శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 25 మార్చి 2020 (13:43 IST)

కరోనా వైరస్ సోకిన దంపతుల మృతి.. చేపలు తొట్టి కడిగే మందు తిని...

కరోనా వైరస్ సోకిన ఓ దంపతుల జంట ఇంట్లోనే స్వయంగా మందులు ఆరగించారు. అంతే.. ఆ దంపతుల్లో భర్త ప్రాణాలు పోగా, భార్య మాత్రం ప్రాణాపాయస్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటన అమెరికాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ విషాదకర సంఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
ప్రపంచాన్ని కరోనా వైరస్ కబళించింది. ఈ వైరస్‌ను అడ్డుకోవడానికి క్లోరోక్విన్ ఫాస్పేట్ చక్కగా ఉపయోగపడుతోందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించారు. దేశాధ్య‌క్షుడే చెప్ప‌డంతో అరిజోనాకు చెందిన దంపతులు తమకు సోకిన వైరస్ నుంచి విముక్తి పొందేందుకు ఈ మందును తీసుకున్నారు. 
 
ఫలితంగా అతను చనిపోగా… ఆమె ఆస్పత్రిలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. చేపల తొట్టెలను శుభ్రం చేసేందుకు వాడే మందును వాళ్లు తీసుకున్నట్లు వైద్యులు వెల్ల‌డించారు. దాదాపు 60 ఏళ్లు దాటిన ఆ దంపతులు… క్లోరోక్విన్ ఫాస్పేట్ తీసుకున్న అరగంటలో మరింత అనారోగ్యం పాలయ్యార‌ని, ఆ మందు వారిపై అత్యంత నెగెటివ్ ప్రభావం చూపింద‌ని చెప్పారు.
 
ఇలా ఎవరికి తోచినట్లు వాళ్లు ఏది బడితే ఆ మందులు వాడేయవద్దంటున్న డాక్టర్లు… కరోనా వైరస్ లక్షణాలు ఉంటే… మరో మాట ఆలోచించకుండా… టోల్ ఫ్రీ నంబర్లకు కాల్స్ చెయ్యమంటున్నారు. లేదా దగ్గర్లోని డాక్టర్లకు కాల్ చెయ్యమంటున్నారు. అంతే తప్ప మందుల షాపుల్లో ఇష్టమొచ్చిన మందులు కొనుక్కొని వాడితే… ప్రాణాలకే ప్రమాద‌మ‌ని హెచ్చ‌రిస్తున్నారు.