బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: గురువారం, 26 డిశెంబరు 2019 (16:42 IST)

2020 విశేషాలు ఏమిటి? ప్రపంచంలో ఏమేం జరగబోతున్నాయి?

జనవరి 1న కొత్త సంవత్సరం, కొత్త దశాబ్దం మొదలుకానున్నాయి. భవిష్యత్తుపై అంచనాలు చాలా వస్తున్నాయి. మరి వీటిలో వార్తల్లో ప్రముఖంగా నిలిచేవి ఏవి? అలాంటి వ్యక్తులు, సంఘటనలపై బీబీసీ కథనం ఇది.

 
అమెరికా అధ్యక్ష ఎన్నికలు
అమెరికా 2020 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ గురించి ఇప్పుడే మాట్లాడుకోలేం. రిపబ్లికన్ పార్టీకి చెందిన ప్రస్తుత అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ దిగువసభ అయిన ప్రతినిధుల సభలో అభిశంసనకు గురయ్యారు. ఎగువ సభ సెనేట్‌లో విచారణ ప్రక్రియ ఇంకా జరగలేదు. అటు డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష ఎన్నికల అభ్యర్థి ఎవరనేది ఇంకా తేలలేదు. అమెరికాలో నవంబరు 3న జరిగే ఎన్నికల్లో సెనేట్ పోరుకు చాలా ప్రాధాన్యం ఉంది.

 
శాసన అజెండా, బడ్జెట్, న్యాయ నియామకాల ఖరారు లాంటి కీలకమైన అంశాల్లో తుది నిర్ణయాధికారం సెనేట్‌కే ఉంటుంది. అందువల్ల సెనేట్‌లో ఆధిక్యం ఉంటే అధ్యక్షుల పని కొంత సులువవుతుంది. లేదంటే కష్టమవుతుంది. సెనేట్‌లో వంద సీట్లకుగాను ట్రంప్ ప్రాతినిధ్యం వహిస్తున్న రిపబ్లికన్ పార్టీకి ప్రస్తుతం 53 సీట్లు ఉన్నాయి. అయితే డెమోక్రటిక్ పార్టీ 12 సీట్లను నిలబెట్టుకోవాల్సి ఉండగా, రిపబ్లికన్ పార్టీ 23 సీట్లను కాపాడుకోవాల్సి ఉంది. ఇప్పటికే ప్రతినిధుల సభలో డెమోక్రాట్లు ఆధిపత్యం కలిగి ఉన్నారు.

 
2020 ఎన్నికల్లో అధ్యక్షుడు ట్రంప్ మళ్లీ విజయం సాధించినా, సెనేట్‌లో ఆధిపత్యం చేతులు మారి డెమోక్రాట్లు బలపడితే ఆయనకు కష్టాలు పెరగడం ఖాయం.

 
మరో అరబ్ స్ప్రింగ్?
2019 ద్వితీయార్ధంలో ఇరాక్, ఈజిప్ట్, లెబనాన్ దేశాలు ప్రజాందోళనలతో అట్టుడుకుతున్నాయి. ప్రథమార్ధంలో అల్జీరియా, సూడాన్‌లో పెద్దయెత్తున ఆందోళనలు జరిగాయి. ఈ పరిస్థితులపై విశ్లేషకులు స్పందిస్తూ- మరో 'అరబ్ స్ప్రింగ్' అవకాశాల గురించి ప్రస్తావిస్తున్నారు. 2011, ఆ తర్వాత అరబ్ దేశాల్లో వరుసగా జరిగిన ప్రజా తిరుగుబాట్లను దృష్టిలో ఉంచుకొని వారు ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు.

 
2019లో ప్రజా ఉద్యమాలను చూసిన అరబ్ దేశాల్లో నాలుగు దేశాలు అల్జీరియా, సూడాన్, ఇరాక్, లెబనాన్ 2011 అరబ్ స్ప్రింగ్‌లో లేవని మేధోసంస్థ 'కార్నెగీ మిడిల్ ఈస్ట్ సెంటర్'లో పరిశోధకురాలైన డాలియా ఘనెమ్ చెప్పారు. ప్రజల అసంతృప్తి వ్యక్తీకరణకు ఇది మరో సీజన్ అని వ్యాఖ్యానించారు.

