషించడంతో పాటు, మరిన్ని పనులు చేస్తుంది. ఇలా ఇస్రో తన దగ్గరున్న రాకెట్ సామర్థ్యంతో, అతితక్కువ ఇంధనంతో విజయవంతంగా చంద్రుడిని చేరుకోడానికే ఇలాంటి విధానాన్ని ఎంచుకుంది. ఈ విధానం వల్లే అతి తక్కువ ఖర్చుతో ఇస్రో తన ప్రయోగాలు పూర్తి చేస్తోందని బీజీ సిద్ధార్ధ్ తెలిపారు.
అన్ని ప్రయోగాలకూ ఇదే పద్ధతి
2008లో ఇస్రో చంద్రయాన్ 1 ప్రయోగాన్ని 386 కోట్ల రూపాయల ఖర్చులో పూర్తి చేసింది. ఆపై 2014లో మార్స్ మీదకు ప్రయోగించిన మంగళ్‌యాన్ ప్రాజెక్టు కూడా... 450 కోట్ల రూపాయల ఖర్చుతో పూర్తి చేశారు. ఇదే మార్స్ మీదకు నాసా ప్రయోగించిన అమెరికా మావెన్ ఆర్బిటర్ ప్రయోగానికి ఇంత కన్నా పది రెట్లు ఎక్కువ ఖర్చు పెట్టినట్లు... బీబీసీ సైన్స్ వెల్లడించింది. అప్పట్లో భారత్ చేపట్టిన మంగళ్‌యాన్ ప్రయోగాన్ని ప్రపంచమంతా కొనియాడింది. హాలీవుడ్‌లో భారీ వ్యయంతో స్పేస్ సినిమాలు తీస్తుంటే... అంత కన్నా తక్కువ ఖర్చుతో ఇస్రో మంగళ్‌యాన్ ప్రాజెక్ట్ పూర్తి చేసిందని ప్రధాని మోదీ కూడా కొనియాడారు.
ఇప్పుడు కూడా... ఇలాగే మీడియం లిఫ్ట్ హెవీ వెహికల్ అయిన జీఎస్ఎల్వీ మార్క్ త్రీ రాకెట్‌ని ఉపయోగించి కేవలం 978 కోట్ల రూపాయల అతి తక్కువ ఖర్చుతో ఇస్రో చంద్రయాన్ 2 ప్రాజెక్ట్ పూర్తి చేసిందని, త్వరలో ఇదే తరహాలో గగనయాన్ ప్రాజెక్ట్ కూడా పూర్తి చేయబోతోందని ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ ఎన్.శ్రీరఘునందన్ బీబీసీతో తెలియచేశారు.
చంద్రయాన్-1లోనే చంద్రుడిపై ల్యాండర్
చంద్రయాన్ 1 ప్రయోగంలో ఇస్రో కేవలం ఆర్బిటర్ మాత్రమే ప్రయోగించిందని అంతా అనుకున్నారు. కానీ ఆ ప్రయోగంలో ఆర్బిటర్‌తో పాటుగా... మూన్ ఇంపాక్ట్ ప్రోబ్‌ను కూడా ప్రయోగించింది. చంద్రయాన్ 1లో ఆర్బిటర్ చంద్రుడి చుట్టూ నిర్ణీత కక్ష్యలో తిరుగుతుంటే... మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ మాత్రం చంద్రుడి ఉపరితలంపై క్రాష్ ల్యాండ్ అయ్యింది. ఆ మూన్ ఇంపాక్ట్ ప్రోబ్‌కి నాలుగు పక్కలా భారతీయ జెండాను ఉంచారు. అలా చంద్రుడి మీద భారత జాతీయ పతాకం పదేళ్ల కిందటే కాలు మోపిందన్నమాట.
అంతే కాదు... ఈ మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ ఇచ్చిన సమాచారంతోనే చంద్రుడి మీద నీటి జాడలను ఇస్రో గుర్తించింది. 50 ఏళ్ల కిందట భారత్‌లో ఇస్రో ప్రస్థానం ప్రారంభం కావడానికన్నా ముందే అమెరికా తమ వ్యోమగాముల్ని చంద్రుడి మీదకు పంపి, అక్కడి శిలలను భూమికి తీసుకొచ్చింది. ఆపైనా 1972 వరకూ నాసా 12 మంది వ్యోమగాముల్ని చంద్రుడి మీదకు పంపింది. కానీ చంద్రుడి మీద నీటి జాడలు మాత్రం అమెరికా సహా మరే దేశమూ కనిపెట్టలేకపోయింది. కానీ చంద్రయాన్ 1తో ఇస్రో ప్రయోగించిన మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ మాత్రం ఆ ఘనత సాధించిందని రఘునందన్ తెలిపారు.
తొలి ప్రయత్నంలోనే ఇస్రో విజయం
అతి తక్కువ ఖర్చుతో అంతరిక్ష ప్రయోగాలు చెయ్యడమే కాదు... అన్ని అంశాల్లోనూ దాదాపు తొలి ప్రయత్నాలతోనే విజయం సాధిస్తూ వస్తోంది ఇస్రో. చంద్రయాన్ 1, చంద్రయాన్ 2, మంగళ్‌యాన్ ప్రయోగాల్లో అత్యంత సంక్లిష్టమైన దశ... లూనార్ ఆర్బిట్ ఇన్‌సర్షన్. ఇది అనుకున్నంత సులువైన దశ కాదు. అమెరికా, రష్యాలు తొలినాళ్లలో 14 సార్లు ఈ దశ దగ్గరే విఫలమయ్యాయి. 15వ సారి మాత్రమే ఈ దశ దగ్గర విజయం సాధించాయి. కానీ ఇస్రో మాత్రం తొలి ప్రయత్నంలోనే చంద్రయాన్ 1 ప్రయోగంలో ఈ దశను విజయవంతంగా అధిగమించింది.
