శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బీబీసి సౌజన్యంతో
Last Modified: శనివారం, 14 సెప్టెంబరు 2019 (10:59 IST)

#SaveNallamala నల్లమల అడవుల్లో యురేనియం సర్వే: "ఇక్కడ తవ్వితే మా ఊళ్లు నాశనమైపోతాయి..

దాదాపు 60 ఏళ్ల వయసున్న చిగుర్ల ఐతయ్య చెంచు తెగ పెద్దమనిషి. నల్లమల అడవుల్లోని కుడిచింత బయలు గ్రామంలో, ఆర్డీఎఫ్ ట్రస్టు వారు తనకు కట్టిచ్చిన చిన్న ఇంటి ముందు నులక మంచం మీద కూర్చుని వచ్చేపోయే బండ్లను చూస్తున్నారు. ఎదురుగా ఉన్న కంకర రోడ్డు మీద దుమ్ము రేపుకొంటూ పెద్ద పెద్ద కార్లు మల్లెలతీర్థం వైపు వెళుతున్నాయి.

శ్రీశైలం-హైదరాబాద్ దారిలో ఉన్న పర్యాటక కేంద్రాల్లో మల్లెల తీర్థం ఒకటి. బీబీసీ బృందం పలకరించినప్పుడు ఆ పెద్దమనిషిలో దిగులు కనిపించింది. కొంత కాలం తరువాత ఆ ఊరు, ఆ మల్లెలతీర్థం, తమ అడవి, తమ వ్యవసాయం, పర్యాటకుల సందడి.. ఇవన్నీ ఉంటాయో ఉండవో అన్న బెంగ ఆయనలో ఉంది. కారణం- తమ అడవిలో యురేనియం తవ్వుతారన్న వార్తలే.
 
"ఇంత ఆరోగ్యకరమైన స్థలం నుంచి వెళ్లగొడితే ఎక్కడికి పోతాం? మేమెక్కడికీ పోం. (యురేనియంను) తవ్వనీయం. తవ్వనీయం. తవ్వనిస్తే మేం భంగపడిపోతాం. యురేనియం తవ్వితే ఊళ్లు నాశనమైపోతాయి. అందుకే తవ్వద్దు. తవ్వితే దాని విష పదార్థం కొట్టి భంగం అయిపోతాం" అన్నారు ఐతయ్య.
 
"మేం మొదట్లో వాళ్లు తవ్వుకుని పోతారులే అనుకున్నాం. కానీ అది తవ్వితే విషం గాల్లో వచ్చి మనకు పారుతుంది అని చెప్పారు. మనుషులు బతకరు అన్నారు. అట్లైతే అసలే వద్దు. మనం చావనీకి అదెందుకు తవ్వాలి?" అని ప్రశ్నించారాయన.
 
కుడిచింత బయలు గ్రామం కానీ, మల్లెల తీర్థం కానీ ప్రస్తుతం ప్రతిపాదించిన యురేనియం సర్వే బోర్లు వేసే ప్రాంతంలో లేవు. అయినా వారిలో అంత బెంగ ఉండటానికి కారణం, పక్క ఊరు తవ్వినప్పుడు తమ ఊరినీ - తమ అడవినీ వదలిపెట్టరేమోననే ఆలోచన. పక్క ఊరిలో తవ్విన యురేనియం వల్ల తామూ ప్రమాదంలో పడతామేమోననే భయమూ ఉంది.
 
"ఇక్కడ తవ్వుకోమని మా ఊరు (అమ్రాబాద్ మండలం) చెప్పాల. కానీ మా ఊరికి చెప్పకుండానే అన్నీ చేసేశారు. ఇప్పుడు మాకేం అవుతుందో అర్థం కావడం లేదు" అంటూ నిట్టూర్పు విడిచారు ఐతయ్య. యురేనియం సర్వే పరిధిలో లేని గ్రామంలోని పరిస్థితి ఇది. సర్వే చేసే ప్రాంతాల్లోనైతే నిరసనలు తీవ్రంగా జరుగుతున్నాయి.
 
అసలెందుకీ యురేనియం?
అణు విద్యుత్ ఉత్పత్తిలో, అణ్వాయుధాల తయారీలో యురేనియం వాడతారు. 'యురేనియం' ఓ రేడియో ధార్మిక పదార్థం. ప్రస్తుతం అందుబాటులో ఉన్న రేడియో ధార్మిక పదార్థాల్లోకెల్లా యురేనియం వాడకం ఎక్కువ. ప్రపంచంలో అతి ఎక్కువగా తవ్వితీసే రేడియోధార్మిక పదార్థం యురేనియమేనని మైనింగ్-టెక్నాలజీ.కామ్ అనే వెబ్ సైట్ తెలిపింది.
 
బొగ్గు, నీరు, గాలి, సూర్యుడి నుంచి కరెంటు తీసినట్టే అణు పదార్థాల నుంచి కూడా కరెంటు తయారు చేస్తారు. అణు ధార్మిక పదార్థాల నుంచి మిగిలిన వాటి కంటే ఎక్కువ మొత్తంలో కరెంటు వస్తుంది. ఇందులో రిస్కు, ఖరీదు కూడా అందుకు తగినట్లుగానే ఉంటాయి.
 