 
ఈ నిరసనలు 2020లోనూ ఇదే స్థాయిలో కొనసాగుతాయా, పెరుగుతాయా?
ప్రజా ఆందోళనలు మరిన్ని దేశాలకు విస్తరించే అవకాశముందని పారిస్‌లోని పీఎస్‌ఎల్ విశ్వవిద్యాలయంలో అరబ్ ప్రపంచ వ్యవహారాల నిపుణుడు, ప్రొఫెసర్ ఇషాక్ దివాన్ చెప్పారు. 2011కూ, నేటికీ ప్రపంచ ఆర్థిక పరిస్థితుల మధ్య వ్యత్యాసం ఉందని ఆయన ప్రస్తావించారు. వృద్ధి రేటు మందగించిందని, దేశాల రుణభారం పెరిగిపోతోందని, నిరుద్యోగం చాలా ఎక్కువగా ఉందని తెలిపారు. గౌరవప్రదమైన జీవనం కోసం తపన 2011 నాటి ప్రజా ఉద్యమాలను నడిపిస్తే, నేటి ఆందోళనలకు ఆకలి ప్రధాన కారణమైందని వ్యాఖ్యానించారు.

 
అక్కడ ఎవరైనా ఉన్నారా?
మన సౌర వ్యవస్థ వెలుపల గ్రహాల ఉనికి కొత్త విషయమేమీ కాదు. 1990ల నుంచి ఇప్పటివరకు ఇలాంటి వాటిని నాలుగు వేలకు పైగా గుర్తించారు. ఈ నెల 18న ప్రయోగించిన చియోప్స్ అంతరిక్ష టెలిస్కోప్ ఈ గ్రహాలపై అధ్యయనంలో కొత్త అంకానికి తెర లేపింది. యూరోపియన్ అంతరిక్ష సంస్థకు చెందిన ఈ వ్యోమనౌక రానున్న మూడేళ్లలో ఇలాంటి 400-500 గ్రహాలపై మరింత లోతైన పరిశోధనలు సాగిస్తుంది.

 
ఆయా గ్రహాల లక్షణాలపై ఇది పరిశీలనలు చేస్తుంది. జీవుల ఉనికి ఉండే అవకాశాలున్న గ్రహాలను గుర్తించేందుకు చేపట్టే తదుపరి దశ పరిశోధనల్లో ఇవి ఉపయోగపడతాయి. ఇలాంటి పరిశోధనల్లో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా)కు చెందిన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్(జేడబ్ల్యూఎస్‌టీ)తో జరిపే పరిశోధన ఒకటి. దీనిని 2021లో ప్రయోగించనున్నారు.

 
తైవాన్‌ అధ్యక్ష ఎన్నికపై చైనా దృష్టి
ఈ ఏడాది హాంకాంగ్‌లో నెలలపాటు పెద్దయెత్తున ఆందోళనలను చూసిన చైనా నాయకులకు, కొత్త సంవత్సరం ప్రారంభంలోనే మరో సవాలు ఎదురయ్యే ఆస్కారముంది. తైవాన్ ద్వీపాన్ని ఒక 'రోగ్' రాష్ట్రంగా చైనా పరిగణిస్తుంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత కమ్యూనిస్టు ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి, ప్రాక్టికల్‌గా చూస్తే చైనా నుంచి తైవాన్ స్వతంత్రంగానే ఉంటూ వస్తోంది.

 
తైవాన్‌లో జనవరి 11న అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. ప్రస్తుత అధ్యక్షురాలు త్సాయ్ ఇంగ్‌-వెన్ తిరిగి ఎన్నికవుతారని సర్వేలు సూచిస్తున్నాయి. ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ బలమైన జాతీయవాద, స్వాతంత్ర్య అనుకూల వైఖరితో ఉంది. హాంకాంగ్‌లో ప్రజాస్వామ్య అనుకూల నిరసనకారులను అణచివేసే యత్నాలు ఈ వైఖరి బలపడటానికి దోహదం చేశాయి. చైనా అనుకూల నాయకుడిగా భావించే అధ్యక్ష అభ్యర్థి, త్సాయ్ ప్రధాన ప్రత్యర్థి అయిన హన్ కువోయు కన్నా త్సాయ్ 38 పాయింట్లు ముందంజంలో ఉన్నారని ఈ నెల 17న వెలువడిన ఓ సర్వే తెలిపింది.

 
ఆఫ్రికా వాణిజ్య ఒప్పందం
2019 మే 30న 'ఆఫ్రికా ఖండ స్వేచ్ఛా వాణిజ్య ప్రాంతం(ఏఎఫ్‌సీఎఫ్‌టీఏ)' ఉనికిలోకి వచ్చింది. దేశాల సంఖ్య పరంగా చూస్తే ప్రపంచంలోనే అతిపెద్ద స్వేచ్ఛా వాణిజ్య ప్రాంతం ఇది. దీని పరిధిలో 54 దేశాలు ఉన్నాయి. ఈ వాణిజ్య ఒప్పందం రాజకీయ, ఆర్థిక, దౌత్యపరమైన మైలురాయి అని, ఇది ఆఫ్రికా ఖండంలో ఆర్థికాభివృద్ధికి ఊతమిస్తుందని చెబుతున్నారు. ఈ ఒప్పందం ఫలితంగా ఆఫ్రికా ఖండమంతా ఆర్థిక సంక్షేమం రెండు నుంచి నాలుగు శాతం మేర పెరగొచ్చని అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్) ఒక నివేదికలో అంచనా వేసింది.

