శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 4 మే 2021 (09:33 IST)

మహా మోసం : పెట్రోల్ - డీజల్ ధరల బాదుడు మొదలు

ప్రతి ఒక్కరూ ముందుగా ఊహించనట్టే జరిగింది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే ప్రభుత్వ రంగ సంస్థలు పెట్రోల్, డీజల్ ధరల బాదుడును మొదలుపెట్టాయి. గత 18 రోజుల పాటు పెరగని ధరలు మంగళవారం పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోలుపై 15 పైసలు, డీజిల్ పై 16 పైసల మేరకు ధరను పెంచుతున్నట్టు ప్రకటన వెలువడింది. 
 
దీంతో పెట్రోలు ధర రూ.90.56కు, డీజిల్ ధర రూ.80.73కు పెరిగింది. గడచిన రెండు నెలల వ్యవధిలో కేవలం రెండు మూడు సార్లు మాత్రమే పెట్రోలు ధరల సవరణ జరిగింది. అది కూడా ధరల తగ్గింపు మాత్రమే కనిపించింది. ఎన్నికల ప్రక్రియ పూర్తిగా ముగియగానే ధరలు పెరగడం గమనార్హం.
 
కాగా, గత సంవత్సరంలో పెట్రోలు ధర సగటున రూ.21.58, డీజిల్ ధర రూ.19.18 పెరిగింది. అయితే, కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పెట్రో ఉత్పత్తులకు డిమాండ్ తగ్గిన కారణంగానే ధరలను పెంచలేదని, మొత్తం మీద 7 శాతం వరకూ డిమాండ్ తగ్గిందని చమురు కంపెనీలు వాదిస్తున్నాయి. 
 
ఇదేసమయంలో అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగాయని, ఆ కారణంగానే దేశంలోనూ ధరలను సవరించాల్సి వచ్చిందని స్పష్టం చేశాయి. దేశఁలో పన్నులు లేకుంటే, పెట్రోలు ధర లీటరుకు రూ.33 మించదు. కానీ, అసలు పెట్రోల ధర కంటే.. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్నులే అధికంగా ఉండటం గమనార్హం. 
 
ఉదాహరణకు ఢిల్లీనే చూసుకుంటే, అక్కడ లీటరు పెట్రోలు ధర రూ.32.98 కాగా, రాష్ట్ర ప్రభుత్వ సేల్స్ ట్యాక్స్, వ్యాట్ కలిపి రూ.19.55 కాగా, సెంట్రల్ ఎక్సైజ్ సుంకం రూ.31.83, వ్యాట్ రూ.10.99 ఉంది. దీనికి డీలర్ కమిషన్ అదనం. పన్నుల భారాన్ని తగ్గిస్తే, పెట్రోలు ధరలు అందరికీ అందుబాటులో ఉంటాయని నిపుణులు సూచిస్తున్నా, ఆయిల్ రంగాన్ని తమకున్న ప్రధాన ఆదాయ వనరుల్లో ఒకటిగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయనడంలో సందేహం లేదు.