యురేనియం ఎంత శక్తిమంతమైన ఖనిజం అంటే, ఒక కేజీ యురేనియం-235 సుమారు 1500 టన్నుల బొగ్గుతో సమానమైన కరెంటునిస్తుందని జాన్ ఎమ్స్లే రాసిన 'నేచర్స్ బిల్డింగ్ బ్లాక్స్: యాన్ ఏ టు జెడ్ గైడ్ టు ద ఎలిమెంట్స్' పుస్తకం చెబుతోంది. యురేనియంలో రకాల్లో యురేనియం- 235 ఒకటి.
 
అణు విద్యుత్‌: 6,780 మెగావాట్ల నుంచి 40 వేల మెగావాట్లకు పెంచాలని లక్ష్యం
కేంద్ర విద్యుత్ శాఖ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ లెక్కల ప్రకారం భారత్‌లో కరెంటులో అణు విద్యుత్ వాటా కేవలం 1.9 శాతమే. 2019 జులై 31 నాటికి దేశంలో బొగ్గు నుంచి 1,95,810 మెగావాట్లు, లిగ్నైట్ నుంచి 6,260, గ్యాస్ నుంచి 24,937, డీజిల్ నుంచి 638, నీటి నుంచి 45,399, తరిగిపోని వనరుల (గాలి, సూర్యుడు మొదలైనవి) నుంచి 80,633 మెగావాట్ల విద్యుత్ వస్తోంది. ఇక 6,780 మెగావాట్ల విద్యుత్ అణు పదార్థాల నుంచి వస్తోంది.
 
2030 నాటికి అణు విద్యుత్‌ ఉత్పత్తిని ఇప్పుడున్న 6,780 మెగావాట్ల నుంచి 40 వేల మెగావాట్లకు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఆ లక్ష్యం చేరుకోవాలంటే చాలా యురేనియం కావాలి. ఇప్పుడు కెనడాతోపాటు పలు దేశాల నుంచి భారత్ యురేనియం దిగుమతి చేసుకుంటోంది. దిగుమతులకు అదనంగా, దేశంలో ఝార్ఖండ్‌ రాష్ట్రం జాదూగూడ, ఆంధ్రప్రదేశ్‌లో కడప జిల్లా తుమ్మలపల్లె వంటి చోట్ల యురేనియం తవ్వకాలు జరుగుతున్నాయి. దేశంలో కొత్తగా పలు ప్రాంతాల్లో ఈ ఖనిజాన్ని తవ్వాలని భారత అణు ఇంధన సంస్థ ప్రయత్నిస్తోంది.
 
నల్లమలలోనే ఎందుకు?
రాయలసీమ ప్రాంతంలో, ప్రకాశం జిల్లాలో, దక్షిణ తెలంగాణల్లో చాలా భాగాలను భూవిజ్ఞాన (జియాలజీ) శాస్త్రవేత్తలు కడప బేసిన్‌గా పిలుస్తారు. బేసిన్ ఉత్తర భాగం, అంటే పాత మహబూబ్ నగర్ జిల్లా ప్రాంతంలో అత్యంత నాణ్యమైన యురేనియం నిల్వలు ఉన్నాయనే విషయం శాస్త్రవేత్తలకు తెలుసు. భారత అణు ఇంధన సంస్థ శాస్త్రవేత్తలు పలు వేదికలపై ఈ విషయానికి సంబంధించి ఎన్నో పత్రాలను ప్రతిపాదించారు. రాయలసీమ, తెలంగాణ, దక్షిణ కోస్తాల్లో ఉన్న యురేనియం నిల్వల గురించీ, వాటి నాణ్యత, ఇతర అంశాల గురించి అధ్యయనాలు జరిగాయి.
 
2018 జూన్‌లో జరిగిన 'ఇంటర్నేషనల్ సింపోజియం ఆన్ యురేనియం రా మెటీరియల్ ఫర్ ద న్యూక్లియర్ ఫ్యూయల్ సైకిల్: ఎక్స్‌ప్లొరేషన్, మైనింగ్, ప్రొడక్షన్, సప్లై అండ్ డిమాండ్, ఎకనామిక్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ (యురామ్)' అనే సదస్సులో భారత అణు ఇంధన శాస్త్రవేత్త ఎంబీ వర్మ ఒక పత్రం సమర్పించారు.
 
'పొటెన్షియల్ ఫర్ అన్‌కన్ఫర్మిటీ - రిలేటెడ్ యురేనియం డిపాజిట్స్ ఇన్ నార్తర్న్ పార్ట్ ఆఫ్ ద కడప బేసిన్, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్, ఇండియా' అనే శీర్షికతో ఉన్న ఈ పత్రంలో ఇక్కడి యురేనియం నిల్వల వివరాలు ఉన్నాయి.
 