 
ఈ ఒప్పందం కింద స్వేచ్ఛా వాణిజ్యం 2020 జులైలో మొదలు కానుంది. ఆఫ్రికా దేశాల మధ్య వాణిజ్యాన్ని ఇది పెంచుతుందని భావిస్తున్నారు. 2018 గణాంకాల ప్రకారం ఆఫ్రికా వాణిజ్యంలో ఆఫ్రికాలోని దేశాల మధ్య జరిగిన ఎగుమతుల వాటా 20 శాతం లోపే ఉంది. ఈ విషయంలో ఆసియా, ఐరోపాలతో పోలిస్తే ఆఫ్రికా చాలా వెనకబడి ఉంది. ఆసియాలో ఈ వాటా 59 శాతంగా, ఐరోపాలో 69 శాతంగా ఉంది.

 
మరిన్ని దేశాల్లో మలేరియా నిర్మూలన?
ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం 2018లో ప్రపంచవ్యాప్తంగా మొత్తం 22.8 కోట్ల మలేరియా కేసులు నమోదు కాగా, దీనివల్ల 4.05 లక్షల మందికి పైగా చనిపోయారు. ప్రపంచవ్యాప్తంగా మలేరియా కేసులు తగ్గడం ఒక శుభవార్త. 2020లో మరో తొమ్మిది దేశాలు ఈ వ్యాధిని సమూలంగా నిర్మూలించే అవకాశాలుండటం మరో శుభవార్త. వీటిలో చైనా, ఇరాన్, భూటాన్, తూర్పు తిమోర్, మలేషియా, బెలీజ్, ఎల్‌సాల్వడార్, సురినామ్, కాబో వెర్డే దేశాలు ఉన్నాయి.

 
చైనాలో ఏటా దాదాపు మూడు కోట్ల మలేరియా కేసులు నమోదవుతుండగా, మూడు లక్షల మంది చనిపోతున్నారు. 91 'రిస్క్ జోన్ల'లో 38 దేశాలు ఇప్పటికే మలేరియాను నిర్మూలించాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.

 
హాలీవుడ్: సూపర్‌వుమన్
మహిళలు సూపర్‌హీరోలుగా కనిపించే పలు హాలీవుడ్ చిత్రాలు 2020లో విడుదల కానున్నాయి. స్కార్లెట్ జాన్సన్ ప్రధాన పాత్ర పోషించిన 'బ్లాక్ విడో'తోపాటు, గాల్ గాడట్ నటించిన 'వండర్‌ వుమన్ 1984' లాంటి చిత్రాలు ఈ జాబితాలో ఉన్నాయి.

 
డేనియల్ క్రెగ్
'జేమ్స్ బాండ్' పరంపరలో అధికారికంగా 25వ సినిమా అయిన 'నో టైమ్ టు డై' 2020లోనే రానుంది. బ్రిటన్ నటుడు డేనియల్ క్రెగ్ జేమ్స్ బాండ్ పాత్రలో కనిపించే చివరి సినిమా ఇదే.

 
విమానం వద్దు.. రైల్లో వెళ్లండి!
పర్యావరణ పరిరక్షణ కోసం విమాన ప్రయాణాలను తగ్గించాలని, రైల్లో వెళ్లాలని వాతావరణ మార్పులపై పోరాడుతున్న స్వీడన్ టీనేజర్ గ్రెటా థన్‌బర్గ్ పిలుపునిచ్చిన తర్వాత ఈ విధానం మరోసారి ప్రాధాన్యం సంతరించుకొంది. కర్బన ఉద్గారాలను తగ్గించే ప్రయత్నంలో- గ్రెటా సుదీర్ఘ రైలు ప్రయాణాలు చేసింది. ఐక్యరాజ్యసమితి కార్యక్రమంలో పాల్గొనేందుకు న్యూయార్క్‌ చేరుకునేందుకు అట్లాంటిక్ మహా సముద్రంలోనూ ప్రయాణం చేసింది.

