1. వార్తలు
  2. బిజినెస్
  3. బడ్జెట్ 2016-17
Written By ivr
Last Modified: శనివారం, 20 ఫిబ్రవరి 2016 (20:19 IST)

ఫిబ్రవరి 25న రైల్వే బడ్జెట్ 2016-17, 29న ఆర్థిక బడ్జెట్ 2016-17

ఈ నెల 23వ తేదీ నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. 25వ తేదీన రైల్వే బడ్జెట్, 29వ తేదీన ఆర్థిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. కాగా, ఈనె 23వ తేదీన ప్రారంభమయ్యే బడ్జెట్‌ సమావేశాల ప్రథమార్థం మార్చి 16వ తేదీన ముగుస్తుంది. ద్వితీయార్థం ఏప్రిల్‌ 25న ప్రారంభమై మే 13న ముగుస్తుంది. 
 
ఈ నెల 23న పార్లమెంట్‌ ఉభయసభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ చేసే ప్రసంగంతో సమావేశాలు ప్రారంభమవుతాయి. త్వరలో ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సమావేశాలను కుదించవచ్చని, మధ్యలో విరామం ఉండకపోవచ్చని ప్రచారం జరిగినా సమావేశాలు యథావిధిగానే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2011లో ఈ రాష్ట్రాలకే ఎన్నికలు జరిగినప్పుడు సమావేశాల మధ్య విరామాన్ని ఎత్తివేశారు. అప్పట్లో బిల్లులను స్థాయీ సంఘాల పరిశీలనకు పంపలేదు. అయితే ఈ సారి విరామ సమయంలో బిల్లులను స్థాయీ సంఘం పరిశీలనకు పంపించాలని ప్రభుత్వం నిర్ణయించింది.