"మూడు దశాబ్దాలుగా దేశంలో ఎక్కడ యురేనియం కోసం ప్రయత్నం చేసినా మంచి ఫలితాలు రాలేదు. కానీ కడప బేసిన్‌లోని శ్రీశైలం పీఠభూమి (ప్రస్తుత అమ్రాబాద్ ప్రాంతం)లో ఎంతో నాణ్యమైన యురేనియం వనరులు ఉన్నాయి" అని భారత ప్రభుత్వ అటవీ సలహా కమిటీకి ఇచ్చిన నివేదికలో భారత అణు ఇంధన సంస్థ చెప్పింది. ఆ యురేనియాన్ని ఇప్పుడు తవ్వి తీయాలనేది సంస్థ ఉద్దేశం.
 
రెండు రాష్ట్రాల్లో విస్తరించిన అడవులు
నల్లమల అడవులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో విస్తరించి ఉన్నాయి. ఇవి తూర్పు కనుమల్లో భాగం. కృష్ణా నదిని ఆనుకుని ఉన్న చిక్కటి అడవి, అరుదైన జీవజాతులు, ఎన్నో వాగులు, వంకలు, అంతరించే ముప్పును ఎదుర్కొంటున్న పక్షులు, జంతువులు నల్లమల అడవుల్లో ఉన్నాయి. నల్లమల అడవులు, పరిసర మైదాన ప్రాంతాలు అనేక దేవాలయాలకు ప్రసిద్ధి. శ్రీశైలం మల్లికార్జునస్వామి ఆలయం వాటిలో ప్రముఖమైనది. 
 
నల్లమలలో అత్యంత ప్రత్యేకమైనవి రెండు- చెంచు తెగ, పెద్దపులి. ఈ అడవిలో సుమారు 23 పులులు ఉన్నాయి. భారతదేశంలోని రెండు పెద్ద టైగర్ రిజర్వులైన నాగార్జున సాగర్ రిజర్వు, అమ్రాబాద్ రిజర్వు ఇదే అడవిలో ఉన్నాయి. దేశవ్యాప్తంగా పులులను కాపాడటం ఉద్యమంగా సాగిన తరుణంలో ఈ టైగర్ రిజర్వుకు ఎంతో ప్రాధాన్యం ఉంది.
 
అత్యంత వెనకబడిన తెగల్లో ఒకటి
దేశంలో అత్యంత వెనుకబడిన గిరిజన తెగల్లో చెంచు తెగ ఒకటి. ఉత్తరాంధ్ర, ఉత్తర తెలంగాణ ప్రాంత గిరిజనులతో పోలిస్తే చెంచులు చాలా వెనకబడి ఉన్నారు. ప్రస్తుతం ఎక్కువ మంది వ్యవసాయం - కూలీ పనులు చేస్తున్నా, వేట వృత్తిగా జీవిస్తున్నవారు, అత్యంత దట్టమైన అడవిలో నివాసముంటున్న చెంచులూ ఇంకా ఉన్నారు. వారు అటవీ ఉత్పత్తులను సేకరించడం, జంతువులను వేటాడడంతో ఉపాధి పొందుతున్నారు.
 
చిన్నగా గుండ్రంగా ఉండే గుడిసెలలో ఉంటారు. అడవిని ఆనుకుని ఉండే ఊళ్లలోకి వచ్చిన చెంచులకు, ప్రభుత్వం, కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఇళ్లు కట్టించి ఇచ్చాయి. అడవి లోపలి గ్రామాల్లో ఉండే చెంచులు అనేక సమస్యల మధ్యే జీవనం సాగిస్తున్నారు.
 
అలా చేస్తే అడవులు నాశనమవుతాయి: అటవీశాఖ
అమ్రాబాద్ అటవీ అనుమతుల విషయం ఇప్పుడు గొడవ అవుతోంది కానీ, వాస్తవానికి 2009లోనే అటవీ శాఖకు ఈ విషయం తెలుసు. క్షేత్రస్థాయిలో పర్యటించి, యురేనియం తవ్వకాలు జరిగితే అడవులకు ఏమైనా నష్టమా అనేది తెలుసుకుని రావాలని శ్రీశైలం ప్రాజెక్ట్ టైగర్ సర్కిల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ 2009 మార్చిలో అచ్చంపేట, నాగార్జున సాగర్ డీఎఫ్‌వోలకు ఒక లేఖ రాశారు.
 
ఆ పరిశీలన జరిపిన అటవీ అధికారులు, యురేనియం వెలికితీత ప్రతిపాదనలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అటవీ అనుమతులు ఇవ్వకూడదని వారు ఉన్నతాధికారులకు ఇచ్చిన నివేదికల్లో పేర్కొన్నారు. యురేనియం సర్వే కోసం బోర్లు వేయడం వల్ల వచ్చే ప్రమాదాలను వారు ఏకరువు పెట్టారు.
 
