శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 1 నవంబరు 2024 (09:13 IST)

నేడు దీపావళి ట్రేడింగ్.. సాయంత్రం ఓ గంట ప్రత్యేక ట్రేడింగ్ సెషన్

trading
సాధారణంగా తెలుగు వారికి ఉగాది కొత్త సంవత్సరాది. అలాగే, దేశ ప్రజలందరికీ జనవరి ఒకటో తేదీ నుంచి డిసెంబరు 31వ తేదీ వరకు క్యాలెండర్ ఇయర్. ఏప్రిల్ 1వ తేదీ నుంచి మార్చి 31వ తేదీ వరకు ఆర్థిక సంవత్సరం. 
 
ఏప్రిల్‌ 1 నుంచి ఆర్థిక సంవత్సరం ఎలా ప్రారంభమవుతుందో.. మార్కెట్లకు దీపావళితో కొత్త ఏడాది ప్రారంభమవుతుంది. ఈ దీపావళి నుంచి సంవత్‌ 2081 ఆరంభంకానుంది. గురువారమే దేశమంతా దీపావళి జరుపుకోగా.. శుక్రవారం స్టాక్‌ మార్కెట్‌లు మూరత్‌ ట్రేడింగ్‌ నిర్వహించనున్నాయి. శుక్రవారం మార్కెట్లు పూర్తి స్థాయిలో పనిచేయవు. సాయంత్రం ఓ గంట పాటు మాత్రం ప్రత్యేక ట్రేడింగ్‌ సెషన్‌ జరుగుతుంది. ఇంతకీ ఎందుకీ మూరత్‌ ట్రేడింగ్‌? ఏ సమయంలో జరుగుతుంది?
 
దీపావళి రోజున ఏదైనా పని ప్రారంభిస్తే విజయం వరిస్తుందన్నది భారతీయుల ప్రగాఢ విశ్వాసం. అదే తరహాలో స్టాక్‌ మార్కెట్‌లో ఈ పర్వదినం రోజు ట్రేడింగ్‌ చేస్తే.. వచ్చే దీపావళి వరకు లాభాల పంట పండుతుందని చాలా మంది భావిస్తారు. ఆ నమ్మకంతోనే చాలా మంది మూరత్‌ ట్రేడింగ్‌లో పాల్గొనేందుకు మక్కువ చూపుతుంటారు. 
 
అందుకే ఈ ట్రేడింగ్ కోసం అనేక మంది అమిత ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు ఈ ట్రేడింగ్‌ జరగనుంది. ఇప్పటికే పెట్టుబడులు పెడుతున్న వారికీ, కొత్తగా మార్కెట్లోకి రావాలనుకునే వారికీ ఇది ఎంతో ప్రత్యేకం. మంచి కంపెనీలను ఎంచుకొని, దీర్ఘకాలంపాటు అందులో కొనసాగినప్పుడు ఆశించిన లాభాలను పొందేందుకు అవకాశం ఉంటుంది.