రైల్వేల్లో దుర్గంధాన్ని పసిగట్టే అత్యాధునిక సాంకేతికత!!
దేశంలో నిత్యం పరుగులు తీసే రైళ్లలో అనేక రైలు బోగీల్లో దుర్గంధం వెదజల్లుతుంటుంది. ఈ దుర్వాసను భరిస్తూనే ప్రయాణికులు ప్రయాణం చేస్తున్నారు. ముఖ్యంగా, దూర్గంధ భూయిష్ట, అపరిశుభ్ర టాయిలెట్లు ప్రధాన సమస్యగా ఉంది.
ఈ సమస్య పరిష్కారానికి రైల్వే శాఖ ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడం లేదు. పైగా, రైళ్లలోని అపరిశుభ్రతపై ప్రయాణికుల ఫిర్యాదులు కొనసాగుతూనే ఉన్నాయి.
ఈ నేపథ్యంలో ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు వీలుగా రైల్వే శాఖ అత్యాధునిక ఐఓటీ సాంకేతికతను (ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్) వినియోగించే యోచనలో ఉంది.
ఈ దిశగా రైల్వే బోర్డు కీలక ప్రతిపాదనలు చేసింది. జాతీయ మీడియా కథనాల ప్రకారం, ఈ సాంకేతికను రైల్వే బోర్డు ప్రయోగాత్మకంగా కొన్ని కోచ్‌లలో పరీక్షించనుంది. ఈ పైలట్ ప్రాజెక్టును అమలు పరిచేందుకు రైల్వే బోర్డు.. ముంబైకి చెందిన విలిసో టెక్నాలజీస్ సంస్థను ఎంపిక చేసింది.
ప్రాజెక్టులో భాగంగా ఎంపిక చేసిన కొన్ని బోగీలలో మరుగుదొడ్లలో ప్రత్యేక డిటెక్టర్లను ఏర్పాటుచేశారు. బాత్రూమ్‌లలో దుర్గంధానికి కారణమయ్యే వాయువులను ఇవి గుర్తిస్తాయి. ఈ సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఇంటర్నెట్ ద్వారా ఓ సెంట్రల్ హబ్‌కు చేరవేస్తాయి.
ఈ సమాచారం ఆధారంగా పారిశుద్ధ్య సిబ్బంది.. అపరిశుభ్ర టాయిలెట్ల సమాచారం అందిన వెంటనే వెళ్లి సమస్య పరిష్కరిస్తారు. సంబంధిత సిబ్బందికి మొబైల్ యాప్, వెబ్ యాప్ ద్వారా ఈ సమాచారం అందుతుందని విలిసో టెక్నాలజీస్ పేర్కొంది. అయితే, ఇది ఏ మేరకు సక్సెక్ అవుతుందో వేచి చూడాలి.