2016 నాటి నివేదికలో ఏముందంటే..
"భూమి కోత, భూమిలో పెద్ద పెద్ద గుంతలు పడడం, జీవ వైవిధ్యానికి నష్టం, భూమీ నీరూ కలుషితం కావడం వంటి సమస్యలు వస్తాయి. రసాయనాల లీకేజీ ప్రమాదాలుంటాయి. వాగులూ వంకలూ నదులూ కలుషితమైపోతాయి. సుమారు నాలుగు వేల బోర్లు వేయాలన్నారు. వాటి వల్ల చెట్లకు హాని ఉండదన్నారు. కానీ మెషీన్లు అడవిలోకి వెళ్లడానికి రోడ్లు లేవు. కాబట్టి కచ్చితంగా పచ్చదనం దెబ్బతింటుంది. ప్రమాదం చాలా తీవ్రంగా ఉంటుంది. అమ్రాబాద్ బ్లాక్ 1, బ్లాక్ 2 లలో అనుమతులివ్వవద్దు. ఇక 3, 4 బ్లాకుల్లో (సాగర్ టైగర్ రిజర్వు) ఒక పులి తిరిగేది. ఇప్పుడు అది లేదు. దాన్ని వెనక్కు తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నాం. ఈ పరిస్థితుల్లో బోర్లు వేస్తే ఆ ప్రక్రియకు ఇబ్బంది అవుతుంది" అంటూ 2016లో ఇచ్చిన నివేదికలో అప్పటి అమ్రాబాద్ టైగర్ రిజర్వు ఫీల్డ్ డైరెక్టర్ రాశారు.
 
"వాళ్లు ఎక్కడ బోర్లు వేస్తామనేది కచ్చితమైన సమాచారం ఇవ్వలేదు. బోర్లు వేసే చోటుకు ఎలా వెళ్తారో చెప్పలేదు. చాలా చోట్లకు సరైన దారులు లేవు. ఆ మెషీన్లు అడవిలోకి వెళితే, అడవి ధ్వంసమైపోతుంది" అని ఆయా అధికారులు తమ నివేదికల్లో రాశారు.
 
అత్యధిక జీవవైవిధ్యమున్న, దేశంలోనే పెద్ద టైగర్ రిజర్వుల్లో ఒకటైన ఈ అడవిని డిస్టర్బ్ చేయడం మంచిది కాదని, అసలు ఇక్కడ ఎలాంటి మైనింగూ చేయవద్దంటూ తెలంగాణ ప్రభుత్వానికీ, భారత అటవీశాఖకూ మధ్య ఒప్పందం కూడా ఉందనీ వారు గుర్తు చేశారు. తెలంగాణలో అటవీ ప్రాంతం తక్కువగా ఉంది. భూభాగంలో మూడో వంతు అంటే 33.3 శాతం అడవులు ఉండాలనేది భారత విధానం కాగా, తెలంగాణ రాష్ట్రంలో అడవుల వాటా కేవలం 24.35 శాతంగానే ఉంది.
 
దశాబ్దాల వేట
నల్లమలలో యురేనియం చర్చ ఇదే తొలిసారి కాదు. దశాబ్దాలుగా ఇక్కడి యురేనియంపై భారత ప్రభుత్వ సంస్థలైన అణు ఇంధన సంస్థ (డైరెక్టరేట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ), యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లకు ఆసక్తి ఉంది. ఆ సంస్థలు ఎన్నో సార్లు ఇక్కడ స్థానికులకు సమాచారం లేకుండా తన పరిశోధనలు కొనసాగించాయన్న ఆరోపణలూ ఉన్నాయి.
 
2012 సంవత్సరంలో ఇక్కడ ఒక ప్రముఖ ప్రైవేటు కంపెనీ భారీగా బోర్లు వేసిందని స్థానికులు చెబుతున్నారు (ఈ విషయాన్ని బీబీసీ ధృవీకరించడంలేదు). అమ్రాబాద్ ప్రాంతంలో రహస్యంగా పొలాల్లో బోర్లు వేసిన స్థలాలను స్థానిక రైతులు బీబీసీ బృందానికి చూపించారు. 2012లో భూమి యజమానులకు సమాచారం ఇవ్వకుండా ఈ బోర్లు వేసినట్టు వారు చెప్పారు. బోరు వేసేటప్పుడు ప్రతి 15 అడుగులకూ ఒకసారి మట్టి నమూనాలను తీసుకుని వెళ్లారని తెలిపారు. అప్పట్లో దీనిపై అనుమానం వచ్చిన స్థానికులు, బోర్లు వేసే వాహనాన్ని ధ్వంసం చేశారు. నాడు 430 బోర్లు వేశారని స్థానికులు చెప్పారు. బోర్ల ఆనవాళ్లు ఉన్నాయి.
 
"బోరు వేసింది ఎవరో తెలియదు. 2012 వేసవిలో వేశారు. బోర్లు వేస్తున్నారని తెలిసి ఊళ్లోంచి వచ్చాం. మాకేం చెప్పలేదు. నీళ్లు పడితే డబ్బులు ఇవ్వండి. లేకపోతే వద్దు అన్నారు. మా పొలంలో నీళ్లు పడ్డాయి. కొంత కాలం మోటార్ నడిపాం. బోరు వేసినప్పుడు వాళ్లు ప్రతి 15 అడుగులకూ మట్టి తీసి పక్కన పెట్టుకున్నారు. అలా సుమారు 20 ప్యాకెట్ల మట్టి పట్టుకెళ్లారు. మేం అడిగితే, మాకు లోపల మట్టి కావాలి. మట్టి చూస్తున్నాం అన్నారు" అని అమ్రాబాద్ మండలానికి చెందిన రేనయ్య అనే రైతు వివరించారు.
 
