శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: గురువారం, 18 ఫిబ్రవరి 2021 (13:56 IST)

చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో టీడీపీ కుప్పకూలింది' -ప్రెస్ రివ్యూ

ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న పంచాయితీ ఎన్నికలు మూడో విడతలో చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో వైసీపీ అభిమానులకే మెజారిటీ సర్పంచ్‌ పీఠాలు దక్కాయని, కుప్పంలో చంద్రబాబుకు ప్రజలు గుడ్‌బై చెప్పారంటూ సాక్షి పత్రిక ఒక కథనం ఇచ్చింది.

 
కుప్పం నియోజక వర్గంలో 89 పంచాయితీలుండగా, అందులో 74 చోట్ల వైసీపీ అభిమానులు గెలిచారని, టీడీపీ మద్దతుదారులు 14 పంచాయతీల్లో, ఇతరులు ఒకచోట గెలుపొందారని ఈ కథనం వెల్లడించింది. గుంటూరు జిల్లాలో మూడో విడతలో మాచర్ల నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల్లో 78 పంచాయతీలకు గాను 75 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభిమానులు ఏకగ్రీవంగా విజయం సాధించారు. మిగిలిన మూడు స్థానాలకు బుధవారం పోలింగ్‌ జరిగింది. లెక్కింపు అనంతరం ఈ మూడు స్థానాల్లో కూడా వైఎస్సార్‌సీపీ అభిమానులు గెలిచారు.

 
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో 85 గ్రామ పంచాయతీలకు గాను 85లో వైఎస్సార్‌సీపీ అభిమానులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తొలి రెండు విడతల్లో మాదిరే బుధవారం మూడో విడతలోనూ పల్లె ప్రజలు జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ సంక్షేమ పాలనకు బ్రహ్మరథం పట్టారని సాక్షి కథనం తెలిపింది. మూడో విడతలోనూ 80 శాతానికి పైగా సర్పంచ్‌ స్థానాలను వైఎస్సార్‌సీపీ అభిమానులు గెలుచుకున్నారని ఈ కథనం వెల్లడించింది.

 
''చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో తెదేపా కుప్పకూలింది. 89 పంచాయతీలకు ఎన్నికలు జరిగితే 74 చోట్ల వైసీపీ మద్దతుదారులు విజయం సాధించారు. అధికారంలోకి 18 నెలలైనా ఏమీ చేయలేకపోయారంటూ ముఖ్యమంత్రిపై ప్రచారం చేసిన చంద్రబాబు, లోకేశ్ లకు కుప్పం పరిధిలోని పంచాయతీ ఫలితాలు చెంపపెట్టు'' అని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖమంత్రి కన్నబాబు వ్యాఖ్యానించినట్లు ఈనాడు పేర్కొంది. ''మూడు విడతల ఎన్నికల్లో వైసీపీకి 90శాతం అనుకూలంగా ఫలితాలు వచ్చాయి'' అని మంత్రి బొత్స వ్యాఖ్యానించినట్లు ఈనాడు వెల్లడించింది.