శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 6 జులై 2020 (16:56 IST)

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా రికార్డు : ఒకే రోజు 1322 కేసులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ మహమ్మారికి అడ్డూ అదుపు లేకుండా పోయింది. ఫలితంగా ప్రతి రోజూ వందల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. పైగా, ఈ వైరస్ వ్యాప్తికి ఎన్నో రకాలైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. వైరస్ వ్యాప్తి మాత్రం అదుపులోకి రావడం లేదు. 
 
తాజాగా 1322 పాజిటివ్ కేసులు వచ్చాయి. రాష్ట్రంలో ఒక్కరోజులో ఇన్ని కేసులు రావడం ఇదే ప్రథమం. అంతేకాదు, ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20 వేలు దాటింది.
 
గుంటూరు జిల్లాలో అత్యధికంగా 197, తూర్పుగోదావరి జిల్లాలో 171, అనంతపురం జిల్లాలో 142, కర్నూలు జిల్లాలో 136, చిత్తూరు జిల్లాలో 120, పశ్చిమ గోదావరి జిల్లాలో 106, విశాఖపట్నం జిల్లాలో 101 కొత్త కేసులు నమోదయ్యాయి. 
 
ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు 16,712 మందికి  కరోనా పరీక్షలు నిర్వహించగా, మొత్తం 1,322 మందికి పాజిటివ్‌గా నిర్దారణ అయింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 20,019కి చేరింది. 
 
గడచిన 24 గంటల్లో కరోనాతో ఏపీలో ఏడుగురు మృత్యువాత పడ్డారు. దాంతో కరోనా మరణాల సంఖ్య 239కి పెరిగింది. తాజాగా 424 మంది డిశ్చార్జి కాగా, 10,860 మంది చికిత్స పొందుతున్నారు.