Nasa.gov వెల్లడించిన వివరాల ప్రకారం అపోలో 11 ప్రయోగంలోనే కాదు.. అంత కన్నా ముందుకూడా చాలామందిని చంద్రుడి మీదకు పంపింది నాసా. కానీ వాళ్లంతా చంద్రుడి కక్ష్య వరకూ వెళ్లి, చంద్రుడి చుట్టూ చక్కర్లు కొట్టి వెనక్కి వచ్చేశారు తప్ప చంద్రుడి మీద దిగలేదు. 1968 డిసెంబర్ 25న ఫ్రాంక్ బోర్మన్, బిల్ యాండ్రెస్, జిమ్ లోవెల్‌లతో కూడిన వ్యోమనౌక చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించి, తిరిగి వెనక్కి వచ్చేసింది. కానీ వాళ్లు చంద్రుడి మీద దిగకపోవడంతో... ఈ ప్రయోగం ప్రపంచానికి తెలియలేదు.
12 మందిని చంద్రుడిపైకి పంపిన నాసా
కేవలం అపోలో 11 ద్వారా ముగ్గురు వ్యోమగాముల్ని పంపడమే కాదు.. ఆ తర్వాత కూడా ఇలాంటి ప్రయోగాలు కొనసాగించింది నాసా. 1969 నవంబర్ 14న అపోలో 12 రాకెట్ ద్వారా మరో ముగ్గురు వ్యోమగాముల్ని చంద్రుడి మీదకు పంపింది. అలా 1972 డిసెంబర్ 7న అపోలో 17 చివరిసారిగా ముగ్గురు వ్యోమగాముల్ని పంపింది. ఇలా మూడేళ్ల వ్యవధిలో నాసా 12 మంది వ్యోమగాముల్ని చంద్రుడి మీదకు పంపింది. ఆ తర్వాత చంద్రుడి మీదకు మనుషుల్ని పంపే ప్రయోగాలను నిలిపేసింది. ఈ విజయాల వెనుక నాసా ఎన్నో వైఫల్యాలను కూడా చవిచూసింది.
1967 ఫిబ్రవరి 21న నాసా అపోలో 1 ప్రయోగానికి సర్వం సిద్ధం చేసింది. కానీ రిహార్సల్ టెస్టింగ్ టైంలో క్యాబిన్లో మంటలు రేగడంతో... రాకెట్ పేలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యోమగాములతో పాటు 27 మంది సిబ్బంది మరణించారు. ఇలా ఎన్నో విఫలయత్నాల తర్వాత... నాసా విజయవంతంగా చంద్రుడి మీద కాలు మోపింది. కానీ ఇస్రో మాత్రం అతి తక్కువ ఖర్చుతో, తొలి ప్రయత్నాలతోనే విజయం సాధిస్తూ వస్తోందని ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ రఘునందన్ తెలియ చేశారు.
చంద్రయాన్‌లో ఏమున్నాయి..?
చంద్రయాన్‌లో ప్రధానంగా మూడు భాగాలున్నాయి. అందులో మొదటిది చంద్రుడి కక్ష్యలోనే తిరిగే ఆర్బిటర్. రెండోది జాబిల్లి మీద దిగే ల్యాండర్. దీనిపేరే విక్రమ్. ఇక మూడోది ఆ ల్యాండర్ చంద్రుడి మీద దిగిన తర్వాత బయటకొచ్చి చంద్రుడిపై కలియ తిరిగే రోవర్.. దీని పేరు ప్రజ్ఞాన్. ఈ మూడింటినీ కలిపి కాంపోజిట్ మాడ్యూల్ అంటారు.
ఇలా ఆర్బిటర్‌ను, ల్యాండర్‌ను ఒకేసారి పంపడం అంత సులువైన విషయం కాదు. ఇస్రో మాత్రం ఈ రెండింటినీ ఒకేసారి ఒకే రాకెట్‌తో ప్రయోగించేసింది. అంతేకాదు.. ఇందులో ఆర్బిటర్‌తో పాటు, చంద్రుడి మీద దిగే రోవర్‌ను కూడా.. పూర్తి దేశీయ పరిజ్ఞానంతో రూపొందించింది.
ఇక్కడ మరో అద్భుతమైన విషయం గురించి కూడా ప్రస్తావించాలి. భూమ్మీద నుంచి చంద్రుడి మీదకు సిగ్నల్ పంపాలంటే 15 నిముషాలు పడుతుంది. అంటే ల్యాండర్ చంద్రుడి మీద దిగేటప్పుడు భూమ్మీద నుంచి దాన్ని కంట్రోల్ చెయ్యడం దాదాపు అసాధ్యం. అందుకే ల్యాండర్ తనంతట తానే నిర్ణయాలు తీసుకునేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ప్రోగ్రామ్ చేశారని రఘునందన్ తెలియ చేశారు.