గురువారం, 2 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 14 డిశెంబరు 2020 (09:37 IST)

చెక్కుల జారీకి కొత్త విధానం.. పాజిటివ్ పే సిస్టమ్‌తో మోసాలకు అడ్డుకట్ట!

భారత రిజర్వు బ్యాంకు మరో కొత్త నిబంధన తీసుకొచ్చింద. చెక్కుల జారీలో జరుగుతున్న మోసాలను అరికట్టేందుకు వీలుగా పాజిటివ్ పే సిస్టమ్ పేరుతో ఈ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇది వచ్చే యేడాది జనవరి నుంచి అమల్లోకి రానుంది. ఈ విషయాన్ని భారతీయ రిజర్వు బ్యాంకు ఓ ప్రకటనలో పేర్కొంది. 
 
పైగా, పాజిటివ్ పే సిస్టమ్ గురించి ఇప్పటికే అన్ని బ్యాంకులకు ఆర్బీఐ లిఖిత పూర్వక నోట్‌ను కూడా పంపించింది. అయితే పాజిటివ్‌ పే సిస్టమ్‌ కావాలా.. వద్దా.. అనేది ఖాతాదారుల ఇష్టానికే వదిలేసింది. 
 
అసలు పాజిటివ్ పే సిస్టమ్‌ అంటే ఏంటో పరిశీలిస్తే, రూ. 50 వేలకన్నా ఎక్కువ విలువ కలిగిన చెక్కులకు పేమెంట్లు చేసే సమయంలో బ్యాంకు అధికారులు చెక్కుపై ఉన్న వివరాలను మళ్లీ ఒకసారి చెక్కు జారీ చేసిన ఖాతాదారునితో నిర్ధారించుకుంటారు. 
 
ఆ తర్వాత పేమెంట్లు జరుపుతారు. ఇలా చేయడం వల్ల చెక్కుల ద్వారా చెల్లింపులు చేసే సమయంలో మోసాలకు అడ్డుకట్ట వేయవచ్చని ఆర్బీఐ గట్టిగా నమ్ముతోంది. అందువల్లే ఈ విధానాన్ని వచ్చే యేడాది జనవరి ఒకటో తేదీ నుంచి అమలు చేయనుంది. 
 
ఈ విధానం కింద ... చెక్కు నంబర్‌, తేదీ, చెల్లిస్తున్న వారి ఖాతా నంబర్‌, ఎంత డబ్బు చెల్లిస్తున్నారన్న విషయాలను బ్యాంకు అధికారులు చెక్కు ఇష్యూ చేసిన వ్యక్తితో మరోసారి ధ్రువీకరించుకుంటారు. ఈ విధానాన్ని నేషనల్‌ పేమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) అభివృద్ధి చేసింది. 
 
చెక్‌ జారీ చేసే ఖాతాదారుడు ఆ చెక్కు తేదీ, ఎవరికి చెక్కు ఇస్తున్నారు, ఎంత మొత్తం వంటి వివరాలను ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, ఏటీఎం, ఎస్‌ఎంఎస్‌, మొబైల్‌ అప్లికేషన్‌ ద్వారా చెక్కు డ్రా చేసుకొనే బ్యాంకుకు పంపించాల్సివుంటుంది. 
 
ఈ వివరాలు పాజిటివ్‌ పే సిస్టమ్‌లో సేవ్‌ అవుతాయి. చెక్కు బ్యాంకుకు వచ్చినప్పుడు ఇష్యూ చేసిన వ్యక్తి ఇచ్చిన సమాచారంతో చెక్‌పై ఉన్న వివరాలను పోల్చి చూసి.. అన్ని వివరాలు సరిపోలితేనే చెక్కును ప్రాసెస్‌ చేస్తారు. లేకపోతే రిజెక్ట్‌ చేస్తారు. 
 
పాజిటివ్‌ పే విధానం తప్పనిసరికాదు. అయితే రూ.5 లక్షలు అంతకంటే ఎక్కువ పేమెంట్లకు బ్యాంకులు దీనిని తప్పనిసరి చేయవచ్చు. పాజిటివ్‌ పే విధానంపై ఖాతాదారులకు అవగాహన కల్పించాలని ఆర్బీఐ అన్ని బ్యాంకు శాఖలను ఆదేశించింది.