 
2020లో ప్రముఖ ట్రావెల్ ట్రెండ్స్‌లో గ్రెటా విధానం ఒకటవుతుందని 'అసోసియేషన్ ఆఫ్ బ్రిటిష్ ట్రావెల్ ఏజెంట్స్(ఏబీటీఏ)' లాంటి సంఘాలు చెబుతున్నాయి.

 
పర్యావరణ అనుకూల 'వీఎస్‌సీవో'
'వీఎస్‌సీవో' - ఇదో ట్రెండ్. ఇంటర్నెట్‌లో ఇది విపరీతంగా వ్యాప్తి చెందింది. దీని మద్దతుదారుల్లో 15 ఏళ్ల అమెరికన్ ఎమ్మా మేరీ ఒకరు. ఆమె యూట్యూబ్ చానల్‌కు 10 లక్షల మందికి పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. టీనేజర్లు మొగ్గుచూపే పర్యావరణ అనుకూల ఫ్యాషనే వీఎస్‌సీవో. వీఎస్‌సీవో ట్రెండ్ విస్తరణ వల్ల 2019లో మేకప్‌పై టీనేజీ అమ్మాయిల వ్యయం 21 శాతం తగ్గినట్లు అమెరికాలో సర్వేలు చెబుతున్నాయి.

 
ఆన్‌లైన్లో 500 కోట్ల మంది?
2020లో కొత్తగా ఎంత మంది ఇంటర్నెట్ సదుపాయాన్ని పొందుతారు? నెట్ వాడేవారి సంఖ్య ఎంతకు పెరుగుతుంది? ఇది 500 కోట్లకు చేరుకోవచ్చనే అంచనాలు ఉన్నాయి.

 
కన్సోల్ యుద్ధాలు
ప్రఖ్యాత సంస్థలు సోనీ, మైక్రోసాఫ్ట్ కొత్త గేమ్ కన్సోల్‌లను 2020 చివర్లోగా విడుదల చేయబోతున్నాయి. సోనీకి చెందిన పీఎస్5, మైక్రోసాప్ట్‌కు చెందిన ఎక్స్‌బాక్స్ ప్రాజెక్ట్ స్కార్లెట్ కన్సోల్‌ల ఖరీదు ఇంచుమించు 500 డాలర్ల చొప్పున ఉంటుందనే ప్రచారం జరుగుతోంది.
వీజీ చార్ట్జ్ కన్సల్టెనీ సంస్థ గణాంకాల ప్రకారం- 2019 అక్టోబరు నాటికి సోనీకి చెందిన పీఎస్4 యూనిట్లు ప్రపంచవ్యాప్తంగా పది కోట్లకు పైగా అమ్ముడయ్యాయి. అయితే పీఎస్‌4కు సమానమైన మైక్రోసాఫ్ట్ ఉత్పత్తి ఎక్స్‌బాక్స్ వన్ యూనిట్లు 4.3 కోట్లే విక్రయమయ్యాయి.

 
ఒలింపిక్స్
1936 బెర్లిన్ ఒలింపిక్స్‌లో బంగారు పతకం గెలుచుకున్న 13 ఏళ్ల అమెరికన్ డైవర్ మర్జోరీ జెస్ట్రింగ్ అత్యంత పిన్న వయస్కురాలైన ఒలింపిక్ చాంపియన్‌గా రికార్డులకు ఎక్కారు. ఏడు నుంచి పదేళ్ల వయసున్న ఒక ఫ్రాన్స్ బాలుడు 1990 పారిస్ ఒలింపిక్స్‌లో డచ్ రోయింగ్ జట్టు ప్రథమ స్థానంలో నిలవడంలో సహకరించాడని చెబుతారు. అతడి వివరాలు నిర్ధరణకాలేదు. అధికారికంగా అత్యంత తక్కువ వయసున్న చాంపియన్ మర్జోరీనే.

 
11 ఏళ్ల స్కై బ్రౌన్ అనే బ్రిటన్ స్కేట్‌బోర్డర్ సెప్టెంబరులో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీల్ల కాంస్య పతకం గెలుచుకుంది. 2020 టోక్యో ఒలింపిక్స్‌కు ఈ అమ్మాయి అర్హత సాధిస్తే అత్యంత పిన్న వయస్కురాలైన బ్రిటన్ ఒలింపియన్ ఈమే అవుతుంది. టోక్యో ఒలింపిక్స్ జులై 24 నుంచి ఆగస్టు 9 మధ్య జరుగనున్నాయి. స్కేట్‌బోర్డింగ్, వాల్-క్లైంబింగ్, సర్ఫింగ్, కరాటే, సాఫ్ట్‌బాల్ క్రీడలు తొలిసారిగా ఒలింపిక్స్ పోటీల్లోకి వచ్చాయి.