బై గాయ్స్... థ్యాంక్యూ ఫర్ గివింగ్ మి దిస్ వండర్‌ఫుల్ లైఫ్..
హైదరాబాద్‌లో మరో విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయితే, ఈ విద్యార్థి ఇంటర్మీడియట్‌లో ఫెయిలైన విద్యార్థికాదు. బీటెక్ విద్యార్థి. బై గాయ్స్.. థ్యాంక్యూ ఫర్ గివింగ్ మి దిస్ వండర్‌ఫుల్ లైఫ్ అంటూ స్నేహితులకు ఎస్ఎంఎస్ పెట్టి సూసైడ్ చేసుకున్నాడు.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఖమ్మం జిల్లా కల్లూరు మండలం లింగాలకు చెందిన పవన్ అనే యువకుడు హైదరాబాద్‌లోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.
ఇటీవల జరిగిన ఫస్ట్ సెమిస్టర్ పరీక్షల్లో పలు సబ్జెక్టుల్లో ఫెయిలైన పవన్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. మూడు రోజుల క్రితం ఖమ్మంలోని ముస్తాఫానగర్‌లో ఉంటూ డిగ్రీ చదువుతున్న స్నేహితుల దగ్గరకు వచ్చాడు. అయితే, కుమారుడు ఖమ్మం వచ్చిన విషయం పవన్ తల్లిదండ్రులకు తెలియదు. గురువారం రాత్రి స్నేహితులు ఉంటున్న భవనంపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు.
దీన్ని గమనించిన ఫ్రెండ్స్, స్థానికులతో కలిసి పవన్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి కిమ్స్‌కు తరలించారు. అయితే, అతడిని బతికించేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
ఆత్మహత్య చేసుకోవాలని ముందే నిర్ణయించుకున్న పవన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో 'బై గాయ్స్, థ్యాంక్యూ ఫర్ గివింగ్ మి దిస్ వండర్‌ఫుల్ లైఫ్' అంటూ మెసేజ్ పెట్టారు. అలాగే, పవన్ జేబులో ఉన్న సూసైడ్ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.