"వేరే వాళ్లు వచ్చి బోర్లు వేశారు. అధికారులను అడిగితే ఎవరూ చెప్పలేదు. నీళ్లు పడితే మీరే వాడుకోండి. కేసింగ్ (పైపులు)కు మాత్రం డబ్బులు ఇవ్వండి అన్నారు. ఫారెస్ట్ వాళ్లేమో అనుకున్నాం. వాళ్లూ కాదు. అప్పుడు పత్రికల్లో వార్తల వల్ల యురేనియం అనే అనుమానం వచ్చింది" అని అమ్రాబాద్ మండలానికి చెందిన లింగమయ్య అనే భూయజమాని చెప్పారు. యురేనియం కార్పొరేషన్ ఎప్పుడు ఈ ప్రాంతంలో సర్వే జరిపిందన్న విషయంలో ప్రభుత్వం వెలుపల ఉన్న వారివద్ద స్పష్టమైన సమాచారం లేదు. ప్రభుత్వంలో ఉన్నవారు పెదవి విప్పడం లేదు.
 
దేశంలో 13 కొత్త గనులు: యురేనియం కార్పొరేషన్
దేశంలో యురేనియం ఉత్పత్తిని నాలుగు రెట్లు పెంచుతున్నట్టు యురేనియం కార్పొరేషన్ చెబుతోంది. ఈ ఏడాది జూన్ నెలలో యురేనియం కార్పొరేషన్ ఎండీ సీకే అస్నానీ మీడియా ముందు అనేక విషయాలు చెప్పారు. దేశవ్యాప్తంగా మొత్తం 13 కొత్త గనులు ఏర్పాటు చేస్తామనీ, ఉన్న వాటిని విస్తరిస్తామనీ ఆయన చెప్పారు. తెలంగాణతోపాటూ, రాజస్థాన్‌లోని రోహిల్, కర్నాటకలోని గోగి, ఛత్తీస్‌గఢ్‌లోని జజ్జన్ పూర్ ప్రాంతాల్లో ఈ గనులు రానున్నాయి.
 
ఒకవైపు అమ్రాబాద్ వద్ద జనం ఆందోళన కొనసాగిస్తుండగా, మరోవైపు నల్లగొండలో యురేనియం తవ్వకాలకు ఆ సంస్థ ప్రయత్నాలు చేస్తోంది. 1995లోనే యురేనియం కార్పొరేషన్ పెద్దగుట్టలో సర్వే జరిపింది. ఇక్కడ 18 వేల టన్నుల ఖనిజం ఉన్నట్టు భావించింది. 2003 ఆగస్టు 8న దీనిపై నల్లగొండ కలెక్టర్ ప్రజాభిప్రాయ సేకరణ చేశారు. 2005, 2008లో కూడా నల్లగొండలో స్థానికులను యురేనియం తవ్వకాలకు ఒప్పించేందుకు ప్రయత్నాలు జరిగాయి.
 
గతంలో 2001లో నల్లగొండ జిల్లా చిత్రియాల్, పెద్దగట్టు బ్లాకుల్లో 20 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో సర్వే చేశారు. 2009లో మళ్లీ చిత్రియాల్‌లో 50 చ.కి.మీ. మేర సర్వే చేశారు. అప్పటి సర్వేల ఫలితాలతో ఇప్పుడు మైనింగ్ చేయబోతున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని లాంబాపూర్ - పెద్దగట్టు ప్రాంతంలో ఒక ఓపెన్ పిట్, మూడు అండర్ గ్రౌండు మైన్లను, వాటికి 48 కి.మీ. దూరంలో యాసిడ్ లీచింగ్ పద్ధతిలో యురేనియం ప్రాసెస్ చేసే ప్లాంటు ఏర్పాటు చేయబోతున్నట్లు యురేనియం కార్పొరేషన్ తన వెబ్ సైట్లో ప్రకటించింది.
 
చిత్రియాల్‌లో సర్వే పూర్తయ్యాక మైనింగ్ అనుమతులు వచ్చినట్టే అమ్రాబాద్‌లోనూ జరుగుతుందేమోనన్న భయం స్థానికుల్లో ఉంది. 2016 నాటి తెలంగాణ అటవీ అధికారుల నివేదికతో నిమిత్తం లేకుండా 2019లో భారత అటవీ సలహా మండలి (ఫారెస్ట్ అడ్వైజరీ కమిటీ) నల్లమలలో యురేనియం సర్వేకు అనుమతులు ఇవ్వడం స్థానికుల భయాన్ని పెంచింది.
 
