ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 28 నవంబరు 2024 (14:57 IST)

మాలీవుడ్ ప్రేక్షకులకు ఇచ్చే అతిపెద్ద బహుమతి ఇదే : అల్లు అర్జున్

allu arjun
మాలీవుడ్ ప్రేక్షకులకు తానిచ్చే అతిపెద్ద బహుమతి పుష్ప-2 చిత్రమేనని టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ అన్నారు. డిసెంబరు 5వ తేదీన ఈ చిత్రం విడుదల కానుంది. దీన్ని పురస్కరించుకుని దేశంలోని ప్రధాన నగరాల్లో ప్రీరిలీజ్ ఈవెంట్స్‌ను నిర్వహిస్తుంది. ఇందులోభాగంగా, బుధవారం కొచ్చి వేదికగా ఈ వేడుకలు జరిగాయి. ఇందులో అల్లు అర్జున్, రష్మిక మందన్నా, దర్శకుడు సుకుమార్ తదితరులు పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా అల్లు అర్జున్ ప్రసంగిస్తూ, 'ఆర్య' సినిమా నుంచి తనని ఆదరిస్తున్న మలయాళ ప్రేక్షకులకు తాను ఎంతో రుణపడి ఉంటానని అన్నారు. ఆ సినిమా నుంచే మలయాళంలో తన మార్కెట్ మొదలైందని చెప్పాడు. తన సినిమాలో ఫహాద్ ఫాజిల్ నటించడం తనకి చాలా సంతోషాన్ని కలిగించిన విషయమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
 
ఈ సినిమాలోని ఒక పాట మలయాళ లిరిక్స్‌తో మొదలవుతుందనీ, ఏ భాషలో 'పుష్ప 2' విడుదలైనా, ఆ పాట స్టార్టింగ్ లిరిక్స్ మలయాళంలోనే ఉంటాయని అన్నారు. అదే మలయాళ ఫ్యాన్స్‌కి తాను ఇచ్చే గిఫ్ట్" అంటూ వాళ్లని హుషారెత్తించారు. ఇక రష్మిక మరింత అందంగా కనిపిస్తూ ఈవెంటుకు ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచింది. ఈవెంట్ అంతా నవ్వుతూ కనిపించడమే కాకుండా, స్టేజ్ పై స్టెప్పులతోను అలరించింది.
 
కాగా, గతంలో వచ్చిన పుష్ప చిత్రం ఇతర భాషలతో పాటు మలయాళంలో కూడా ఘన విజయం సాధించింది. ఈ సినిమా మలయాళ వెర్షన్‌కి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంటుకు, కేరళలోని 'కొచ్చి' వేదికగా మారింది. ఈ వేడుకలో అల్లు అర్జున్ తనదైన స్టైల్లో సందడి చేశారు. 
 
ముఖ్యంగా, ఎయిర్ పోర్టు నుంచి ఈవెంట్ జరిగే ప్రాంతం వరకు అల్లు అర్జున్‌కి ఘన స్వాగతం చెబుతూ పెద్ద పెద్ద బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఆయన అభిమానులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. అక్కడి వాతావరణం.. వాళ్లు చూపిస్తున్న అభిమానం ఆయనలో మరింత ఉత్సాహాన్ని తెచ్చిపెట్టినట్టుగా కనిపించింది. దాంతో ఆయన మరింత ఉల్లాసంగా .. ఉత్సాహంగా కనిపించారు.