సోమవారం, 30 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 23 ఫిబ్రవరి 2021 (11:43 IST)

పెట్రోల్ బాదుడును ఆపలేం.. మీరే తగ్గించుకోండి.. కేంద్రం

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల సాకుతో దేశంలోని చమురు కంపెనీలు ఇష్టానుసారంగా ధరలను పెంచేస్తున్నాయి. దీంతో పలు రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలు ఇప్పటికే సెంచరీ కొట్టేశాయి. దీంతో వాహనదారులతో పాటు... రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంపై మండిపడుతున్నాయి. ఎక్సైజ్ డ్యూటీ తగ్గించాలంటూ ప్రతిపక్షాల నుంచి కేంద్రంపై తీవ్రమైన ఒత్తిడి వస్తోంది. 
 
కానీ కేంద్రం మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఎక్సైజ్ డ్యూటీని తగ్గించేది లేదంటూ బలంగా నిశ్చయించుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ఉత్పత్తి తగ్గడం వల్లే ఇంధన ధరలు పెరుగుతున్నాయంటూ కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇటీవల ప్రకటించారు. 
 
అంతకు ముందు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్ మాట్లాడుతూ.. చమురు ధర పెరుగుదల ప్రభుత్వం నియంత్రణలో లేవని తేల్చి చెప్పారు. చమురు ధరలు తగ్గడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఒక విధానాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఇలా ఒకరు తర్వాత ఒకరు ప్రకటనలు చేస్తున్నారే తప్ప.. ఎక్సైజ్ డ్యూటీని తగ్గించడానికి మాత్రం నిరాకరిస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, అస్సాం, మేఘాలయ రాష్ట్రాలలో పెట్రోల్, డీజిల్ రేట్లు భారీగా తగ్గాయి. దాదాపు రూ.5 మేరకు వినియోగదారులకు ఊరట లభిస్తోంది. మొదట జనవరి 29 న రాజస్థాన్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ను 38 శాతం నుంచి 36 శాతానికి తగ్గించింది. 
 
ఆ తర్వాత పశ్చిమ బెంగాల్‌లో పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌లో లీటరుకు ఒక రూపాయి తగ్గింపును మమతా బెనర్జీ ప్రభుత్వం ప్రకటించింది. ఫిబ్రవరి 12న అస్సాం రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం కరోనా సంక్షోభ సమయంలో పెట్రోల్, డీజిల్‌పై విధించిన 5 రూపాయల అదనపు పన్నును కూడా తొలగించింది. 
 
అదేసమయంలో, ఈశాన్య రాష్ట్రం మేఘాలయ కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకుంది. ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్‌పై రూ.7.40, డీజిల్‌పై రూ.7.10 తగ్గించాలని నిర్ణయించింది. ఇది వినియోగదారులకు అతిపెద్ద ఊరట కలిగించే అంశం.