లిటిల్ ఇండియా గేట్‌వే శంకుస్థాపన కార్యక్రమానికి ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని ఆల్బనీస్ హాజరు కావడం ఆయనకు భారతీయుల పట్ల ఉన్న అభిమానాన్ని చూపిస్తోందని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో భారత సంతతి ప్రజలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలోనే మోదీ, ఆల్బనీస్ కలిసి లిటిల్ ఇండియా గేట్‌వేకి శంకుస్థాపన చేశారు.
ఈ ఏడాది భారత గడ్డ మీద అహ్మదాబాద్‌లో ఆంథోని ఆల్బనీస్‌కు స్వాగతం పలికే అవకాశం తనకు వచ్చినట్లు మోదీ గుర్తు చేసుకున్నారు. ఈరోజు లిటిల్ ఇండియా పునాది రాయిని ఇక్కడ ఆవిష్కరించే అవకాశాన్ని ఆయన నాకు ఇచ్చారు. ఈ అవకాశం ఇచ్చినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈ శంకుస్థాపన కార్యక్రమానకి అల్బనీస్ రావడం భారతీయుల పట్ల ఆయనకున్న అభిమానాన్ని చాటుతుంది అని మోదీ అన్నారు. అనంతరం ఈ కార్యక్రమంలో ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్ ప్రసంగిస్తూ 'మోదీ బాస్' అని వ్యాఖ్యానించారు.
ఇరు దేశాల స్నేహం క్రికెట్ లాంటిది
2014 ఆస్ట్రేలియా పర్యటనలో ప్రసంగిస్తూ, మరోసారి భారత ప్రధానిని ఆస్ట్రేలియాలో చూడటానికి 28 ఏళ్లు వేచి చూడాల్సిన అవసరం రాదని స్వయంగా తానే ఇచ్చిన హామీని మోదీ మరోసారి గుర్తు చేశారు. భారత్, ఆస్ట్రేలియా దేశాల మధ్య అనుబంధాన్ని చాలాకాలంగా క్రికెట్ నిలబెట్టుతోందని వ్యాఖ్యానించిన మోదీ, ఇప్పుడు టెన్నిస్, సినిమాలు కూడా ఇరు దేశాల మధ్య సంబంధాలను పటిష్టం చేస్తున్నాయని అన్నారు. ఒకప్పుడు మూడు సీ అక్షరాలతో ఇరు దేశాల సంబంధాన్ని నిర్వచించేవారు. అవేంటంటే కామన్వెల్త్, క్రికెట్, కర్రీ. ఆ తర్వాత ఈ వరుసలోకి డెమొక్రసీ, డయాస్పోరా, దోస్తీ అనే త్రీడీ వచ్చి చేరింది. ఇప్పుడు 3-ఈ సమయం ఆసన్నమైంది. ఎనర్జీ, ఎకానమీ, ఎడ్యుకేషన్. క్రికెట్ మ్యాచ్‌లో ఎంత థ్రిల్ ఉంటుందో, మైదానం వెలుపల ఇరు దేశాల మధ్య స్నేహం కూడా అంతే ఉంటుందని మోదీ అన్నారు.
షేన్ వార్న్ ప్రస్తావన
ఆస్ట్రేలియా దివంగత క్రికెటర్ షేన్ వార్న్‌ను స్మరించుకుంటూ ప్రధాని మోదీ ఇలా అన్నారు. "నిరుడు దిగ్గజ క్రికెటర్ షేన్ వార్న్ చనిపోయినప్పుడు, ఆస్ట్రేలియన్లతో పాటు కోట్లాది మంది భారతీయులు కూడా విచారంలో మునిగిపోయారు. మాలోని ఒకరిని కోల్పోయినట్లుగా భారతీయులంతా బాధపడ్డారు. అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ఎదగాలి అనేది మీ అందరి కల. అదే కల నా గుండెల్లోనూ ఉంది. భారత్‌లో నైపుణ్యం, సమర్థతకు లోటు లేదు. వనరుల కొరత కూడా లేదు. నేడు ప్రపంచంలోనే ఎక్కువ యువ నైపుణ్యం భారత్ వద్దే ఉంది అని అక్కడున్న వారిని ఉద్దేశిస్తూ మోదీ ప్రసంగించారు.
బ్రిస్బేన్‌లో రాయబార కార్యాలయం
ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో కొత్త కాన్సులేట్‌ను ప్రారంభిస్తామని ప్రధాని మోదీ తెలిపారు. భారత్ జీ20 ప్రెసిడెన్సీ థీమ్ గురించి ఆలోచించినప్పుడు ఒకే భూమి (ఏక్ ధర్తీ), ఒకే కుటుంబం (ఏక్ పరివార్), ఒకే భవిష్యత్ (ఏక్ భవిష్య్) అని.. పర్యవరణ పరిరక్షణకు సౌరశక్తి విషయంలో పెద్ద లక్ష్యాలను నిర్దేశించుకున్నప్పుడు ఒకే సూర్యుడు (ఏక్ సూరజ్), ఒకే ప్రపంచం (ఏక్ దునియా), ఒకే గ్రిడ్ అని... ప్రపంచ సమాజం ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ ఒకే భూమి (ఏక్ ధర్తీ), ఒకే ఆరోగ్యం అంటూ చెబుతుంది. ఈ రోజు భారత్‌ను 'ఫోర్స్ ఆఫ్ గ్లోబల్ గుడ్' అని పిలుస్తున్నారు. ఎక్కడ ఏ విపత్తు వచ్చినా సహాయం చేయడానికి భారత్ సిద్ధంగా ఉంటుంది.
తుర్కియేలో భూకంపం వచ్చినప్పుడు ఆపరేషన్ దోస్త్ ద్వారా భారత్ సహాయం అందించింది. నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నా. మీరు భారత్‌కు వచ్చినప్పుడల్లా మీతో పాటు ఒక ఆస్ట్రేలియా మిత్రున్ని గానీ లేదా ఒక కుటుంబాన్ని కూడా భారత్‌కు తీసుకురండి. ఇది భారత్ గురించి వారు అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అని మోదీ ప్రసంగంలో భారత సంతతి ప్రజలను కోరారు.
ప్రధాని మోదీ బాస్: ఆల్బనీస్
ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతూ ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని ఆల్బనీస్ మాట్లాడారు. నేను ఇంతకుముందు కూడా ఈ వేదికపైకి వచ్చాను. అప్పుడు నాతో అమెరికన్ సింగర్ బ్రూస్ స్పింగ్‌స్టీన్ ఉన్నారు. కానీ, ఇప్పుడు మోదీకి లభిస్తున్నంత ఆదరణ అప్పుడు బ్రూస్‌కు కూడా దక్కలేదు. మోదీ ఒక బాస్ అని ఆల్బనీస్ అన్నారు. "నేను గతేడాది భారత్‌కు వెళ్లాను. అవి నాకు మరచిపోలేని క్షణాలు. గుజరాత్‌లో హోలీ జరుపుకోవడం, దిల్లీలో మహాత్మా గాంధీకి నివాళులు అర్పించడం, నేను వెళ్లిన ప్రతిచోటా భారత్, ఆస్ట్రేలియా ప్రజల మధ్య అనుబంధాన్ని అనుభవించాను. మీరు భారత్ గురించి తెలుసుకోవాలంటే రైలు లేదా బస్సులో ప్రయాణించండి అంటూ ఆల్బనీస్ భారత్ గురించి మాట్లాడారు.