ఫారెస్ట్ అడ్వైజరీ కమిటీ 2019 మే 22 నాటి సమావేశంలో ఈ అంశంపై చర్చించింది. మొత్తం 83 చదరపు కి.మీ. విస్తీర్ణంలో (నాగార్జునసాగర్ వైల్డ్ లైఫ్ మేనేజ్‌మెంట్ డివిజన్లో 7 చ.కి.మీ., అమ్రాబాద్ టైగర్ రిజర్వులో 76 చ.కి.మీ.) యురేనియం సర్వే, ఎక్స్‌ప్లొరేషన్ కోసం దక్షిణ భారత ప్రాంతీయ అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ అనుమతి కోరింది.
 
జాతీయ ప్రాధాన్యం దృష్ట్యా సూత్రప్రాయ అనుమతి ఇచ్చింది ఫారెస్ట్ అడ్వైజరీ కమిటీ. పూర్తి వివరాలూ పత్రాలూ ఇచ్చాక తుది అనుమతులపై నిర్ణయం ఉంటుందని తెలిపింది. నిర్దేశిత ఫార్మాట్లో (ఫామ్ సీ) సమాచారం ఇవ్వాలంటూ కేంద్ర అటవీ శాఖ డీఐజీ నరేశ్ కుమార్ జూన్ 19న తెలంగాణ అటవీ శాఖ ముఖ్య కార్యదర్శికి లేఖ రాశారు.
 
అణు ఇంధన సంస్థ అటవీ శాఖకు సమర్పించిన నివేదికలో కొన్ని వివరాలున్నాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పరిధిలోని అమ్రాబాద్, ఉడిమల్లలో, ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని నారాయణపూర్‌లో బోర్లు వేసి యురేనియం వెలికితీతపై పరిశోధనలకు అనుమతి కోరారు. మొత్తం 37 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని తెలిపారు. అమ్రాబాద్‌లో 38 చ.కి.మీ., ఉడిమిల్ల 38 చ.కి.మీ., నారాయాణపూర్ 3 చ.కి.మీ., నారాయణపూర్ బ్లాక్ 2 లో 4 చ.కి.మీ. స్థలంలో చేస్తామన్నారు.
 
ఈ ప్రక్రియకు అసలు పునరావాసం సమస్య ఉత్పన్నం కాదనీ, తాము తవ్వకాలు జరపాలనుకుంటున్న ప్రాంతంలో గిరిజనులుగానీ, ఇతర కుటుంబాలుగానీ లేవని నివేదికలో రాశారు. అడవులకు కూడా ఎలాంటి నష్టం రాదని అణు ఇంధన సంస్థ దక్షిణ ప్రాంతీయ డైరెక్టర్ ఎంబీ వర్మ తన నివేదికలో రాశారు.
 
అనుమతులు అక్కర్లేదు
యురేనియం అణు ఇంధనానికి సంబంధించినది కావడంతో జాతీయ ప్రాధాన్యం, జాతీయ భద్రత అనే అంశాలు తెరపైకి వస్తాయి. 1957 నాటి గనులు, ఖనిజాల అభివృద్ధి, నియంత్రణ చట్టం సెక్షన్ 4 (1), 2015 లో చేసిన సవరణ ప్రకారం అణు ఇంధన సంస్థకు చాలా చోట్ల పర్మిట్లు, ప్రాస్పెక్టింగ్ లైసెన్సులు అక్కర్లేదు. ప్రధానమంత్రి ఆధ్వర్యంలోని అణు ఇంధన సంస్థ ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌లోనే ఉంటుంది.
 
దేశంలో అణు ఇంధనాన్ని (అణు ధార్మికత ఉన్న పదార్థాలను) వెలికితీయడం ఈ సంస్థ పని. దేశంలో యురేనియం వంటి ఖనిజాలను తవ్వే హక్కు ఈ సంస్థకే ఉంది. యురేనియం నిల్వలను ఈ సంస్థ గుర్తిస్తే, తరువాత తవ్వకాలు, ప్రాసెసింగ్ పనులను 'యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్' అనే మరో ప్రభుత్వ రంగ సంస్థ చేస్తుంది.
 
అసలింతకూ అమ్రాబాద్‌లో ఏం జరగబోతోంది?
ప్రస్తుతం, ఇప్పటికిప్పుడు, అమ్రాబాద్‌లో యురేనియం తవ్వడానికి అనుమతులు రాలేదు. కానీ యురేనియం ఎంత ఉంది, ఎక్కడ ఉంది, ఎలా ఉంది, ఎంత లోతులో ఉంది, తవ్వితే లాభమా కాదా లాంటి వివరాలు తెలుసుకొనేందుకు చేయాల్సిన సర్వే, పరిశోధనా పనులకు మాత్రమే అనుమతి వచ్చింది.
 
యురేనియం సంస్థ రహస్య పద్ధతులకూ, ఆ సంస్థకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న మద్దతూ, ప్రాథమిక అనుమతులు వచ్చిన తీరును బట్టి, సర్వేకు అనుమతిస్తే, వాస్తవ మైనింగుకు అనుమతివ్వడం పెద్ద సమస్య కాబోదని స్థానిక ఆందోళనకారులు భావిస్తున్నారు.
 
