సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 26 ఫిబ్రవరి 2021 (14:29 IST)

చితిపై భార్య.. స్ట్రెచర్‌పై భర్త : గర్భిణి అంత్యక్రియలలో కలిచివేసిన సన్నివేశం

ఇటీవల హైదరాబాద్ నగరంలోని హిమాయత్ నగర్ వై జంక్షన్‌లో ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ గర్భణీ స్త్రీ ప్రాణాలు కోల్పోయింది. ఈ ప్రమాదంలో ఆమె భర్తకు కాలు విరిగింది. అయితే, గర్భిణి అంత్యక్రియలు ప్రతి ఒక్కరినీ కన్నీరు పెట్టించాయి. చితిపై భార్యకు స్ట్రెచర్‌పై ఉన్న భర్త అంత్యక్రియలు నిర్వహించడం ప్రతి ఒక్కరినీ కలిచివేసింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఉప్పల్‌కు చెందిన షాలినీకి బాకారానికి చెందిన సతీష్ గౌడకు 8 సంవత్సరాల క్రితం పెళ్లయింది. పెళ్లయిన ఐదేళ్లకు సహస్ర (ఏడాదిన్నర) జన్మించింది. షాలిని ఇటీవల మళ్లీ గర్భందాల్చింది. ఆస్పత్రికి చెకప్‌కు వెళ్లి వస్తుండగా హిమాయత్ నగర్ వై జంక్షన్‌లో ఆర్టీసీ స్కూటర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో షాలినీ చనిపయింది. భర్త సతీష్ గౌడకు కాలు విరిగింది. 
 
ఈయన్ను హిమాయత్‌నగర్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అయితే, గురువారం సాయంత్రం బాకారంలోని శ్మశాన వాటికలో షాలిని అంత్యక్రియలు జరిగాయి. ఆసుపత్రి నుంచి అంబులెన్స్‌లో వచ్చి స్ట్రెచర్‌పై పడుకుని భార్యను కడసారి చూసుకున్నాడు. 
 
మరోవైపు ఏడాదిన్నర కుమార్తెను చూస్తూ సతీష్ గౌడ్ తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఆ సన్నివేశం చూపరులను కలిచివేసింది. అంత్యక్రియల అనంతరం సతీష్ గౌడ్‌ను తిరిగి అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు.