సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న జీఎస్టీ వసూళ్లు - తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే...
దేశంలో జీఎస్టీ వసూళ్లు సరికొత్త రికార్డులను నెలకొల్పుతున్నాయి. గత నెలలో ఏకంగా 1.6లృ2 లక్షల కోట్ల రూపాయల మేరకు జీఎస్టీ వసూళ్లు సాధించినట్టు కేంద్రం వెల్లడించింది. గత యేడాది సెప్టెంబరు నెలతో పోల్చితే ఈ వసూళ్లు పది శాతం అధికమని పేర్కొంది. పైగా, ఈ యేడాది రూ.1.62 లక్షల జీఎస్టీ వసూళ్లు దాటడం ఇదే నాలుగోసారని కేంద్రం తెలిపింది.
2022 సెప్టెంబరు నెలలో రూ.1.47 లక్షల కోట్ల జీఎస్టీ వసూలు కాగా, ప్రస్తుతం ఇది రూ.1.62 లక్షల కోట్లకు చేరింది. సెప్టెంబరు కేంద్ర జీఎస్టీ రూ.29,818 కోట్లు కాగా, రాష్ట్ర జీఎస్టీ రూ.37,657 కోట్లు. సమీకృత జీఎస్టీ రూ.83,623 కోట్లు (వస్తు దిగుమతులపై వసూలైన రూ.41,145 కోట్లు కలుపుకుని) అని కేంద్రం తెలిపింది. ఇక సెస్ రూపంలో రూ.11613 కోట్లుగా ఉందని తెలిపింది.
ఇందులో తెలంగాణ రాష్ట్ర నుంచి రూ.5226 కోట్లు వసూలు కాగా, ఏపీ నుంచి రూ.3915 కోట్ల మేరకు జీఎస్టీ వసూలైనట్టు పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు వసూలైన జీఎస్టీ వసూళ్లను పరిశీలిస్తే, ఏప్రిల్ నెలలో రూ.181035, మే నెలలో రూ.157090, జూన్ నెలలో రూ.161497, జూలై నెలలో రూ.165105, ఆగస్టు నెలలో రూ.159069, సెప్టెంబరు నెలలో రూ.162712 లక్షల కోట్లు చొప్పున జీఎస్టీ పన్ను వసూలైంది.