తాజా ప్రతిపాదనల ప్రకారం, అమ్రాబాద్ ప్రాంతంలో దాదాపు 4 వేల బోర్లు వేసి భూమి నుంచి శాంపిళ్లు తీసుకుంటారు. "ఒక్కో బోరూ 4 నుంచి 6 అంగుళాల వ్యాసం ఉంటుంది. ఒక్కో బోరుకీ గరిష్టంగా పది మీటర్ల స్థలం కావాలి. దానివల్ల జీవ జాతులకూ, భూమికీ ఏ సమస్యా ఉండదు. ఈ స్థలాలు ఐదేళ్ల పాటు కావాలి. ఒక్కో బోర్ వేయడానికీ 2 నుంచి 30 రోజులు పడుతుంది. ఈ మొత్తం ప్రాజెక్టు విలువ రూ.45 కోట్లు" అని అటవీ అనుమతుల కోసం పంపిన నివేదికలో రాసింది అణు ఇంధన సంస్థ.
 
బోర్లు వేయడాన్ని అటవీ అధికారులు వ్యతిరేకిస్తున్నారు. యురేనియం సర్వే విషయంలో స్థానికుల్లో ఆందోళన, ఆగ్రహం, అయోమయం అన్నీ కలగలిసి ఉన్నాయి. ఏం జరుగుతోందో వారికి తెలియడం లేదు. ఎవరు ఏం చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో, భవిష్యత్తు ఏంటి అనే సమాచారం వారి దగ్గర లేదు. కానీ తమ ఊరినీ, అడవినీ కాపాడుకుంటామనే మాట మాత్రం అందరూ చెబుతున్నారు.
 
"యురేనియం తవ్వితే కృష్ణా నది కలుషితమై, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఆ నదిపై ఆధారపడ్డ ప్రాంతమంతా ఇబ్బంది పడుతుంది. పునరావాసాలు ఎక్కడా సరిగా జరగలేదు. 70 వేల మందిని ఎక్కడకు తీసుకువెళ్తారు? ఆదిమ జాతి చెంచులను అడవికి దూరం చేస్తే చనిపోతారు. పెద్దపులులను ఎక్కడ పెంచుతారు? వన్య మృగాలను ఏం చేస్తారు? పర్యావరణాన్ని ఎక్కడ నుంచి తెస్తారు? ఇక్కడ యురేనియం తీస్తారు. అయిపోతుంది. మరొక చోట తీస్తారు. అయిపోతుంది. ఇలా దేశమంతా కాలుష్యం చేయడం ఎందుకు? దాని బదులు గాలి, సూర్యుడి నుంచి వచ్చే కరెంటు వాడుకోవచ్చు కదా" అంటూ ప్రశ్నించారు యురేనియం మైనింగ్ వ్యతిరేక ఆందోళనలకు నాయకత్వం వహిస్తున్న కె.నాజరయ్య.
 
అణు విద్యుత్ భారత్‌కు సరిపోదు: పర్యావరణవేత్త బాబూరావు
యురేనియం తవ్వకం భారతదేశ విద్యుత్ అవసరాలకు ఏమాత్రం ఉపయోగపడదని చెబుతున్నారు తవ్వకాలను వ్యతిరేకించే పర్యావరణవేత్తలు. భారత విద్యుత్ అవసరాలకు అణు విద్యుత్ ఏమాత్రం సరిపోదనీ, ప్రమాదకరమనీ, ఖర్చు ఎక్కువనీ చెప్పారు పర్యావరణవేత్త బాబూరావు.
 
"60 ఏళ్లుగా భారతదేశంలో వచ్చిన అణువిద్యుత్ కేవలం 6,780 మెగావాట్లే. ఇంకా కొంత నిర్మాణంలో ఉంది. మొత్తం స్థాపిత విద్యుత్ సామర్థ్యంలో అది 1.9 శాతమే. ఇంత తక్కువ ఉన్న అణు విద్యుత్‌ను భారత్ భవిష్యత్ అవసరాలను తీర్చేలా విస్తృత పరుస్తున్నామనడం సరికాదు. ఎంత తవ్వి తీసినా, ఎంత తక్కువ నాణ్యత ఉన్న ఖనిజం ప్రాసెస్ చేసినా, వచ్చే యురేనియం చాలా తక్కువే. పైగా ఇదీ బొగ్గులాంటిదే, ఒకసారి వాడితే పనికిరాదు" అని ఆయన అభిప్రాయపడ్డారు.
 
