మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 2 మార్చి 2021 (10:30 IST)

పెట్రోల్ - గ్యాస్ ధరలే కాదు.. సీఎన్జీ - పీఎన్జీ గ్యాస్ ధరలు కూడా బాదుడే

దేశంలో పెట్రోల్, వంట గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అయితే, కేవలం పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు మాత్రమే పెరుగుతున్నాయని అనుకుంటే పొరబడినట్టే. ఇప్పుడు సీఎన్జీ, పీఎన్జీ కూడా మరింత ప్రియం అయ్యింది. 
 
రాజధాని ఢిల్లీలోని ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్(ఐజీఎల్) ప్రతినిధులు తెలిపిన వివరాల ప్రకారం ఈరోజు(మంగళవారం) ఉదయం నుంచి ఢిల్లీలో లీటరు సంపీడన సహజ వాయువు (సీఎన్జీ) రూ.42.70 నుంచి రూ.43.40కి పెరిగింది. 
 
అలాగే లీటరు పెట్రోలియం నేచురల్‌ గ్యాస్ (పీఎన్జీ) రూ.28.41కి లభ్యంకానుంది. పీఎన్జీ ధర లీటరుకు రూ.0.91 మేరకు పెరిగింది. గజియాబాద్‌లో లీటరు పీఎన్జీ రూ.28.36కు లభ్యమవుతోంది. కాగా సోమవారం వంటగ్యాస్ సిలిండర్ రూ.25 పెరిగింది. ఈ ధరల పెరుగుదల ఉజ్వల యోజన లబ్ధిదారులకు సైతం వర్తించనుంది. 
 
కాగా, వంట గ్యాస్‌ వినియోగదారుల నడ్డివిరిచేలా చమురు సంస్థలు ధరలు పెంచుతూనే ఉన్నాయి. నెల రోజుల వ్యవధిలోనే ఏకంగా నాలుగుసార్లు సిలిండర్‌ ధర పెరగటంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. సోమవారం సిలిండర్‌ ధర మరో రూ.25 పెరిగింది. 
 
దీంతో హైదరాబాద్‌లో 14.2 కిలోల సిలిండర్‌ ధర రూ.846.50 నుంచి రూ.871.50కి చేరింది. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సబ్సిడీ ఇవ్వకపోవడంతో వినియోగదారులు మొత్తం ధర చెల్లించి సిలిండర్‌ను కొనుగోలు చేయాల్సి వస్తుండటం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇక ఫిబ్రవరిలో గ్యాస్‌ సిలిండర్‌ ధర ఏకంగా రూ.100 పెరిగింది. మార్చి ఒకటిన పెరిగిన ధరతో ఇది రూ.125కు చేరింది.