కోవిడ్ నియంత్రణకు రంగం సిద్ధం... అంతర్జాతీయ విమానాల రాకపోకలపై నిషేధం
కరోనా వైరస్ విజృంభిస్తోంది. దీంతో కోవిడ్ నియంత్రణకు రంగం సిద్ధమైంది. ఇందులో భాగంగా అంతర్జాతీయ విమానాల రాకపోకలపై విధించిన నిషేధాన్ని మార్చి 31 వరకూ పొడిగించినట్టు పౌరవిమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) వెల్లడించింది. అంతర్జాతీయ విమానాలపై నిషేధం మార్చి 31 అర్ధరాత్రి వరకూ కొనసాగుతుందని, సరుకు రవాణా విమానాలు, డీజీసీఏ ఆమోదం పొందిన విమాన సేవలకు ఈ నిబంధన వర్తించదని స్పష్టం చేసింది.
గత ఏడాది జూన్ 26న అంతర్జాతీయ కమర్షియల్ ప్యాసింజర్ విమానాలపై నిషేధం విధిస్తూ జారీ అయిన ఉత్తర్వుల అమలును మార్చి 31 అర్ధరాత్రి వరకూ పొడిగించామని డీజీసీఏ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొంది.
అయితే ఎంపిక చేసిన రూట్లలో అంతర్జాతీయ విమానాల రాకపోకలను ఎప్పటికప్పుడు అనుమతిస్తామని డీజీసీఏ తెలిపింది. కరోనా కట్టడికి గత ఏడాది మార్చి 23 నుంచి దేశవ్యాప్త లాక్‌డౌన్‌లో భాగంగా అంతర్జాతీయ విమానాల రాకపోకలను ప్రభుత్వం నిలిపివేసిన సంగతి తెలిసిందే.
అయితే విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను తిరిగి దేశానికి రప్పించేందుకు గత ఏడాది మే నుంచి భారత్ పలు దేశాల నుంచి వందే భారత్ మిషన్ కింద ప్రత్యేక విమానాలను నడిపింది. అమెరికా, బ్రిటన్, దుబాయ్, ఫ్రాన్స్ సహా 24 దేశాలతో విమాన సర్వీసులను నడిపేందుకు ఒప్పందాలు చేసుకుంది.