"అంతేకాదు, యురేనియం తవ్వడం, విద్యుత్ తయారీకి వాడడం, ఆ వ్యర్థాలను నిల్వ చేయడం - ఇలా ప్రతి దశలోనూ అది సమస్యే. దాన్ని ఎలా కాపాడాలి? ఎక్కడ దాచి పెట్టాలి? ప్రమాదరహితంగా ఎలా చేయాలనేదానిపై ఇప్పటివరకు స్పష్టమైన పరిజ్ఞానం లేదు. పైగా ఎక్కడ తవ్వినా ప్రతి చోటా విషాదమే. అదెవరికీ ఉపయోగపడలేదు. వెలుగు నింపలేదు. తవ్వినచోట జనం బాగుపడ్డారన్న ఉదాహరణ లేదు. ఆరోగ్యం, పర్యావరణం దెబ్బతిన్నాయి. కరెంటు కోసమని ప్రథమ శ్రేణి అడవులను నాశనం చేయడంలో విజ్ఞత లేదు. ఆ డబ్బును పవన, సౌర విద్యుత్ కోసం వాడవచ్చు. పైగా అణు విద్యుత్ కేంద్రాలకు భారీగా నీళ్లు కావాలి. అదో సమస్య. కొత్తగా యురేనియం తవ్వాల్సిన అవసరం లేదు. దానితో ప్రజల అవసరాలు తీరవు. మన కళ్ల ముందే ఉదాహరణ ఉంది. కడపలో అక్కడి స్థానికుల సమస్యలను యురేనియం కార్పొరేషన్ పట్టించుకోవడం లేదు" అని బాబూరావు చెప్పారు.
 
"మీకు పునరావాసం కల్పించి, యురేనియం తవ్వితే సమ్మతమేనా" అనే ప్రశ్నకు స్థానికులు ఆసక్తికర సమాధానం ఇచ్చారు. "పునరావాసానికి కూడా ఒప్పుకోం. మొత్తం మండలం అంతా మాట్లాడి చెప్పాలి. ఒప్పుకుంటే రూపాయల కట్ట ఇస్తారు. హైదరాబాద్ వెళ్తా. ఆ డబ్బులు మూడ్రోజులుంటాయి. తెల్లారి అవి ఎట్లా పోతాయో, మా బతుకులు ఎట్లా పోతాయో తెలీదు. అందుకే ఇదే భూమి, ఇదే ఆస్తి ఉండాలి మాకు" అన్నారు ఐతయ్య.
 
గ్రామాల్లో ఉద్రిక్తతలు
రోజురోజుకూ నల్లమల పరిసర గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సెప్టెంబరు 13 నాటికి ముందు వారం రోజుల్లో స్థానిక ఆందోళనకారులు పలు వాహనాలను అడ్డుకుని, వారు యురేనియం సర్వే కోసం వచ్చిన అధికారులేమోనని ఆరా తీసి, అనుమానం తీరిన తరువాతే వదిలిపెట్టారు.
 
సెప్టెంబరు 12న అటవీ శాఖ కార్యాలయంలో కొందరు అధికారులు సమావేశమైతే ఆందోళనకారులు వారిని అడ్డగించి వెనక్కు పంపారు. గ్రామాల్లోకి కొత్తగా ఎవరు వచ్చి అడవుల్లోకి వెళ్లడానికి ప్రయత్నించినా అడ్డుకోవాలని వారు పిలుపునిచ్చారు. ఆంధప్రదేశ్ విడిపోక ముందు, 2012లో తెలంగాణ రాష్ట్ర సమితి నాయకురాలు కల్వకుంట్ల కవిత ఈ తవ్వకాల ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ నల్లమల ప్రాంతంలో పర్యటించారు. ఇప్పుడు పాలక టీఆర్‌ఎస్ ఈ విషయంపై ఏమీ మాట్లాడడం లేదు.
 
యురేనియం అంశంపై 2017 జులై 17న రాజ్యసభలో కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరి అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర మంత్రి హర్షవర్ధన్ సమాధానం ఇస్తూ- 'నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ సర్వే కోసం అనుమతులు మంజూరు చేసినట్లు తెలిపారు. తాము మైనింగ్‌కు అనుమతులు ఇవ్వలేదు, కాబట్టి పునరావాసం సమస్య ఉత్పన్నం కాదు' అని చెప్పారు.
 
నల్లమలలో యురేనియం సర్వేను వ్యతిరేకిస్తున్న ప్రముఖులు, సామాన్యులు భిన్న రూపాల్లో తమ నిరసన వ్యక్తంచేస్తున్నారు. గోరటి వెంకన్న స్పందిస్తూ- "శివా నిన్ను నువ్వే కాపాడుకో" అనే పాట పాడారు. సోషల్ మీడియాలో సేవ్ నల్లమల (#savenallamala) పేరుతో యూజర్లు పోస్టులు పెడుతున్నారు.
 
అందరిదీ ఒకేమాట: "మాకేం తెలియదు"
సర్వేపై అమ్రాబాద్ తహశీల్దార్‌ను బీబీసీ సంప్రదించగా- తమ వద్ద ఎలాంటి సమాచారమూ లేదన్నారు. తెలంగాణ అటవీశాఖ అధికారులను సంప్రదించేందుకు బీబీసీ ప్రయత్నించింది. వారి నుంచి స్పందన రావాల్సి ఉంది. ఈ విషయమై భారత అణు ఇంధన సంస్థను బీబీసీ పలుసార్లు సంప్రదించేందుకు ప్రయత్నించగా వారి నుంచి ఎలాంటి సమాధానమూ రాలేదు.