శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. చెన్నై వార్తలు
Written By
Last Modified: మంగళవారం, 7 మే 2019 (15:50 IST)

పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం... తలుపు తీసి చూస్తే శవమై కనబడిన ప్రియుడు

ప్రేమ వివాహాలు కొన్ని విషాదాన్ని మిగల్చడం అప్పుడప్పుడు చూస్తూనే వుంటాం. పెద్దలు కుదిర్చిన పెళ్లిలో ఎన్ని అవాంతరాలు ఎదురయినా ఆదుకునేందుకు అటువారో ఇటువారో వుంటారు. కానీ ప్రేమ పెళ్లి చేసుకున్న జంటలను ఆదుకునేందుకు ఎవ్వరూ నిలబడరు. పెద్దలు చేసిన నిర్వాకం మూలంగా చెన్నై నగరంలో ఓ ప్రేమికుడు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. 
 
వివరాల్లోకి వెళితే... విల్లుపురం జిల్లా కంతజిపురానికి చెందిన 25 ఏళ్ల సంతోష్ కుమార్ ఉపాధి నిమిత్తం చెన్నైలోని కేకే నగర్‌కి వచ్చాడు. ఈ క్రమంలో కేకే నగర్ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న మీనాతో అతడికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. దాంతో ఆమెను పెళ్లి చేసుకుంటానని తన మనసులో మాట చెప్పాడు. కానీ ఆ తర్వాత తెలిసింది వారి కులాలు రెండూ వేరని.
 
ఏమయినప్పటికీ మీనాను పెళ్లాడుతానని మాట ఇచ్చాడు. తల్లిదండ్రులకు తన ప్రేమ విషయం చెప్పాడు. కులాలు వేరని తెలిసిన పేరెంట్స్ ఎంతకీ అతడి ప్రేమను అంగీకరించలేదు. దీనితో మే 2వ తేదీన ఇంట్లో నుంచి వచ్చేసి మీనాను పెళ్లాడాలని నిర్ణయించుకున్నాడు. తన నిర్ణయాన్ని తల్లిదండ్రులకు చెప్పాడు. ఆమెనే పెళ్లాడేటట్లయితే ఆస్తితో ఎలాంటి సంబంధం లేదని బాండ్ పేపరుపై సంతకం పెట్టాలని తండ్రి కండిషన్ పెట్టాడు. తండ్రి మాటకు కట్టుబడి పేపరుపై సంతకం పెట్టి వచ్చేశాడు. మీనాకు ఇచ్చిన మాట ప్రకారం మే 2వ తేదీన ఆమెను పెళ్లాడి వెస్ట్ మాంబళంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని అక్కడికి వచ్చారు.
 
మూడు రోజులు గడిచిపోయాయి. ఐతే తన తండ్రి తనతో సంతకం పెట్టించుకోవడంపై పదేపదే మీనా వద్ద బాధపడుతుండేవాడు. గత ఆదివారం ఉదయం భార్య మీనా గుడికి వెళ్లి ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య మీనా తలుపు తట్టినా స్పందన లేకపోవడంతో కిటికీ నుంచి చూసి పెద్దపెట్టున ఏడ్చింది. దాంతో ఇరుగుపొరుగువారు చూసి సమాచారాన్ని పోలీసులకు అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.